ఎంపీ తోట నరసింహం బంధువు అనుమానాస్పద మృతి | MP Thota Narasimham Relative Mysterious death in Kakinada | Sakshi
Sakshi News home page

ఎంపీ తోట నరసింహం బంధువు అనుమానాస్పద మృతి

Published Mon, Aug 11 2014 12:14 AM | Last Updated on Sat, Sep 2 2017 11:41 AM

ఎంపీ తోట నరసింహం బంధువు అనుమానాస్పద మృతి

ఎంపీ తోట నరసింహం బంధువు అనుమానాస్పద మృతి

కాకినాడ క్రైం : కాకినాడ పార్లమెంట్ సభ్యుడు తోట నరసింహం సమీప బంధువు కాకినాడలోని ఓ ప్రముఖహోటల్‌లో ఆదివారం సాయంత్రం అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. లాడ్జి బాత్‌రూమ్‌లో షవర్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్టుగా అతడి స్నేహితుడు చెబుతుండగా, మరోవైపు పోలీసులు హత్యకు గురైనట్టుగా భావిస్తున్నారు. దీనికి తోడు రాత్రికి రాత్రే పోస్టు మార్టం నిర్వహించడంపై ఈ ఘటన వెనుక అధికార పార్టీ పెద్దల హస్తం ఉన్నట్టుగా అనుమానాలు రేకెత్తుతున్నాయి. ఇందుకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.
 
 కాకినాడ ఎంపీ తోట నరసింహం మేనల్లుడైన బోనాసు రాజా (42) సామర్లకోట మండలం కాపవరం వీఆర్వోగా పనిచేస్తున్నాడు. ఐదు రోజులుగా ఇతడు కాకినాడలోని ఒక ప్రముఖ హోటల్‌లో రూమ్ నంబర్ 210లో కాకినాడ వెంకట్‌నగర్‌కు చెందిన తన స్నేహితుడు నల్లా శ్రీనివాస్‌తో కలసి ఉంటున్నాడు. ఆదివారం సాయంత్రం ఇద్దరూ కలిసి గదిలో టీ తాగారు. కొద్ది సేపటికి రాజాకు ఫోన్ వచ్చింది. ఫోన్‌లో అవతలి వ్యక్తితో అతను చిరాకుగా మాట్లాడడం శ్రీనివాస్ విన్నాడు. వ్యక్తిగత సమస్య అనుకుని శ్రీనివాస్ బయటకు వెళ్లిపోయాడు. అరగంట తర్వాత వచ్చి చూసే సరికి రాజా గదిలో కనిపించలేదు. పరిసరాల్లో గాలించాడు. బాత్‌రూమ్ తలుపు కొట్టినా స్పందన లేదు.
 
 తలుపు తెరుద్దామని శ్రీనివాస్ ప్రయత్నించడంతో లోపల గడియ పెట్టి ఉండడంతో అది తెరుచుకోలేదు. మరో పావు గంట తర్వాత మరలా తలుపు తట్టాడు. అయినప్పటికీ స్పందన లేకపోవడంతో విషయాన్ని హోటల్ సిబ్బందికి తెలిపాడు. వారు వచ్చి తలుపు తెరిచే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది. దీంతో గునపం తెచ్చి తలుపు బద్దలు కొట్టారు. అయితే బాత్‌రూమ్‌లో రాజా విగతజీవిగా పడి ఉండడాన్ని వారు గమనించారు. బాత్‌రూమ్‌లో షవర్‌కు లుంగీతో ఉరివేసుకుని రాజా ఆత్మహత్య చేసుకున్నాడని ప్రత్యక్ష సాక్షి నల్లా శ్రీనివాస్ చెబుతున్నాడు.
 
 విషయం తెలుసుకున్న డీఎస్పీ రామిరెడ్డి విజయభాస్కర రెడ్డి, క్రైం సీఐ అల్లు సత్యనారాయణ, టూ టౌన్ ఎస్సైలు ఎం.శేఖర్‌బాబు, కేవీఎస్ సత్యనారాయణ తదితరులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. దీనిపై అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై సత్యనారాయణ తెలిపారు. విషయం తెలుసుకున్న రాజా భార్య అనూష, కుమారుడు ప్రశాంత్, కుమార్తె ఎస్తేర్, తదితరులు కాకినాడ చేరుకుని కన్నీరు మున్నీరుగా విలపించారు.
 
 ముడుపుల వ్యవహారమే కారణమా?
 రాష్ర్ట స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖా మంత్రిగా పనిచేసినప్పుడు ఎంపీ నరసింహానికి రాజా వ్యక్తిగత సహాయకుడిగా పనిచేశాడు. మంత్రిగా పనిచేసినప్పుడు హోం గార్డులతో పాటు వివిధ శాఖల్లో ఉద్యోగాల నిమిత్తం రూ. లక్షలు చేతులు మారినట్టు పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి. ఆ సమయంలో రాజా ద్వారానే ఈ ముడుపుల వ్యవహారం సాగినట్టు అప్పట్లో ఆరోపణలు గుప్పుమన్నాయి. అయితే వారిలో ఏ ఒక్కరికీ ఉద్యోగాలు కల్పించకపోగా, వసూలు చేసిన సొమ్ములు తిరిగి చెల్లించకపోవడంతో కొంత కాలంగా వివాదం నెలకొంది. నరసింహం ప్రస్తుతం ఎంపీగా ఉన్నందున ఇప్పటికైనా తమకు ఉద్యోగాలు కల్పించాలని, లేకుంటే సొమ్ములు చెల్లించాలంటూ వారు రాజాపై ఒత్తిడి తీసుకొస్తున్నట్టు సమాచారం. ఈ విషయాన్ని ఎంపీ దృష్టికి తీసుకెళ్లినా ఆయన తనకేమీ సంబంధం లేదన్న ధోరణిలో వ్యవహరించారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో బోనాసు రాజా కాకినాడలో అనుమానాస్పద రీతిలో మృతి చెందడం అనేక సందేహాలకు తావిస్తోంది. రాజాకు ఎలాంటి అప్పులు లేవని, ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదని.. ఎవరో ఏదో చేసి ఉంటారనే అనుమానాలను సన్నిహితులు వ్యక్తం చేస్తున్నారు.
 
 అనుమానాలు రేకెత్తిస్తున్న పరిసరాలు

 స్నేహితుడు చెబుతున్నట్టుగా ఉరివేసేందుకు ఉపయోగించిన షవర్ పెద్ద ఎత్తులో కూడా లేదు. పైగా పోలీసులొచ్చే సరికే మృతదేహాన్ని కిందకు దింపేయడం.. బాత్‌రూమ్‌లో రక్తపు మరకలు ఉండడం.. మెడపై ఎలాంటి ఉరి వేసుకున్న ఛాయలు కన్పించకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది.  సమాచారం తెలిసిన వెంటనే ఎంపీ నరసింహం హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకోవడం.. మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించడం.. పోలీసులపై ఒత్తిడి తీసుకొచ్చి పోస్టుమార్టం నిర్వహించారనే ఆరోపణలు విన్పిపిస్తున్నాయి.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement