
ఎంపీ మార్గాని భరత్‌రామ్
సాక్షి, న్యూఢిల్లీ: అమృత్ పథకంలో ఎంపిక చేసిన నగరాలకు కేంద్రం రూపొందించిన అంచనాలకు మించి నిధులు ఇవ్వలేమని కేంద్ర గృహ, పట్టణ మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి హర్‌దీప్‌సింగ్‌పురి స్పష్టం చేశారు. ఢిల్లీలో జరుగుతున్న లోక్‌సభా సమావేశాల్లో శుక్రవారం రాజమహేంద్రవరం ఎంపీ, వైఎస్సార్ సీపీ పార్లమెంటరీ చీఫ్ విప్ మార్గాని భరత్‌రామ్ పాల్గొన్నారు. ఎంపీ అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి పైవిధంగా సమాధానం ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్‌లో 33 నగరాలు అమృత్ పథకానికి ఎంపికయ్యాయని మంత్రి చెప్పారు. ఈ నగరాల్లో మౌలిక సదుపాయాలకు కేంద్రం రూ.1056.62 కోట్లు కేటాయించిందని, రాష్ట్ర ప్రభుత్వం అదనంగా అడిగిన రూ.872.74 కోట్లు ఇవ్వడం నిబంధనల ప్రకారం సాధ్యం కాదన్నారు. ప్రాజెక్టు నిర్దేశిత ప్రణాళిక కన్నా ఎక్కువ ప్రతిపాదనలు చేసిన రాష్ట్రాలు ఆ మొత్తాన్ని వారే భరించాల్సి ఉంటుందన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో లక్షలోపు జనాభా ఉన్న మున్సిపాలిటీలను అమృత్‌లో చేర్చడం సాధ్యం కాదని, అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను సమానంగా పరిగణలోకి తీసుకుంటామన్నారు. 2011 జనాభా లెక్కల ప్రకారం అమృత్ పథకానికి నగరాలను ఎంపిక చేశామని హర్‌దీప్‌సింగ్‌పురి తెలిపారు.
వాయు కాలుష్యాన్ని నివారిద్దాం...
దేశంలో రోజురోజుకూ పెరుగుతున్న వాయు కాలుష్యం నివారణకు లోక్‌సభలో ఎంపీ మార్గాని భరత్‌రామ్ పలు సూచనలు చేశారు. ఆక్సిజన్‌ను ఎక్కువగా విడుదల చేసే ఐదు రకాల మొక్కలను నాసా గుర్తించిందని, వాటిని దేశవ్యాప్తంగా పంపిణీ చేయాలని సూచించారు. తాను ప్రాతినిధ్యం వహించే నియోజకవర్గంలోని కడి యం మండలంలో దాదాపు 11,500 హెక్టార్లలో నర్సరీలు ఉన్నాయన్నారు. ఇక్కడ అనేక రకాల మొక్కలను అభివృద్ధి చేసేందుకు అవకాశం ఉందని చెప్పారు. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్
అగ్రికల్చర్ రీసెర్చ్ నూతన మొక్కల గుర్తింపు, అభివృద్ధిపై ఎక్కువగా పరిశోధనలు చేయాలని సూచించారు. నెదర్లాండ్, సింగపూర్, థాయిలాండ్ దేశాలు నూతన మొక్కల అభివృద్ధిలో ముందున్నాయన్నారు. కడియం, పూణే, బెంగళూరు, ముంబయి తదితర ప్రాంతాల్లోని నర్సరీల్లో సాంకేతిక పరిజ్ఞానంతో నూతన మొక్కల అభివృద్ధికి అవకాశం ఉందన్నారు. కేంద్ర వ్యవసాయ, ఉద్యానవన మంత్రిత్వ శాఖ ప్రత్యేకంగా దృష్టిసారించాలని ఎంపీ కోరారు.
Comments
Please login to add a commentAdd a comment