అందరినీ కాపాడి..మృత్యు ఒడికి
గండేపల్లి/రాజమండ్రి రూరల్/ అనంతగిరి (విశాఖ), న్యూస్‌లైన్ : ప్రాణాపాయం ముంచుకొచ్చిన క్షణాల్లో గజగజ వణుకుతున్న సహచరులకు ధైర్యం చెప్పి, ఆ అపాయాన్ని తప్పించే ఉపాయాన్ని సూచించిన ధీరుడు ఆ ప్రమాదానికే బలైపోయారు. సౌందర్యారాధకుడి ప్రాణాన్ని ఆ ప్రకృతి ఒడిలోనే మృత్యువు హరించింది. విశాఖ జిల్లా అనంతగిరి మండలం బొర్రా వద్ద బస్సు బోల్తా పడ్డ ప్రమాదంలో గండేపల్లి ఎంపీడీఓ నారదాసు మురళీధర్(42) దుర్మరణం పాలయ్యారు. సహచరులతో కలిసి అరకు లోయ అందాలను చూడడానికి వెళ్లిన ఆయన తిరిగి వస్తుండగా ఈ దుర్ఘటన జరిగింది.
మురళీధర్‌కు భార్య శ్రీవాణి, పదో తరగతి చదువుతున్న కుమారుడు వంశీ, నాలుగో తరగతి చదువుతున్న కుమార్తె శ్రేయ ఉన్నారు. మురళీధర్ రాజమండ్రి రూరల్ మండలం హుకుంపేటలో ఇల్లు కట్టుకుని నివసిస్తుండగా తల్లిదండ్రులు స్వస్థలమైన తిరుపతిలోనే ఉంటున్నారు. వారికి ఈయన పెద్ద కొడుకు.
రెండో శనివారం, ఆదివారం సెలవుదినాలు కావడంతో ఎంపీడీవో కార్యాలయ సిబ్బంది అరకులోయ వెళదామని ప్రతిపాదించారు. ప్రకృతి ఆరాధకుడైన మురళీధర్ వెంటనే సరే అన్నారు. మొత్తం 32 మంది సిబ్బంది కలిసి శుక్రవారం రాత్రి రాజమండ్రికి చెందిన ప్రైవేటు ట్రావెల్స్ బస్సులో గండేపల్లి నుంచి అరకు వెళ్లారు. శనివారం విశాఖతో పాటు అరకులోయను సందర్శించారు. ఆ రాత్రికి అక్కడే బస చేసి ఆదివారం ఉదయం అల్పాహారం అయ్యాక బొర్రా గుహలకు బయల్దేరారు. బొర్రాకు 3 కిలోమీటర్ల దూరంలో రైల్వే గేటు మలుపు వద్ద బస్సు బ్రేకులు చెడిపోయాయి. ఆ సమయంలో బస్సు ఘాట్ రోడ్లో ఎత్తు నుంచి పల్లానికి వెళుతోంది.
సహచరులంతా ప్రాణాలు అరచేత పట్టుకుని భీతిల్లుతుంటే మురళీధర్ వారికి ధైర్యం చెప్పారు. డ్రైవర్ వద్దకు వెళ్లి.. ఎడమవైపున ఎంతో లోతైన లోయ ఉన్నందున కుడివైపున ఉన్న కొండను ఢీకొట్టి బస్సును ఆపమని సూచించారు. డ్రైవర్ అలాగే కొండను ఢీకొనడంతో బస్సు బోల్తా పడింది. అయితే ఆ సమయంలో ఫుట్‌బోర్డుకు తిన్నగా ఉన్న మురళీధర్ అదుపు తప్పి డోర్లోంచి రోడ్డుపై పడి, బస్సు కింద ఇరుక్కుని ప్రాణాలు కోల్పోయారు. మరో 31 మందికి స్వల్ప గాయాలయ్యాయి. మురళీధర్ మృతదేహాన్ని ఎస్సై రామకృష్ణ పొక్లెయిన్ సాయంతో బయటకు తీయించారు. ఎస్.కోట ఆస్పత్రిలో పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని గండేపల్లి తరలిస్తున్నారు. అక్కడి నుంచి హుకుంపేటకు, అనంతరం స్వస్థలమైన తిరుపతికి తరలించనున్నారు. కాగా అందరినీ కాపాడేందుకు తపించిన ఆయనే మృత్యువాత పడ్డారని ఎంఈఓ ఎం.చినరాజు, ఏపీఓ అగస్తల్‌కుమార్, ఎంపీడీఓ కార్యాలయం సూపరింటెండెంట్ పి.రఘురాం ప్రమాదస్థలంలో కన్నీరుమున్నీరయ్యారు.
మక్కువైన ప్రకృతి ఒడిలోనే...
మురళీధర్ దుర్మరణంతో హుకుంపేటలో, గండేపల్లిలో విషాదం అలముకుంది. జరిగిన ఘోరం గురించి చెపితే తట్టుకోలేదని ఆయన భార్య శ్రీవాణికి ప్రమాదంలో కేవలం దెబ్బలు తగిలాయని చెప్పారు. అయితే సాయంత్రానికి విషయం తెలిసిన ఆమె పట్టరాని దుఃఖంతో కుప్పకూలిపోయారు. ప్రకృతి అందాలంటే ఆయనకు వల్లమాలిన ప్రేమ అని, ఆ మక్కువతోనే కార్యాలయ సిబ్బంది అరకు వెళదామనగానే అంగీకరించారని, ఆ ప్రయాణమే ఆయనకు అంతిమ ప్రయాణం అయిందని సన్నిహితులు కంటతడి పెట్టారు. మురళీధర్ మరణవార్త వినగగానే జిల్లాకు చెందిన పలువురు ఎంపీడీఓలు హుకుంపేట వల్లేపల్లి వీర్రాజునగర్‌లోని ఆయన ఇంటికి చేరుకున్నారు. అందరికీ తలలోనాలుకలా, అజాతశత్రువుగా ఉండే మురళీధర్ మరణాన్ని జీర్ణించుకోలేకపోతున్నామన్నారు. కాగా మురళీధర్ భార్యాబిడ్డలను మంత్రి తోట నరసింహం, డీసీసీ ఉపాధ్యక్షుడు కోర్పు లచ్చయ్యదొర, జగ్గంపేట మార్కెట్ కమిటీ చైర్మన్ కుందం రాజు ఆదివారం రాత్రి ఓదార్చారు.
సమైక్య ఉద్యమంలో కీలకపాత్ర
పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో ఈఓపీఆర్‌డీగా 1996లో బాధ్యతలు చేపట్టి మురళీధర్ 1999లో పదోన్నతిపై సీతానగరం ఎంపీడీఓగా తూర్పుగోదావరికి వచ్చారు. కాజులూరు మండలంలోనూ పని చేసిన ఆయన 2004లో గండేపల్లి ఎంపీడీఓగా బదిలీ అయ్యారు. అనంతరం ఆలమూరు బదిలీపై వెళ్లిన ఆయన తిరిగి 2009లో గండేపల్లికి వచ్చారు. నిబద్ధతతో పని చేసే అధికారిగా అందరి మన్ననలు అందుకున్నారు. ఇటీవల జరిగిన సమైక్యాంధ్ర ఉద్యమంలో మంండల జేఏసీ తరపున కీలకపాత్ర పోషించారు. ఎంపీడీఓల యూనియన్‌లో కూడా చురుకుగా వ్యవహరించారు.