కొనసాగుతున్న ఏనుగుల బీభత్సం
చిత్తూరు : చిత్తూరు జిల్లాలో శనివారం కూడా ఏనుగుల బీభత్సం కొనసాగుతోంది. రామకుప్పం మండలం రామాపురం తండా సమీపంలో గజరాజులు ఘీంకారాలతో హోరెత్తిస్తున్నాయి. వీర్నమల ప్రాంతంలో పొలాలపై ఏనుగుల గుంపు దాడి చేసి పంటను ధ్వంసం చేశాయి. ఏనుగుల దాడితో సమీప గ్రామస్తులు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు.
మరోవైపు విద్యుత్ షాకుతో రామాపురం తండా సమీపంలోని రిజర్వ్ ఫారెస్ట్లో గురువారం ఓ ఏనుగు మృతి చెందిన విషయం తెలిసిందే. దాంతో మిగిలిన ఏనుగులు అక్కడే మకాం వేశాయి. రాత్రంతా గుంపులోని మిగిలిన ఏనుగులు ఘీంకారాలు చేస్తూ అక్కడే ఉండిపోయాయి. ఎలాగైన కిందపడ్డ ఏనుగును తీసుకెళ్లాలని ప్రయత్నించాయి. మరోవైపు మృతి చెందిన ఏనుగును అక్కడ నుంచి తరలించేందుకు అధికారులు, అటవీశాఖ సిబ్బంది ప్రయత్నిస్తున్నారు.