porika balaram naik
-
సర్కారుకు కళ్లు లేవు..!
ఇల్లెందు : ‘‘టీఆర్ఎస్ ప్రభుత్వానికి కళ్లు లేవు. రైతు ఆత్మహత్యలను చూడట్లేదు, వాటిని ఏమాత్రం పట్టించుకోవట్లేదు’’ అని, కాంగ్రెస్ నాయకుడు.. కేంద్ర మాజీ మంత్రి పోరిక బలరాం నాయక్ విమర్శించారు. ఇల్లెందు మండలం చల్ల సముద్రం పంచాయతీ సేవ్యాతండాలో (ఆత్మహత్య చేసుకున్న) రైతు కున్సోతు బాలు మృత దే హాన్ని గురువారం సందర్శించి నివాళులర్పించా రు. కుటుంబాన్ని ఓదార్చారు. అనంతరం, కాం గ్రెస్ పట్టణ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఆయన ఏమ న్నారంటే... ‘‘పంటలకు గిట్టుబాటు ధర లేదు. పంట నష్ట పరిహారం ఇవ్వడంలో ప్రభుత్వం విఫలమైంది. ఎంపీలు, ఎమ్మెల్యేలు, మంత్రులు ఏం చేస్తున్నారు? గ్రామాల్లోని ఈ దయనీయ పరిస్థితిని సీఎం దృష్టికి తెచ్చి, బాధిత రైతులను ఆదుకునేలా చర్యలు శ్రద్ధ చూపకపోవడం దారుణం. బాలు కుటుంబానికి ప్రభుత్వం పరిహారం చెల్లించాలి. అతడి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలి. పిల్లలకు ఉచిత విద్యను అందించాలి’’. ‘ఆంబజార్’ ఆవేదన ఇల్లెందులోని ఆంబజార్‌లో బలరాం నాయక్ పర్యటించారు. ప్రధాన రోడ్డు మధ్య నుంచి మిషన్ భగీరథ పైపులైన్ తవ్వకాలతో రోడ్డు పూర్తిగా ధ్వంసమైందని, ఆ మట్టంతా తమ దుకాణాల్లో పడు తోందని అక్కడి వ్యాపారులు బలరాం నాయక్ వద్ద ఆవేదన వ్యక్తం చేశారు. ఈ తవ్వకాలతో నెల రోజుల నుంచి తమ దుకాణాలు నడవటం లేదని, రోడ్డు వెడల్పు పేరుతో ఇబ్బందులపాలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వీటిపై కలెక్టర్‌తో మా ట్లాడతానని బలరాం నాయక్ చెప్పారు. ఆయన వెంట కాంగ్రెస్ పట్టణ, మండల అధ్యక్షులు ఎస్కె.జానీ, పోషం వెంకటేశ్వర్లు, నాయకులు సి హెచ్.వెంకటేశ్వర్లు, బి.దళ్‌సింగ్ నాయక్, బి.హరిప్రి య, మంజ్యా శ్రీను నాయక్, సత్యవతి, మిల్ట్రీ ర వి, దాస్యం ప్రమోద్‌కుమార్, పులి సైదులు, జీవీ భద్ర ం, సుధీర్ తోత్లా, నంద కిషోర్, కటకం దయాకర్, ధన్‌రాజ్, నవీన్, రుద్ర రామస్వామి, బండ్ల శ్రీ ను, బండ్ల రజని, తోట లలిత శారద, అక్తర్ ఉన్నారు. -
నాయక్‌పై దూసిన కత్తి
వరంగల్, న్యూస్‌లైన్: తెలంగాణ పీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య సమక్షంలో కేంద్ర మంత్రి, మానుకోట ఎంపీ అభ్యర్థి పోరిక బలరాం నాయక్, నర్సంపేట ఎమ్మెల్యే అభ్యర్థి కత్తి వెంకటస్వామి నువ్వెంత అంటే నువ్వెంత అంటూ కొట్లాటకు దిగడం జిల్లాలో చర్చనీయూంశంగా మారింది. సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో గెలుపోటములపై జిల్లాలోని అభ్యర్థులు,ముఖ్య నేతలతో హైదరాబాద్ గాంధీభవన్‌లో సోమవారం తెలంగాణ పీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య సమీక్షించారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ అభ్యర్థిగా ఉన్న తనకు బలరాం నాయక్ సహకరించలేదని కత్తి వెంకటస్వామి ఆరోపించడంతో గొడవ మొదలైంది. స్వతంత్ర అభ్యర్థి దొంతికి సహకరించారని, తనకు సహకరించని పార్టీ నేతలను సస్పెండ్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. దీంతో ప్రత్యర్థి పార్టీలకు అమ్ముడుపోయావని వెంకటస్వామిపై నాయక్ ధ్వజమెత్తాడు. ఇరువురి మధ్య మాటామాట పెరగడంతో మిగిలిన వారు కలుగచేసుకుని వారించినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. పార్టీ వ్యతిరేకులపై చర్యలు ఎన్నికల్లో పార్టీకి వ్యతిరేకంగా పనిచేసిన వారిని గుర్తించి వారిపై చర్యలు తీసుకోనున్నట్లు పొన్నాల లక్ష్మయ్య స్పష్టం చేశారు. ఈ మేరకు పార్టీ వ్యతిరేకులను గుర్తించి నివేదిక సమర్పించాలని డీసీసీ బాధ్యులను ఆదేశించారు. స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలు వెల్లడికాగానే క్యాంప్‌లు నిర్వహించి చైర్మన్ స్థానాలను కైవసం చేసుకునేలా శ్రద్ధ వహించాలని నాయకులకు ఆయన సూచించినట్లు తెలిసింది. ముగ్గురు గైర్హాజరు ఈ సమావేశానికి టీ పీసీసీ అధ్యక్షుడి సొంత జిల్లాకు చెందిన ముగ్గురు అభ్యర్థులు డుమ్మా కొట్టారు. స్టేషన్‌ఘన్‌పూర్, మహబూబాబాద్, వర్ధన్నపేట నుంచి ఎమ్మెల్యేలుగా పోటీచేసిన డాక్టర్ విజయరామారావు, మాలోతు కవిత, కొండేటి శ్రీధర్ గైర్హాజరయ్యారు. విజయరామారావు, శ్రీధర్ ఆస్పత్రిలో చికిత్సపొందుతుండగా కవిత తిరుపతికి దైవదర్శనానికి వెళ్లారు. సమావేశంలో మాజీ మంత్రులు బస్వరాజు సారయ్య, డీఎస్. రెడ్యానాయక్, మాజీ చీఫ్ విప్ గండ్ర వెంకటరమణారెడ్డి, మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య, సార్వత్రిక ఎన్నికల్లో పోటీచేసిన అభ్యర్థులు పొదెం వీరయ్య, దుగ్యాల శ్రీనివాసరావు, కత్తి వెంకటస్వామి, ఎర్రబెల్లిస్వర్ణ, ఇనుగాల వెంకట్రాంరెడ్డి, ఎమ్మెల్సీ నాగపురి రాజలింగం, కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు నాయిని రాజేందర్‌రెడ్డి, పీసీసీ కార్యదర్శి డాక్టర్ హరిరమాదేవి, శ్రీరాంభద్రయ్య, పి.లక్ష్మణ్‌గౌడ్, కృష్ణమూర్తి, జిల్లా నాయకులు వరద రాజేశ్వర్‌రావు, ఈవీ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. కొండేటికి పరామర్శ సమావేశం అనంతరం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కొండేటి శ్రీధర్, విజయరామారావును జిల్లా కాంగ్రెస్ నాయకులు పరామర్శించారు. -
నాకేం తెలీదు... అంతా అధిష్టానానిదే..
కరకగూడెం (పినపాక), న్యూస్‌లైన్: మహబూబాబాద్ కాంగ్రెస్ ఎంపీ పోరిక బలరాం నాయక్‌కు ఆ పార్టీ పినపాక నియోజకవర్గస్థాయి సమావేశంలో చేదు అనుభవం ఎదురైంది. ‘ఎంపీ గో బ్యాక్’ అంటూ, కార్యకర్తలు.. నాయకులు నినాదాలు చేయడంతో ఆయన అవాక్కయ్యారు. దీనికి సంబంధించిన వివరాలు... కాంగ్రెస్ పార్టీ పినపాక నియోజకవర్గస్థాయి సమావేశం మంగళవారం కరకగూడెంలో ఏర్పాటైంది. ఈ సమావేశానికి పార్టీ నేత, మహబూబాద్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి పోరిక బాలరామ్ నాయక్ ముఖ్య అతిధిగా హాజరయ్యారు. సమావేశం ప్రారంభంలోనే.. పార్టీ నాయకులు, కార్యకర్తలు ఒక్కసారిగా ‘ఎంపీ.. గో బ్యాక్’ అంటూ నినాదాలు చేయడంతో గందరగోళం ఏర్పడింది. వారిని ఎమ్మెల్యే రేగా కాంతారావు సముదాయించారు. ఆ తరువాత ఆయన మాట్లాడుతూ.. ‘నాకు టికెట్ రాకుండా బలరామ్ నాయక్ ద్రోహం చేశారు. పినపాక నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంది. నాకు జరిగిన నష్టాన్ని పార్టీ నాయకులు, కార్యకర్తలు జీర్ణించుకోలేకపోతున్నారు’ అని అన్నారు. ఈ దశలో.. రేగా కాంతారావుకు మద్దతుగా, బలరామ్ నాయక్‌కు వ్యతిరేంగా సమావేశానికి హాజరైన వారు నినాదాలు చేశారు. దీంతో, సమావేశంలో దాదాపు