సాక్షి, వనపర్తి : కర్ణాటకలో అధికార పీఠం దక్కించుకున్న బీజేపీ ఇక తెలంగాణపై దృష్టి సారించనున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే వనపర్తి జిల్లాపై ప్రత్యేకంగా కన్నెసినట్లు కనిపిస్తోంది. వచ్చేనెలలో జిల్లాలో బీజేపీ చీఫ్ అమిత్‌షా పర్యటించే విధంగా ప్రణాళిక సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో ఆ పార్టీశ్రేణుల్లో నూతనోత్సాహం కనిపిస్తోంది. ఇప్పటికే తెలంగాణను నాలుగు క్లస్టర్లుగా విభజించి పార్టీ బలోపేతం కోసం బాధ్యతలను సీనియర్ నేతలు రాంమాధవ్, మంగళ్‌పాండే, నరేంద్రసింగ్ తోమర్, బండారు దత్తాత్రేయకు అప్పగించారు. వీరికి కొన్ని పార్లమెంట్ స్థానాల పర్యవేక్షణ బాధ్యతలను కట్టబెట్టారు. పార్టీ బలోపేతంలో భాగంగా జూన్ 9న జిల్లాకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా రానున్నారు. కర్ణాటకలో బలనిరూపణ ప్రక్రియ అంతా సవ్యంగా సాగితే ఇప్పటికే నిర్ణయించిన తేదీల్లో ఎలాంటి మార్పు ఉండబోదని ఆ పార్టీ శ్రేణులు అంటున్నాయి.
జిల్లాకు ‘పరివర్తన్’ యాత్ర
రాష్ట్రంలోని 65 అసెంబ్లీ నియోజకవర్గ స్థానాలపై బీజేపీ నాయకత్వం ప్రత్యేకంగా దృష్టి సారించినట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే జూన్‌లో పరివర్తన్ యాత్ర పేరుతో బస్సుయాత్రను ప్రారంభించనున్నారు. ఈ యాత్ర ముందుగా 35 నియోజకవర్గాలు.. ఆ తరువాత 30 నియోజకవర్గాల్లో కొనసాగనుంది. జిల్లాలో జరిగే ఈ బస్సు యాత్రలో అమిత్‌షా పాల్గొననున్నారు. పార్టీ జాతీయ అధ్యక్షుడు వనపర్తికి రానుండటంతో ఆ పార్టీ శ్రేణులు ఆనందంలో మునిగిపోతున్నాయి. ఎందుకంటే పార్టీ బలహీనంగా ఉన్న ప్రాంతాల్లోనే అమిత్‌షా అడుగుపెడితే ఫలితాలు ఎలా ఉంటాయన్నది పలు రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో స్పష్టమైంది. 2019 ఎన్నికల్లో ఆ పార్టీ పాగా వేయాలని భావిస్తున్న నియోజకవర్గాల్లో వనపర్తి కూడా ఒకటి. అందులో భాగంగానే ఆయన పర్యటనను జిల్లాలో ఖరారు చేశారు.
ద్వితీయశ్రేణి నాయకత్వంపై దృష్టి
పార్టీ బలోపేతం కావాలంటే ముందుగా అన్ని పార్టీల్లోని ద్వితీయశ్రేణి నాయకులు, బూత్ స్థాయి నేతలను చేర్చుకోవాలని బీజేపీ భావిస్తోంది. ఒకప్పుడు తెలంగాణలో బలంగా ఉండి నేడు కొంతమంది నాయకులకే పరిమితమైన టీడీపీపై ముందుగా దృష్టి సారించనున్నారని సమాచారం. ఆ తరువాత అధికార టీఆర్‌ఎస్‌లో అసంతృప్తితో ఉన్న నేతలు, కార్యకర్తలను, కాంగ్రెస్‌లో ఉన్న ద్వితీయ శ్రేణి నాయకులు, కార్యకర్తలపై దృష్టిసారించి పార్టీలో చేర్పించాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇలా చేయడంతో బూత్‌స్థాయిలో పార్టీ ముందుగా బలోపేతమవుతుందని విశ్వసిస్తున్నారు.
కేంద్ర ప్రభుత్వ పథకాలపై ప్రచారం
కేంద్ర ప్రభుత్వం అన్నివర్గాల ప్రజల సంక్షేమం కోసం ఎన్నో సంక్షేమ పథకాలను అమలుచేస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం క్రెడిట్ బీజేపీకి రాకుండా చేస్తుందని ఆ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. పరివర్తన్ యాత్రలో భాగంగా కేంద్ర ప్రభుత్వం అమలుచేస్తున్న అన్ని సంక్షేమ పథకాలను ప్రజలకు అర్థమయ్యేలా చెప్పాలని భావిస్తున్నారు. ఇదే సమయంలో తెలంగాణ ప్రభుత్వం వైఫల్యాలను ఎండగడతామని చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment