పీఎం పాలెం (విశాఖ): ఓ మహిళను మోసం చేసిన ఎంపీడీవోను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విశాఖ జిల్లాలోని మాడుగుల ఎంపీడీవో ఆర్.సత్యనారాయణ గతంలో ఓ మహిళతో వివాహేతర సంబంధం నెరిపాడు. అనంతరం ఆమెను వదిలించుకునేందుకు అడ్డదారులు తొక్కాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు శుక్రవారం వాల్తేరులోని స్వగృహంలో ఉన్న సత్యనారాయణను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
పూర్తి వివరాల్లోకి వెళ్తే.. సత్యనారాయణ అరకులో ఎంపీడీవోగా పనిచేసిన సమయంలో ఆఫీసు అటెండర్‌గా ఉన్న కొర్రా లక్ష్మితో సన్నిహితంగా మెలిగాడు. భర్త చనిపోయి, ముగ్గురు పిల్లలున్న లక్ష్మిని లోబర్చుకున్నాడు. అన్ని విధాలుగా చూసుకుంటానని చెప్పి ఉద్యోగం మాన్పించాడు. పది నెలల క్రితం అక్కడినుంచి వడ్డాది మాడుగులకు బదిలీ కావటంతో ఆమెను వదిలించుకోవాలని చూశాడు. తనకు అన్యాయం జరుగుతోందంటూ ఆమె పెద్దలను ఆశ్రయించింది లక్ష్మి. ఇక మరోదారి లేక రూ.3 వేలు నెలనెలా ఖర్చులకు పంపిస్తానంటూ బేరానికి వచ్చాడు.
ఆమెను అక్కడి నుంచి తీసుకెళ్లి మారికవలసలోని రాజీవ్ గృహకల్ప ప్లాట్లో ఉంచి రాకపోకలు సాగిస్తున్నాడు. కాగా గత నెల 26న లక్ష్మి అనారోగ్యం బారిన పడింది. దీంతో ఆమెను ఆస్పత్రిలో చేర్పిస్తానని చెప్పిన సత్యనారాయణ విశాఖలోని మానసిక చికిత్స కేంద్రానికి తీసుకెళ్లి చేర్పించే ప్రయత్నం చేశాడు. ఆమె మానసికంగా ఆరోగ్యంగానే ఉందని తేల్చిన అక్కడి వైద్యాధికారులు సత్యనారాయణను మందలించి వారిని పంపించేశారు. అనంతరం తిరిగి వచ్చే క్రమంలో ఆమెను ఏదోలా వదిలించుకోవాలని సత్యనారాయణ ప్లాన్ చేశాడు. ఒక హోటల్ వద్ద ఆపి, భోజనం చేద్దామంటూ ఆమెను కిందికి దించాడు. ఆమె లోపలికి వెళ్లగా సత్యనారాయణ మాత్రం కారుతో ఉడాయించాడు. ఈ విషయాలపై బాధితురాలు మహిళా సంఘాల వారి సాయంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై విచారణ జరిపిన పోలీసులు శుక్రవారం సత్యనారాయణను అదుపులోకి తీసుకున్నారు. సత్యనారాయణకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.