అరగంటపాటు తీవ్ర గందరగోళం నెలకొంది. నియోజకవర్గంలో ఎలాంటి బలం లేని సీపీఐకి సీటు కేటాయించడం అన్యాయమని పార్టీ నాయకులు, కార్యకర్తలు అన్నారు. సీపీఐకి ఓటు వేసేదే లేదని తెగేసి చెప్పారు. నాకేం తెలీదు... అంతా అధిష్టానానిదే.. పరిస్థితి సద్దుమణిగిన అనంతరం, ఎంపీ అభ్యర్థి బలరామ్ నాయక్ మాట్లాడుతూ.. ‘పొత్తుల్లో భాగంగానే పినపాక అసెంబ్లీ సీటును సీపీఐకి అధిష్టానం కేటాయించింది. నాకు తెలియకుండానే ఇది జరిగింది. పినపాక సీటు త్యాగం చేసిన రేగా కాంతారావు.. అధిష్టానం దృష్టిలో ఉన్నారు. తెలంగాణాలో ప్రభుత్వం ఏర్పాటు తరువాత ఆయనకు తగిన పదవి ఇచ్చేందుకు నా శక్తి వంచన లేకుండా కృషి చేస్తాను’ అని అన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటుకు కార్యకర్తలంతా కృషి చేయాలని కోరారు. కాంగ్రెస్-సీపీఐ కూటమి అభ్యర్థులను గెలిపించుకునే బాధ్యత కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలపై ఉందన్నారు. తనను ఎంపీగా గెలిపించేందుకు అందరూ సమష్టిగా కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. ఎంపీ ఇంతగా చెప్పినా.. కొందరు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు అసంతృప్తితో సమావేశం నుంచి బయటకు వెళ్లిపోయారు. -
ఒక్క గ్రామాన్నీ వదులుకోం
భద్రాచలం, న్యూస్‌లైన్:జిల్లాలోని ఏ ఒక్క గ్రామా న్నీ వదులుకునేది లేదని కేంద్ర మంత్రి పోరిక బలరామ్ నాయక్ అన్నారు.ఆయన మంగళవారం భద్రాచలంలో జరిగిన పార్టీ డివిజన్‌స్థాయి సమావేశంలో మాట్లాడుతూ.. పోలవరం ముంపు పరిధిలోని అన్ని గ్రామాలు తెలంగాణలోనే ఉం టాయన్నారు. ‘పోలవరం’ నిర్వాసితులకు తెలంగాణ రాష్ట్రంలోనే పునరావాసం కల్పిస్తామన్నారు. పోలవరం విషయంలో సీపీఎం రెండు నాల్కల ధోరణి అవలంబిస్తున్నదని ఆరోపించారు. ఇక్కడ పోలవరం ప్రాజెక్టు కట్టవద్దని పోరాడుతున్న సీపీఎం.. పార్లమెంటులో ఎందుకు నోరు మెదపలేదని ప్రశ్నించారు. వారికి ప్రజలు తగిన బుద్ధి చెప్పాలని కోరారు. ‘పోలవరం ముంపు ప్రాంతా లు కూడా తెలంగాణలోనే ఉంటాయని మీరు చెబుతున్నారు. కానీ, 134 రెవెన్యూ గ్రామాలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కలిపారు కదా..!’ అని విలేకరులడిగిన ప్రశ్నకు సమాధానమిచ్చేందుకు మంత్రి తడబడ్డారు. తమ ఒత్తిడితోనే ముంపు మండలాల విలీనం ఆర్డినెన్స్ ఆగిపోయిందన్నారు. వచ్చే ప్రభుత్వం అంగీకరిస్తేనే ముంపు మండలాల విలీనం జరుగుతుందని, లేదంటే ఆ గ్రామాలన్నీ తెలంగాణలోనే ఉంటాయని అన్నారు. జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపికకు కమిటీ వేయనున్నట్టు చెప్పారు. పోరికపై జైరాం రమేశ్ అసంతృప్తి విలేకరుల సమావేశానికి ముందు.. పోరిక బలరామ్‌నాయక్‌కు మరో కేంద్ర మంత్రి, జీవోఎం సభ్యుడు జైరాం రమేశ్ ఫోన్ చేశారు. వారిద్దరి సంభాషణనుబట్టి.. పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణ విషయంలో ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా మాట్లాడినట్లుగా పత్రికల్లో వచ్చిన కథనాలపై జైరాం అసంతృప్తి వ్యక్తం చేసినట్టుగా అర్థమైంది. దీనికి అనుగుణంగానే బలరామ్ నాయక్ సంజాయిషీ ఇచ్చుకున్నారు. తాను అలా అనలేదని, పత్రికల్లోనే తప్పుగా వచ్చిందని చెప్పారు. -
ఏ ముఖం పెట్టుకుని ఓట్లు అడగాలి?
