- ప్రధానికి టీఆర్‌ఎస్ ఎంపీల లేఖ
సాక్షి, హైదరాబాద్: పార్లమెంట్ నియోజకవర్గ అభివృద్ధి పథకం నిధులను రూ.8 కోట్లకు పెంచాలని టీఆర్‌ఎస్ ఎంపీలు బూర నర్సయ్య గౌడ్, బాల్క సుమన్, కొత్త ప్రభాకర్ రెడ్డి డిమాండ్ చేశారు. శనివారం ఇక్కడ వారు విలేకరులతో మాట్లాడుతూ, నియోజకవర్గాల్లోని చిన్న సమస్యలను పరిష్కరించడానికి ఇవి ఉపయోగపడుతాయన్నారు.
సంసద్ ఆదర్శ్ గ్రామ యోజనలో దత్తత తీసుకునే గ్రామాలకు కేంద్ర ప్రభుత్వమే నిధులివ్వాలని వారు కోరారు. తెలంగాణ రాష్ట్రాన్ని ప్రత్యేక కేటగిరీగా గుర్తించి నిధులను కేటాయించాలని కోరారు. ప్రాణహిత-చేవెళ్లకు జాతీయ హోదా, వ్యవసాయ వర్సిటీ, మూసీ అభివృద్ధి, బయ్యారం ఉక్కు ప్రాజెక్టు, రైల్వే ప్రాజెక్టులు, పారిశ్రామికాభివృద్ధికోసం రాయి తీలు, పునర్విభజన చట్టం అమలుకు పార్లమెంట్‌లో పట్టుబడతామన్నారు.
విమానాశ్రయానికి ఆంధ్రనేత పేరా?
తెలంగాణలోని శంషాబాద్ విమానాశ్రయానికి ఆంధ్రనాయకుడైన ఎన్టీఆర్ పేరు పెట్టాలని తెలంగాణ టీడీపీనేతలు ధర్నా చేయడం సిగ్గుచేటన్నారు. సమైక్య రాష్ట్రంలో ప్రతిపాదించిన పేర్లను తెలంగాణ రాష్ట్రంలో ఎలా పెడతారని, వారికి ఆ అధికారం ఎక్కడిదని ఎంపీలు ప్రశ్నించారు. ఇది ఫెడరల్ స్ఫూర్తికి విఘాతం కలిగిస్తుందన్నారు. ఈ విషయంపై పార్లమెంట్‌లో కేంద్రాన్ని నిలదీస్తామన్నారు.
విభజన తర్వాత కూడా స్వేచ్ఛ లేదా?
రాష్ట్రం ఏర్పాటైన తర్వాత కూడా తెలంగాణ వారికి స్వేచ్ఛ లేదా అని ఎమ్మెల్యే గువ్వల బాలరాజు ప్రశ్నించారు. టీడీపీ ఎమ్మెల్యేలు శాసనసభను అపహాస్యం చేస్తున్నారన్నారు.
దురదృష్టకరం: ఎంపీ కొండా
ఎన్టీరామారావు పేరును తెలంగాణలోని విమానాశ్రయానికి పెట్టాలనుకోవడం దురదృష్టకరమని ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి ఒక ప్రకటనలో విమర్శించారు. కొమురం భీం, రాణి రుద్రమదేవి, ప్రొఫెసర్ జయశంకర్, పీవీ నరసింహారావు వంటి వారందరినీ కాదని ఎన్టీఆర్ పేరును తెరపైకి తేవడం దిగ్భ్రాంతికరమన్నారు. దీనితో తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆత్మాభిమానం దెబ్బతింటుం దని విశ్వేశ్వర్‌రెడ్డి అన్నారు.