
అయ్యో ‘పాప’ం!
భారమైంది..!
కల్వకుర్తి: ఆడపిల్లల పోషణభారమని భావించిన ఓ తల్లి పేగుబంధాన్ని మరిచి తన కూతుర్ని అమ్మకానికి పెట్టింది. ఈ సంఘటన ఆదివారం మహబూబ్‌నగర్ జిల్లాలో వెలుగుచూసింది. కల్వకుర్తికి చెందిన సైదమ్మకు ఇప్పటికే ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారు. నాలుగో కాన్పులో కొడుకు పుడతాడని భావించిన ఆమెకు మరో కూతురు జన్మించింది. ఈ క్రమంలో వంగూరు గేటు సమీపంలో శ్రీశైలం- హైదరాబాద్ రహదారిపై ఆ చిన్నారిని రూ.200కు విక్రయించేందుకు ఉంచింది.
ఇది గమనించిన స్థానికులు కల్వకుర్తి ఐసీడీఎస్ అధికారులకు సమాచారమందించారు. వారు అక్కడికి చేరుకుని ఆ చిన్నారిని స్వాధీనం చేసుకున్నారు. పాపను శిశువిహార్‌కు తరలించనున్నట్లు వారు తెలిపారు. ఆర్థిక ఇబ్బందుల వల్లే తన కూతురును విక్రయానికి పెట్టినట్లు సైదమ్మ తెలిపింది.
వద్దనుకుంది..!
గుంటూరు: ఏ తల్లి కన్న బిడ్డో... పుట్టి పట్టుమని పదిరోజులైనా అయిందో లేదో... ఓ పసికందు ఎండ వేడికి తట్టుకోలేక గుక్కపెట్టి ఏడుస్తోంది. బస్టాండ్‌లో ఎవరో వదిలేసిన ఆ ఆడశిశువును చూసిన ప్రయాణికులు చలించిపోయారు. గుంటూరు ఎన్టీఆర్ బస్టాండ్‌లో ఆదివారం రోజుల వయసున్న ఆడ శిశువు అదేపనిగా ఏడుస్తోంది. బస్టాండ్‌లోని తిక్కన కాన్ఫరెన్స్ హాలు పక్కనే ఉన్న డార్మెటరీ వద్ద నేలపై పరిచి ఉన్న కాగితాలపై ఉన్న ఆ పసికందు సంబంధీకులెవరూ ఎంతకీ దగ్గరకు రాలేదు. ఇది గమనించిన ఒక ప్రయాణికుడు విషయాన్ని అవుట్‌పోస్టు పోలీసులకు తెలిపాడు.
పాత గుంటూరు ఎస్‌ఐ శ్రీనివాసరావు సంఘటన స్థలానికి చేరుకుని శిశువు తల్లిదండ్రుల గురించి ఆరా తీసినా ఫలితం లేకపోయింది. శిశువు చేతికి ఉన్న బ్యాండ్ నంబరు ఆధారంగా వివరాలు సేకరించేందుకు ప్రయత్నిస్తున్నారు. వృద్ధురాలు, ఓ యువతి కలిసి చిన్నారితో డార్మెటరీ ప్రాంతంలో సంచరించడం తాము గమనించినట్లు కొందరు ప్రయాణికులు పోలీసులకు తెలిపారు. అనంతరం చైల్డ్‌కేర్ అధికారులు పసికందును గుంటూరు జీజీహెచ్‌కి తరలించారు.