భద్రాచలం, న్యూస్‌లైన్ : స్థానిక సంస్థల ఎన్నికలకు పార్టీ శ్రేణులను సమాయత్తం చేసేందుకు కేంద్ర మంత్రి పోరిక బలరాం నాయక్ మంగళవారం భద్రాచలంలోని కాంగ్రెస్ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో పలువురు నాయకులు అసంతృప్తి గళాన్ని వినిపించారు. డివిజన్లోని ఎనిమిది మండలాల కార్యకర్తలు పాల్గొన్న ఈ సమావేశంలో పలువురు మండల పార్టీ అధ్యక్షులు, సీనియర్ నాయకులు మాట్లాడుతూ ఎంపీ, ఎమ్మెల్యే తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ చర్ల మండల అధ్యక్షుడు కర్నాటి శ్రీనివాస్ మాట్లాడుతూ.. పార్టీ కోసం అహర్నిశలు పనిచేసిన వారిని పరిగణనలోకి తీసుకోకుండా ఎన్నికల సమయంలో ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి టికెట్లు ఇచ్చే ప్రయత్నాలను విరమించుకోవాలని కోరారు. డివిజన్ పార్టీలో వర్గాలు, గ్రూపులు ఉన్నాయని, పార్టీకి ఇంతటి దౌర్భాగ్యం పట్టిందని అన్నారు. దుమ్ముగూడెం మండల పార్టీ అధ్యక్షుడు లంకా అబ్బులు మాట్లాడుతూ కొంత ఘాటైన వ్యాఖ్యలే చేశారు. వర్ణించలేని విధంగా కాంగ్రెస్ పార్టీని పోల్చారు. నాయకులు వస్తే ఓట్లేసే పరిస్థితుల పోయాయన్నారు. గెలిచిన ఐదేళ్లలో ఎంపీ ఒక్కసారి కూడా గ్రామానికి రాలేదని, ఇప్పుడు ఓట్లు ఏమని అడగాలని నిలదీశారు. ఎన్నికలప్పుడు పోస్టర్లు వేసి ప్రచారం చేసినంత మాత్రాన సరిపోదని, ప్రజలు, పార్టీ కేడర్ కోసం గెలిచిన ప్రజాప్రతినిధులు పనిచేయాల్సిన అవసరం ఉందని అన్నారు. ‘కాంగ్రెస్‌లో వెన్నుపోటు రాజకీయాలు ఉన్నాయని, మనల్ని మనమే ఓడించుకుంటున్నా’మని అన్నారు. మండల కాంగ్రెస్ నాయకుడిగా గ్రామాల్లో కనీసం చిన్నపాటి పనికూడా చేసే పరిస్థితి లేదని భద్రాచలం మండల కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు, పార్టీ సీనియర్ నాయకుడు దొంతు మంగేశ్వరరావు ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రంలో, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ ప్రజలకు ఏ పనులూ చేయలేకపోయామన్నారు. ఓ ప్రజాప్రతినిధి ఇతర పార్టీల నాయకులను పిలిపించుకొని శంకుస్థాపనలు చేస్తుంటారని, మరో ప్రజాప్రతినిధి టీడీపీ నాయకులకు కాంట్రాక్టు పనులు అప్పగిస్తుంటారని, ఇలా అయితే పార్టీ ఎలా బతుకుతుందని ప్రశ్నించారు. వారి వైఖరితో ఇప్పటికే కార్యకర్తలు ఆగ్రహంతో ఉన్నారని, ఈసారి వారితో ఎలా పనిచేయించుకుంటామని నిలదీశారు. ఉపన్యాసాలు ఇస్తే సరిపోదని, గ్రామాల్లో ప్రజలు ఎలా ఆలోచిస్తున్నారో గమనించాలని అన్నారు. గత పంచాయతీ ఎన్నికల్లో గుణపాఠం చెప్పినా పార్టీ నాయకుల్లో ఇంకా మార్పు రాలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇప్పటివరకు దీనిపై ఎలాంటి సమీక్ష కూడా నిర్వహించలేదని అన్నారు. అనంతరం బలరాం నాయక్ మాట్లాడుతూ.. నాయకుల ఆవేదనలో కొంత అర్థం ఉందని, ఇలాంటి తప్పిదాలు పునరావృతం కాకుండా చూస్తామని అన్నారు. వచ్చే ఎన్నికల్లో నాయకులంతా సమష్టిగా పనిచేసి అత్యధిక సంఖ్యలో జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలను గెలుచుకోవాలని సూచించారు. సమావేశంలో పార్టీ నాయకులు నల్లపు దుర్గాప్రసాద్, మైథిలిరెడ్డి, రమేష్‌గౌడ్, బొలిశెట్టి రంగారావు, బోగాల శ్రీనివాసరెడ్డి, తాండ్ర నర్సింహారావు, చింతర్యాల రవికుమార్, కుంజా ధర్మారావు తదితరులు పాల్గొన్నారు. -
నిరసన హోరు...
