టిక్కెట్ల పంచాయితీ
‘‘అన్నీ నేనే చేశానని చెప్పుకుంటున్న ఎంపీ మందా జగన్నాథం ఆయన అభివృద్ధి ఏమిటో ప్రజలకు చెప్పాలి. నియోజకవర్గ అభివృద్ధికి ఎమ్మెల్యే ద్వారానే నిధులు విడుదల చేస్తారనే విషయాన్ని ఆయన గుర్తెరుగాలి. ఒకే సామాజిక వర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన తనకు సహకరించాల్సిందిపోయి రాజకీయ లబ్ధికోసం అభివృద్ధి పనులకు అడ్డుతగలడం దురదృష్టకరం.’’
- ఎంపీ మందా జగన్నాథంను ఉద్దేశించి ఇటీవల అబ్రహాం వ్యాఖ్యలు
‘‘నేను చేసిన అభివృద్ధి ఏమిటో ప్రజలకు తెలుసు. ఐదేళ్లలో నువ్వు సాధించిందేమిటో చెప్పు. నీవు చేసిన అభివృద్ధా..ఆ మాట మాట్లాడాలంటేనే సిగ్గుగా ఉంది. అలంపూర్ ప్రజల దీవెనలు అందుకుంటూ ఎంపీగా కొనసాగుతున్నా. దమ్ముంటే ప్రజల్లోకి వెళ్లి ఓపెన్‌గా అభివృద్ధి ఎవరు చేశారో తేల్చుకుందాం. వచ్చే ఎన్నికల్లో అలంపూర్ ప్రజలు నీకు బుద్ధిచెప్పడం ఖాయం..’’
- అబ్రహాంను ఉద్దేశించి ఇటీవల ఎంపీ మందా జగన్నాథం వ్యాఖ్యలు
టిక్కెట్ల పంచాయితీ
మహబూబ్‌నగర్, సాక్షి ప్రతినిధి: సార్వత్రిక ఎన్నికలకు మరో ఆరునెలల గడువు ఉన్నప్పటికీ నాయకుల మధ్య టికెట్ల పంచాయితీ అప్పుడే రాజుకుంది. తమ ప్రతిష్టతను మరింత పెంచుకునేందుకు మాటలయుద్ధానికి తెరతీశారు. అలంపూర్ ఎమ్మెల్యే అబ్రహాం, నాగర్‌కర్నూల్ ఎంపీ మందా జగన్నాథం మధ్య గత కొంతకాలంగా ఇదే జరుగుతోంది. ఇద్దరు కూడా 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీచేసి విజయం గెలించారు. వారిద్దరు కూడా ఒకే సామాజిక వర్గానికి చెందినవారు కావడంతో మొదటి నుంచి మంచి మిత్రులుగా మెలుగుతూ ఏ కార్యక్రమం నిర్వహించినా కలిసి పాల్గొనేవారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం ఆందోళనలో భాగంగా ఎంపీ మందా జగన్నాథం కాంగ్రెస్‌పార్టీని వీడి టీఆర్‌ఎస్ తీర్థం పుచ్చుకున్న విషయం తెలిసిందే.
దీనికితోడు తన కుమారుడు శ్రీనాథ్‌ను అలంపూర్ నియోజకవర్గం నుంచి టీఆర్‌ఎస్ తరఫున వచ్చే ఎన్నికల్లో పోటీచేయించేందుకు భావిస్తున్నారు. ఇందుకోసం టీఆర్‌ఎస్ అధినేత కె.చంద్రశేఖర్‌రావు నుంచి గ్రీన్‌సిగ్నల్ కూడా పొందినట్లు సమాచారం. దీంతో ప్రస్తుతం ఎమ్మెల్యే అబ్రహాం తనకు పోటీగా ఎంపీ మందా జగన్నాథం కొడుకును రంగంలోకి దింపుతున్నాడనే కారణంతో కొంతకాలంగా వారిద్దరు దూరం దూరంగా ఉంటూ వస్తున్నారు.
ఇదిలాఉండగా ఎంపీ మందా జగన్నాథం మొదటి నుంచీ మంత్రి డీకే అరుణ రాజకీయ వ్యవహార శైలిని వ్యతిరేకించేవారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే అబ్రహాం, ఎంపీ జగన్నాథంల మధ్య అగాథం ఏర్పడటంతో మంత్రి డీకే అరుణకు ఎమ్మెల్యే రాజకీయంగా దగ్గరవుతూ వస్తున్నాడు. ఇదే అదునుగా భావించి అలంపూర్ నియోజకవర్గం అభివృద్ధి కోసం ఎమ్మెల్యే అబ్రహాంను మంత్రి అరుణ సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి వద్దకు వెంట తీసుకుని వెళ్లి నిధులు విడుదల చేయించిన సందర్భాలు ఉన్నాయి. మారుతున్న రాజకీయ పరిణామాల వల్ల ఒకప్పుడు మంచి మిత్రులుగా ఉన్న ఎంపీ, ఎమ్మెల్యేలు ప్రస్తుతం వర్గశత్రువులుగా మారారు.
ఎవరికి వారే..!
అలంపూర్ నియోజకవర్గంలోని ఇటిక్యాల, అలంపూర్ మండలాల్లో నూతనంగా నిర్మించతలపెట్టిన తహశీల్దార్ కార్యాలయాల శంకుస్థాపన కార్యక్రమానికి ఎంపీ మందా జగన్నాథంను ఆహ్వానించకుండానే ఎమ్మెల్యే శంకుస్థాపనలు చేశారు. అయితే అప్పట్లో ఈ వ్యవహారం కొంత గందరగోళానికి దారితీసింది. ఇటీవల జరిగిన రచ్చబండ కార్యక్రమంతో ఎంపీ, ఎమ్మెల్యేలు ఒకే వేదికపై కలవడంతో నియోజకవర్గంలో అభివృద్ధి గురించి ఒకరిపై మరొకరు తీవ్ర ఆరోపణలు చేసుకోవడమే కాకుండా సవాల్ విసురుకున్నారు. అప్పటినుంచి రోజురోజుకు వారిద్దరి మధ్య ఆరోపణల యుద్ధం తారాస్థాయికి చేరింది. అలంపూర్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడంలో ఎమ్మెల్యే తీవ్ర నిర్లక్ష్యం చూపాడని ఎంపీ ఆరోపించగా, నియోజకవర్గ అభివృద్ధికి ఏనాడూ సహకరించని ఎంపీ మందా జగన్నాథం దద్దమ్మ కంటే హీనంగా మాట్లాడుతున్నారని ఎమ్మెల్యే అబ్రహాం ధ్వజమెత్తారు. ఎంపీ కేవలం ప్రొటోకాల్ కోసం వెంపర్లాడటం తప్ప అభివృద్ధికి ఏనాడూ సహకరించలేదని కుంటబద్దలు కొట్టాడు. నియోజకవర్గంలో ఎవరికి వారు హీరోలయ్యేందుకు ఎంపీ, ఎమ్మెల్యేలు ఒకరిపై మరొకరు ఇలా విమర్శలు చేసుకోవడం చూసి ప్రజలు అసహించుకుంటున్నారు.