సాక్షి, న్యూఢిల్లీ: స్మార్ట్ సిటీస్ మిషన్ కింద ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి ఇప్పటి వరకు రూ. 496 కోట్లు విడుదల చేసినట్లు కేంద్ర మంత్రి హర్దీప్‌సింగ్ పూరి రాజ్యసభలో వెల్లడించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి రాతపూర్వకంగా జవాబిస్తూ ఈ విషయం తెలిపారు. స్మార్ట్ సిటీస్ మిషన్ కింద ఎంపికైన అమరావతి కోసం 2017-18 నుంచి ఇప్పటి వరకు కేంద్రం రూ. 496 కోట్లు విడుదల చేయగా ఆ మొత్తంలో 472 కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్లు చెప్పారు.
అలాగే ఆంధ్రప్రదేశ్‌లో ఏపీలో స్మార్ట్ సిటీస్ మిషన్ కింద ఎంపికైన విశాఖపట్నం, తిరుపతి, కాకినాడ నగరాలకు విడుదల చేసిన నిధుల గురించి ఆయన వివరించారు. 2015-16 ఆర్థిక సంవత్సరం నుంచి ఇప్పటి వరకు విశాఖపట్నం నగరానికి రూ. 299 కోట్లు, తిరుపతికి రూ. 196 కోట్లు, కాకినాడకు రూ. 392 కోట్లు కేంద్రం నుంచి విడుదలైనట్లు మంత్రి తెలిపారు. ఈ మిషన్ కింద దేశ వ్యాప్తంగా ఎంపిక చేసిన 100 నగరాల అభివృద్ధి కోసం మొత్తం 23,054 కోట్ల రూపాయల నిధులను కేంద్ర ప్రభుత్వం మంజూరు చేయగా ఇప్పటి వరకు రూ. 18,614 కోట్లను వివిధ నగరాలకు విడుదల చేసినట్లు చెప్పారు.
స్మార్ట్ సిటీస్ మిషన్‌ను వేగవంతంగా అమలు చేయడంలో ఎదురవుతున్న ఆటంకాల గురించి విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి జవాబిస్తూ.. ఈ మిషన్‌ను హడావిడిగా అమలు చేయడం తమ లక్ష్యం కాదని అన్నారు. మిషన్ కింద అమలు చేసే వివిధ ప్రాజెక్ట్‌లు నాణ్యతాపరంగా అత్యుత్తమంగా ఉండాలన్నదే తమ లక్ష్యమని చెప్పారు. స్మార్ట్ సిటీస్ ఎంపిక తర్వాత స్పెషల్ పర్పస్ వెహికల్ ఏర్పాటు, ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్ కన్సల్టెన్సీల ఎంపిక, మానవ వనరుల సమీకరణ, డీటెల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్‌ల రూపకల్పన అనంతరమే ఆయా ప్రాజెక్ట్‌లకు సంబంధించిన పనులకు టెండర్లు పిలవడం జరుగుతుందని, ఈ ప్రక్రియలు పూర్తి కావడానికి తగినంత కాల వ్యవధి అవసరమని వివరించారు. గడచిన ఏడాదిగా మిషన్ అమలు వేగాన్న పెంచామని పేర్కొన్నారు. కేటాయించిన నిధులను ఆయా నగరాలు వినియోగించే వేగం కూడా 9 రెట్లు పెరిగిందని అన్నారు. వివిధ నగరాలు మార్చి 2018 నాటికి కేవలం రూ. 1000 కోట్లు వినియోగిస్తే.. నవంబర్ 15, 2019 నాటికి అది 9497 కోట్ల రూపాయలకు పెరిగిందని మంత్రి వెల్లడించారు.
రూ. 177 కోట్లతో తిరుపతి ఎయిర్‌పోర్ట్ రన్‌వే విస్తరణ:
భారీ విమానాల రాకపోకలకు అనువుగా ఉండే విధంగా రూ. 177 కోట్లతో తిరుపతి ఎయిర్‌పోర్ట్‌లోని రన్‌వేను విస్తరించి, పటిష్టపరిచే పనులను చేపట్టినట్లు కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి చెప్పారు. తిరుపతి ఎయిర్‌పోర్టు రన్‌వే విస్తరణపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానం ఇస్తూ.. రన్‌వే విస్తరణ పనులు 2021 నాటికి పూర్తి అవుతాయని భావిస్తున్నట్లు తెలిపారు. తిరుపతి విమానాశ్రయంలో రూ. 181 కోట్ల రూపాయలతో జూన్ 2011లో కొత్తగా ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ బిల్డింగ్ నిర్మాణాన్ని చేపట్టిన ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ డిసెంబర్ 2015 నాటికి నిర్మాణ పనులను పూర్తి చేసిందని మంత్రి వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment