భద్రాచలం, న్యూస్‌లైన్ : స్థానిక సంస్థల ఎన్నికలకు పార్టీ శ్రేణులను సమాయత్తం చేసేందుకు కేంద్ర మంత్రి పోరిక బలరాం నాయక్ మంగళవారం భద్రాచలంలోని కాంగ్రెస్ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో పలువురు నాయకులు అసంతృప్తి గళాన్ని వినిపించారు. డివిజన్‌లోని ఎనిమిది మండలాల కార్యకర్తలు పాల్గొన్న ఈ సమావేశంలో పలువురు మండల పార్టీ అధ్యక్షులు, సీనియర్ నాయకులు మాట్లాడుతూ ఎంపీ, ఎమ్మెల్యే తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ చర్ల మండల అధ్యక్షుడు కర్నాటి శ్రీనివాస్ మాట్లాడుతూ.. పార్టీ కోసం అహర్నిశలు పనిచేసిన వారిని పరిగణనలోకి తీసుకోకుండా ఎన్నికల సమయంలో ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి టికెట్లు ఇచ్చే ప్రయత్నాలను విరమించుకోవాలని కోరారు.
డివిజన్ పార్టీలో వర్గాలు, గ్రూపులు ఉన్నాయని, పార్టీకి ఇంతటి దౌర్భాగ్యం పట్టిందని అన్నారు. దుమ్ముగూడెం మండల పార్టీ అధ్యక్షుడు లంకా అబ్బులు మాట్లాడుతూ కొంత ఘాటైన వ్యాఖ్యలే చేశారు. వర్ణించలేని విధంగా కాంగ్రెస్ పార్టీని పోల్చారు. నాయకులు వస్తే ఓట్లేసే పరిస్థితుల పోయాయన్నారు. గెలిచిన ఐదేళ్లలో ఎంపీ ఒక్కసారి కూడా గ్రామానికి రాలేదని, ఇప్పుడు ఓట్లు ఏమని అడగాలని నిలదీశారు. ఎన్నికలప్పుడు పోస్టర్‌లు వేసి ప్రచారం చేసినంత మాత్రాన సరిపోదని, ప్రజలు, పార్టీ కేడర్ కోసం గెలిచిన ప్రజాప్రతినిధులు పనిచేయాల్సిన అవసరం ఉందని అన్నారు. ‘కాంగ్రెస్‌లో వెన్నుపోటు రాజకీయాలు ఉన్నాయని, మనల్ని మనమే ఓడించుకుంటున్నా’మని అన్నారు. మండల కాంగ్రెస్ నాయకుడిగా గ్రామాల్లో కనీసం చిన్నపాటి పనికూడా చేసే పరిస్థితి లేదని భద్రాచలం మండల కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు, పార్టీ సీనియర్ నాయకుడు దొంతు మంగేశ్వరరావు ఆవేదన వ్యక్తం చేశారు.
కేంద్రంలో, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ ప్రజలకు ఏ పనులూ చేయలేకపోయామన్నారు. ఓ ప్రజాప్రతినిధి ఇతర పార్టీల నాయకులను పిలిపించుకొని శంకుస్థాపనలు చేస్తుంటారని, మరో ప్రజాప్రతినిధి టీడీపీ నాయకులకు కాంట్రాక్టు పనులు అప్పగిస్తుంటారని, ఇలా అయితే పార్టీ ఎలా బతుకుతుందని ప్రశ్నించారు. వారి వైఖరితో ఇప్పటికే కార్యకర్తలు ఆగ్రహంతో ఉన్నారని, ఈసారి వారితో ఎలా పనిచేయించుకుంటామని నిలదీశారు. ఉపన్యాసాలు ఇస్తే సరిపోదని, గ్రామాల్లో ప్రజలు ఎలా ఆలోచిస్తున్నారో గమనించాలని అన్నారు. గత పంచాయతీ ఎన్నికల్లో గుణపాఠం చెప్పినా పార్టీ నాయకుల్లో ఇంకా మార్పు రాలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇప్పటివరకు దీనిపై ఎలాంటి సమీక్ష కూడా నిర్వహించలేదని అన్నారు. అనంతరం బలరాం నాయక్ మాట్లాడుతూ.. నాయకుల ఆవేదనలో కొంత అర్థం ఉందని, ఇలాంటి తప్పిదాలు పునరావృతం కాకుండా చూస్తామని అన్నారు.
వచ్చే ఎన్నికల్లో నాయకులంతా సమష్టిగా పనిచేసి అత్యధిక సంఖ్యలో జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలను గెలుచుకోవాలని సూచించారు. సమావేశంలో పార్టీ నాయకులు నల్లపు దుర్గాప్రసాద్, మైథిలిరెడ్డి, రమేష్‌గౌడ్, బొలిశెట్టి రంగారావు, బోగాల శ్రీనివాసరెడ్డి, తాండ్ర నర్సింహారావు, చింతర్యాల రవికుమార్, కుంజా ధర్మారావు తదితరులు పాల్గొన్నారు.
ఏ ముఖం పెట్టుకుని ఓట్లు అడగాలి?
Published Wed, Mar 12 2014 2:17 AM | Last Updated on Mon, Mar 18 2019 7:55 PM
Advertisement