నదిలో తల్లీకూతుళ్ల మృతదేహాలు
⇒ 20న అదృశ్యమై.. నదిలో శవాల్లా తేలారు..
⇒ అనారోగ్యమే కారణం అంటున్న బంధువులు
⇒ కూతురు మృతిపై అనుమానాలు
⇒ ప్రమాదవశాత్తూ మరో వృద్ధురాలి మృతి
⇒ మృతులంతా విజయవాడ వాసులు
తాడేపల్లి రూరల్: తాడేపల్లి పట్టణ పరిధిలోని సీతానగరం కృష్ణా రైల్వే బ్రిడ్జి దిగువన కృష్ణానదిలో గురువారం ఇద్దరు మహిళలు, ఒక చిన్నారి మృతదేహాలు కలకలం రేపాయి. రైల్వే బ్రిడ్జి కింది భాగంలో 7వ ఖానా వద్ద ఒక మహిళ, ఒక బాలిక మృతదేహాలను మత్య్సకారులు గుర్తించారు. అలాగే ఆంజనేయస్వామి దేవాలయం పుష్కరఘాట్ కింద భాగంలో నీటిలో తేలాడుతున్న వృద్ధురాలి మృతదేహాన్ని గుర్తించి తాడేపల్లి పోలీసులకు సమాచారమిచ్చారు. ఈ ముగ్గురు ఒకే కుటుంబ సభ్యులని పోలీసులు తొలుత భావించారు.
తాడేపల్లి సీఐ ఘటనా స్థలానికి చేరుకుని మూడు మృతదేహాల వీడియో క్లిప్పింగ్‌లను విజయవాడ పోలీసులకు పంపారు. సమాచారం అందుకున్న విజయవాడ అజిత్‌సింగ్‌నగర్ పోలీసులు ఘటనా స్థలానికి వచ్చిన రెండు మృతదేహాలు విజయవాడ అయోధ్యనగర్‌లో ఈ నెల 20న అదృశ్యమైన మహిళ మంత్రి ఈశ్వరమ్మ (33) ఆమె కుమార్తె రాధ(11)విగా గుర్తించారు. బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. అయోధ్యనగర్ రైల్వే గేటు పక్కన సూర్యకాలనీకి చెందిన మంత్రి ఈశ్వరమ్మ భర్త అప్పలనాయుడు 15 ఏళ్ల క్రితం అనారోగ్యంతో చనిపోయాడు.
అప్పటినుంచి అదే ప్రాంతంలో పాచి పని చేసుకుంటూ జీవిస్తోంది. ఆమెకు కుమారుడు, కుమార్తె ఉన్నారు. కుమారుడిని కొంతకాలం కిందట ఊర్మిళానగర్‌లో బంధువుల ఇంటి వద్ద ఉంచింది. కుమార్తెను ఆమె దగ్గరే ఉంచుకుని స్థానిక ఓ ప్రైవేటు పాఠశాలలో చేర్పించింది. ఏం జరిగిందో తెలియదు గానీ, 20వ తేదీ ఉదయం ఇంట్లో నుంచి వచ్చిన తల్లీకూతుళ్లు కృష్ణానదిలో శవమై కన్పించారంటూ ఈశ్వరమ్మ మరిది రామారావు పోలీసులకు తెలిపారు. ఆమెకు ఆరోగ్యం సరిగాలేదని యుక్తవయస్సు వచ్చిన ఆడపిల్లతో ఎలా బతకాలి అని ఆలోచించి ఆత్మహత్య చేసుకుని ఉంటుందని బంధువులు చెబుతున్నారు.
కుమార్తె మృతిపై అనుమానాలు?
అయితే కుమార్తె రాధిక మృతిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బాలిక నాలుక బైటకు వచ్చి పల్లతో నొక్కబడి ఉంది. సహజంగా ఉరి వేసుకున్నప్పుడో, గొంతు నులిమి చంపినప్పుడో మాత్రమే ఇలా నాలుక బైటకు వస్తుందని వైద్యులు చెబుతున్నారు. బహుశా తల్లి ఈశ్వరమ్మ కూతురు రాధికను గొంతు నులిమి కృష్ణా నదిలోకి పడేసి ఆ తర్వాత తాను ఆత్మహత్యకు పాల్పడిందా.. లేక ఎవరైనా తల్లిని ముందు నదిలో తోసి కుమార్తె గొంతు నులిమి హత్య చేసి ఉంటారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
మరో ఘటనలో వృద్ధురాలు..
ఆంజనేయస్వామి గుడి ఎదురు పుష్కరఘాట్ వద్ద కృష్ణానదిలో లభించిన వృద్ధురాలి మృతదేహం విజయవాడ గాంధీనగర్‌కు చెందిన మాసెట్టి స్వరాజ్యలక్ష్మి (85)గా పోలీసులు గుర్తించారు. బుధవారం ఉదయం గుడి కి అని చెప్పి ఇంటినుంచి తిరిగి రాలేదని కొడుకు కోటేశ్వరరావు తెలిపారు. వెతుకుతుండగా నదిలోమునిగి మృతి చెందినట్లు సమాచారం అందినట్లు పేర్కొన్నారు. తన తల్లికి గత కొద్దికాలంగా మతిస్థిమితం సరిగా లేదని గుడికి వెళ్లేముందు కృష్ణానదిలో స్నానానికి దిగి ప్రమాదవశాత్తూ మునిగిపోయి మృతి చెంది ఉంటుందని ఆయన చెప్పాడు.