దీక్షల్లో కూర్చొన్న కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి
సాక్షి, కడప : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన జిల్లా ఎంపీలు ప్రత్యేక హోదా సాధన కోసం అలుపెరుగని పోరాటం చేస్తున్నారు. ఢిల్లీ వేదికగా....పార్లమెంటులో ప్రధాని మోదీకి తెలిసొచ్చేలా అనుక్షణం çహోదా నినాదాలతో హోరెత్తించిన ఎంపీలు చివరకు అవిశ్వాస తీర్మానానికి పట్టుబట్టారు. పార్లమెంటు సమావేశాలు జరిగినన్ని రోజులు హోదా కోసం పార్లమెంటులో పోరు సాగిస్తూనే వచ్చారు. 13 సార్లు నోటీసులు ఇచ్చినా కేంద్రం స్పందించకపోవడం...పైగా పార్లమెంటు దీర్ఘకాలికంగా వాయిదా పడడంతో వెనువెంటనే స్పీకర్ ఫార్మెట్‌లో రాజీనామాలు చేశారు. అక్కడి నుంచి నేరుగా ఏపీ భవన్‌కు చేరుకుని ఆమరణ నిరాహార దీక్షకు పూనుకున్నారు. హోదా ఉద్యమ నినాదంతో ఆది నుంచి కూడా ఎంపీలు అలుపెరుగని పోరాటం సాగిస్తూనే ఉన్నారు.
ఐదు రోజులు దాటిన ఎంపీల దీక్ష
ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ ఏపీ భవన్ వద్ద కడప పార్లమెంటు సభ్యుడు వైఎస్ అవినాష్‌రెడ్డి, రాజంపేట పార్లమెంటు సభ్యుడు పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డిలు ఆమరణ నిరాహార దీక్షలో కూర్చొన్నారు. ఈనెల 6వ తేదీ నుంచి ఇప్పటివరకు దాదాపు ఐదు రోజులు దాటింది. ప్రతిరోజు వైద్యులు కూడా పరీక్షలు నిర్వహిస్తున్నారు. జిల్లాలో కూడా పలుమార్లు వారిరువురు ప్రత్యేక హోదా కోసం అనేక ఆందోళనల్లో పాల్గొన్నారు. ధర్నాలు, రాస్తారోకోలు, వినతిపత్ర సమర్పణ, కలెక్టరేట్ వద్ద ఆందోళన కార్యక్రమాల్లో పాలు పంచుకున్నారు.
వెల్లువెత్తుతున్న సంఘీభావం
దిల్లీలో ప్రత్యేక హోదా కోసం ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న ఎంపీలకు జిల్లాలోని అన్ని వర్గాల ప్రజల నుంచి సంఘీభావం వెల్లువెత్తుతోంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలంతా ఇప్పటికే వెళ్లి ఇరువురు నేతలను పరామర్శించారు. పలు సామాజిక వర్గాలకు చెందిన నాయకులు వెళ్లి నిరాహార దీక్షకు సంఘీభావం తెలియజేశారు. ప్రత్యేక హోదా కోసం చేస్తున్న ఈ పోరాటంలో తాము కూడా ఉంటామంటూ దీక్షలో కూర్చొని మద్దతు తెలియజేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment