అర్హత సాధిస్తే.... సీటు గ్యారంటీ
- పరీక్ష రేపే
- ఏర్పాట్లు పూర్తి
- విజయవాడ రీజియన్‌లో 70 పరీక్షా కేంద్రాలు
- హాజరుకానున్న 37 వేల మంది విద్యార్థులు
పెనమలూరు, న్యూస్‌లైన్ : ఈ నెల 22న జరగనున్న ఎంసెట్- 2014 ప్రవేశ పరీక్షలో అర్హత సాధిస్తే ఇంజనీరింగ్‌లో సీటు గ్యారంటీ అని రీజనల్ కోఆర్డినేటర్ డాక్టర్ కె.మోహనరావు తెలిపారు. మంగళవారం ఆయన కానూరు వీఆర్ సిద్ధార్థ కళాశాలలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఎంసెట్ ఏర్పాట్ల వివరాలు వెల్లడించారు.
రాష్ట్ర వ్యాప్తంగా ఇంజనీరింగ్‌కి 2,81,718 మంది, మెడిసిన్‌కి 1,11,779 మంది దరఖాస్తు చేశారని తెలిపారు. మెడిసిన్, ఇంజనీరింగ్ రెండు పరీక్షలూ రాసేవారు 1,071 మంది ఉన్నారని చెప్పారు. రాష్ట్రంలో ఇంజనీరింగ్ సీట్లు మొత్తం 3 లక్షల వరకు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. మెడిసిన్‌లో మాత్రం మూడు వేల సీట్లు మాత్రమే ఉన్నాయని వివరించారు. రాష్ట్ర వ్యాప్తంగా 38 రీజనల్ సెంటర్లు ఉన్నాయని తెలిపారు.
విజయవాడ రీజియన్‌కు సంబంధించి నగరంలో మొత్తం 70 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు వివరించారు. ఇందులో ఇంజనీరింగ్‌కి 22,050 మంది, మెడిసిన్‌కి 14,950 మంది దరఖాస్తు చేశారని తెలిపారు. గత ఏడాదితో పోల్చితే ఇంజనీరింగ్ దరఖాస్తుదారుల సంఖ్య 1,698 తగ్గగా మెడిసిన్‌కి 802 పెరిగినట్లు చెప్పారు.
నిమిషం ఆలస్యమైనా అనుమతించం...
ఎంసెట్ పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులను నిమిషం ఆలస్యమైనా అనుమతించేది లేదని రీజనల్ కోఆర్డినేటర్ తెలిపారు. ఇంజనీరింగ్ పరీక్ష ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు, మెడిసిన్ మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 వరకు జరుగుతుందని వివరించారు. ఈ పరీక్ష నిర్వహణకు 54 మంది పరిశీలకులు, 1,860 మంది ఇన్విజిలేటర్లు, ఇతర సిబ్బంది పాల్గొంటారని తెలిపారు.
నగరంలో పరీక్షా పత్రాలు అందజేయడానికి 9 రూట్లు ఏర్పాటుచేసినట్లు చెప్పారు. ఇంజనీరింగ్ పరీక్షకు ఉదయం 9.15 గంటలకు, మెడిసిన్‌కు మధ్యాహ్నం 1.45 గంటలకు పరీక్ష హాలులోకి అనుమతిస్తామన్నారు. పరీక్షా సమయం ముగిసేవరకు విద్యార్థులను బయటికి వెళ్లడానికి అనుమతించబోమని స్పష్టం చేశారు. ఎంసెట్ పరీక్ష కారణంగా విజయవాడలోని అన్ని పరీక్షా కేంద్రాల వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారని రీజనల్ కోఆర్డినేటర్ చెప్పారు. ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తే అవకాశమున్నందున పరీక్షకు ముందుగానే బయలుదేరాలని ఆయన సూచించారు.
విద్యార్థులు పాటించాల్సిన ముఖ్య విషయాలివీ...
విద్యార్థులు పాటించాల్సిన ముఖ్య అంశాలను మోహనరావు వివరించారు.
విద్యార్థులు ఆన్‌లైన్ అప్లికేషన్‌పై ఫొటో అంటించి అటెస్టేషన్ చేయించి తీసుకురావాలి. దానిని పరీక్ష హాలు పరిశీలకునికి అందజేయాలి.
ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు కులధృవీకరణ పత్రం అందజేయాలి.
ఓఎంఆర్ షీట్ పై అభ్యర్థి పూర్తి వివరాలు నమోదు చేయాలి.
విద్యార్థుల వేలిముద్ర నామినల్ ఈట్‌పై వేయాలి.
ఓఎంఆర్ షీట్‌పై బ్లూ, బ్లాక్ బాల్‌పాయింట్ పెన్‌తో సమాధానం నమోదు చేయాలి.
హాల్‌టిక్కెట్ తప్పనిసరి.
పరీక్ష హాలులోకి కాలిక్యులేటర్లు, సెల్‌ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను అనుమతించరు.
ప్రశ్నపత్రాన్ని విద్యార్థులు ఇంటికి తీసుకెళ్లవచ్చు.
పరీక్షలో అక్రమాలకు పాల్పడితే క్రిమినల్ కేసు నమోదు చేస్తారు.