శిశు గృహ నిర్వాహకురాలికి పాపను అందజేస్తున్న గోపాలపట్నం సీఐ పైడియ్య, ఎస్‌ఐ తమ్మినాయుడు
సింహాచలం(పెందుర్తి)/ గోపాలపట్నం(విశాఖ పశ్చిమ): అనాగరిక సమాజంలో ఆడపిల్లంటే బరువు అనుకుందో... లేక జీవితాంతం ఎలా పెంచుతానని ఆందోళన చెందిందో... అత్తింటి వారి సూటిపోటి మాట లకు ఆ తల్లి హృదయం తల్లడిల్లిపోయి సింహ గిరి అప్పన్న సాక్షిగా నిశ్శబ్దంగా బరువు వదిలించుకుందామనుకుందో తెలియదుకానీ... ఏడాది వయసున్న చిన్నారిని సింహాచలం కొండ దిగువన ఆర్టీసీ బస్టాండ్ పక్కన దేవస్థానం నిర్మించిన షాపింగ్ కాంప్లెక్స్ మెట్లపై శుక్రవారం రాత్రి 7:30 గంటల సమయంలో ఓ తల్లి విడిచిపెట్టి వెళ్లిపోయింది. అమ్మా... అని పిలుద్దామనుకుంటే నోట మాట రాకపోవడం... మరోవైపు చలితో ఆ చిన్నారి వణికిపోతుండడం చూపరులను కలిచివేసింది. వెంటనే స్థానికులు డయిల్ 100 నంబర్‌కు సమాచారం చేరవేశారు.
దీతో గోపాలపట్నం సీఐ పైడియ్య హుటాహుటిన ఎస్‌ఐ తమ్మినాయుడు, బ్లూకోట్స్ కానిస్టేబుల్ ఈశ్వరరావుని అప్రమత్తం చేశారు. వారు బస్టాండ్‌కి చేరుకుని ఆ చిన్నారిని గోపాలపట్నం పోలీస్‌స్టేషన్‌కు తీసుకొచ్చారు. అనంతరం ఆర్‌అండ్‌బీ వద్ద ఉమెన్ అంyŠ ఛైల్డ్ సంస్థ నిర్వహిస్తున్న శిశుగృహకు ఫోన్ చేశారు. ఆ సంస్థ మేనేజర్ మంజుకి ఆడబిడ్డను అందజేశారు. అయితే ఒక పురుషుడు ఆడ బిడ్డను తీసుకొచ్చి సింహాచలం ఆర్టీసీ కాంప్లెక్స్ పక్కనున్న షాపింగ్ కాంప్లెక్స్ మెట్లపై కూర్చోబెట్టి వెళ్లిపోయాడని సాధువులు చెబుతున్నారు. ఇప్పుడే వస్తానని చెప్పి వెళ్లిన అతను ఎంతసేపటికీ రాకపోవడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారనే ప్రచారం జరుగుతోంది. అయితే సింహాచలం బస్టాండ్ సమీపంలో ఆడ బిడ్డను విడిచి వెళ్లిపోవడంపై పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. సమీపంలోని సీసీ కెమారాల ఫుటేజీ పరిశీలిస్తే... బిడ్డను ఎవరు విడిచిపెట్టి వెళ్లారో తెలుస్తుందని పోలీసులు భావిస్తున్నారు. అందులో భాగంగా శనివారం ఫుటేజీలు పరిశీలించనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment