ప్రత్యేక రైల్వే జోన్ ఇవ్వండి..
► రైల్వే బోర్డు చైర్మన్‌కు ఎంపీల వినతి
► నగరంలో రెండు రోజుల పర్యటనకు విచ్చేసిన ఏకే మిట్టల్
అల్లిపురం (విశాఖ దక్షిణం): విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ ఏర్పాటు చేయాలని కోరుతూ విశాఖ ఎంపీలు కంభంపాటి హరిబాబు, ముత్తం శెట్టి శ్రీనివాసరావులు రైల్వే బోర్డు చైర్మన్ ఏ.కె.మిట్టల్‌కు వినతిపత్రం సమర్పించారు. జోన్ ప్రాధాన్యం, సాధ్యాసాధ్యాలపై చైర్మన్‌తో వీరు చర్చించారు. జోన్ ఏర్పాటుకు వనరుల విశ్లేషణకు క్షేత్ర స్థాయి పరిశీలనకు రైల్వే బోర్డు చైర్మన్ శుక్రవారం నగరానికి వచ్చారు.
ప్రశాంతి ఎక్స్‌ప్రెస్‌లో మధ్యాహ్నం 12.45 గం టలకు విశాఖ రైల్వే స్టేషన్‌కు చేరుకున్న ఆయనకు తూర్పు కోస్తా రైల్వే, జనరల్ మేనేజర్ ఉమేష్ సింగ్, డీఆర్‌ఎం ముఖుల్ శరన్ మాథుర్, ఏడీఆర్‌ఎం అజయ్ అరోరాలు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం ఆయన డీఆర్‌ఎం కార్యాలయానికి చేరుకుని ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. వాల్తేరు డివిజనల్‌లో గల రైల్వే భూములు, ఆస్తులు, జోన్ ఏర్పాట్లలోని సాంకేతిక సమస్యల గురించిన వివరాలను అడిగి తెలుసుకున్నట్లు సమాచారం.
అనంతరం ఎంపీలు కంభంపాటి హరిబా బు, ముత్తం శెట్టి శ్రీని వాసులు రైల్వే బోర్డు చైర్మన్‌తో ప్రత్యేకంగా బేటీ అయ్యారు. ఉత్తరాంధ్ర ప్రజల చిరకాల కోరిక, విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ ఏర్పాటుపై ఎంపీలు తమ వద్ద ఉన్న సమాచారాన్ని ఆయనకు అందజేశారు.
తుని–కొత్తవలస రైల్వే లైన్‌కు ప్రతిపాదనలు అందజేత
అనకాపల్లి ఎంపీ ముత్తంశెట్టి శ్రీనివాసరావు తుని–కొత్తవలస నూత న రైల్వే లైన్ ఏర్పాటు ప్రతిపాదనలను రైల్వే బోర్డు చైర్మన్‌కు అందజేశారు. దీనిపై ఇప్పటికి చేసిన రెండు సర్వే రిపోర్టులను ఆయనకు వివరించారు. తుని నుంచి దిగువ పోలవరం, చెర్లపాలెం, నర్సీపట్నం, రోలుగుంట, రావికమతం, చోడవరం, కొలగొట్ల, దేవరాపల్లి, కోరువాడ మీదుగా కొత్తవలస జంక్షన్‌కు 145.93 కి.మీ దూరంతో ఒక ప్రతిపాదన, తుని, దిగువ పోలవరం, చెర్లపాలెం, నర్సీపట్నం, రోలుగుంట, రావికమతం, వడ్డాది, మాడుగుల, చీడికాడ, దేవరాపల్లి ,కోరువాడ మీదుగా కొత్తవలస జంక్షన్‌కు 153.11 కి.మీ.లతో మరో ప్రత్యేక లైన్‌కు ప్రతిపాదనలను చైర్మన్‌కు అందజేశారు.
స్టేషన్లలో సమస్యలపై వినతి
సౌత్ సెంట్రల్ రైల్వే పరిధి, అనకాపల్లి పార్లమెంట్ పరిధిలో వివిధ స్టేషన్లలో సౌకర్యాలు మెరుగుపరచాలని ఎంపీ ముత్తంశెట్టి శ్రీనివాసరావు, రైల్వే బోర్డు చైర్మన్‌కు వినతి పత్రం అందజేశారు. అనకాపల్లి స్టేషన్‌ను మోడల్ స్టేషన్‌గా అభివృద్ధి చేయాలని, లిఫ్టులు, ఎస్కలేటర్లు, బ్యాటరీ కార్ట్, వీల్ చైర్లు, జనరేటర్, వైఫై, 2, 3 ప్లాట్ ఫారాల మధ్య ఫుట్ ఓవర్ బ్రిడ్జి ఏర్పాటుకు ప్రతిపాదనలపై అనుమతులు ఇప్పటికే వచ్చాయని, పనులు మొదలు పెట్టాలని కోరారు.
అదే విధంగా యలమంచిలి స్టేషన్‌లో రత్నాచల్ ఎక్స్‌ప్రెస్‌కు హల్ట్ ఏర్పాటు, పే అండ్ యూస్ టాయిలెట్లు, తాడి రైల్వే స్టేషన్‌లో టాయిలెట్లు, సీసీ రోడ్లు ఏర్పాటు, బయ్యవరం రైల్వే స్టేషన్‌లో లోడింగ్ అన్‌లోడింగ్‌కు అప్రోచ్‌రోడ్డు నిర్మాణం తదితర సమస్యలను పరిష్కరించాలని చైర్మన్‌కు విన్నవించారు.