కూనవరం/ వీఆర్‌పురం, న్యూస్‌లైన్: కేంద్ర మంత్రి పోరిక బలరాం నాయక్‌కు ఆదివాసీల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. కూనవరం, వీఆర్ పురం మండలాల్లో ఆదివారం జరిగిన ఆయన పర్యటనను ఆందోళనకారులు అడ్డుకున్నారు. తమ గ్రామాలను ముంచే పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణాన్ని నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ కూనవరం మండలం టేకులబోరులో ఆయన కాన్వాయ్కి అడ్డుతగిలారు. పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణానికి తాము వ్యతిరేకం కాదని ప్రకటన ఎలా చేశారంటూ ఆదివాసీలు, ఉద్యోగ సంఘాల నాయకులు మంత్రి కాన్వాయ్‌ని చుట్టుముట్టారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. ముంపు గ్రామాలు తెలంగాణలోనే ఉంటాయని, ఏ ఒక్క గ్రామం కూడా సీమాంధ్రలోకి వెళ్లదని స్పష్టం చేశారు. ఈ విషయంలో చివరి నిమిషంలో తనతో పాటు జిల్లా మంత్రి రాంరెడ్డి వెంకటరెడ్డి, భద్రాచలం, పినపాక ఎమ్మెల్యేలు కుంజా సత్యవతి, రేగా కాంతారావు కలిసి సోనియాకు, దిగ్విజయ్‌సింగ్‌కు విన్నవించామని చెప్పారు. ఈ విషయంలో తాను శక్తివంచన లేకుండా శ్రమిస్తున్నాని అన్నారు. దీంతో ఆందోళన విరమించిన నాయకులు పోలవరం నిర్మాణాన్ని నిలిపివేసేలా చూడాలని కోరుతూ మంత్రికి వినతిపత్రం అందజేశారు. అనంతరం ఆయన వీఆర్ పురం మండలానికి వెళ్లగా.. రేఖపల్లి ప్రధాన రహదారిపై సీపీఎం ఆధ్వర్యంలో పలువురు ఆదివాసీలు అడ్డుకున్నారు. పోలవరం పేరుతో ఈ ప్రాంతంలో ఎంతోకాలంగా అభివృద్ధి పనులు నిలిచిపోయాయని, ఇప్పుడు ముంపు ప్రాంతాల పేరుతో తమ జీవితాలతో ఆడుకోవద్దని మంత్రి కాన్వాయ్‌ని ముట్టడించారు. ఆయన ముందుకు వెళ్లకుండా రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ముంపు గ్రామాలన్నీ తెలంగాణలో నే ఉంటాయని బలరాం నాయక్ చెప్పినా.. ఆందోళనకారులు వినిపించుకోలేదు. ఈ విషయంలో అధికార పార్టీ నాయకులే రోజుకో మాట మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. భద్రాచలం రెవెన్యూ డివిజన్లోని ఒక్క గ్రామం కూడా సీమాంధ్రలో కలవదని మంత్రి నచ్చజెప్పే ప్రయత్నం చేసినా.. వారు నమ్మలేదు. ఇలా సుమారు గంటకు పైగా మంత్రి కాన్వాయ్ రోడ్డుపైనే ఉండాల్సి వచ్చింది. ముంపు బాధితులకు న్యాయం జరిగేలా చూస్తానని, ఈ ప్రాంతమంతా తెలంగాణలోనే ఉంచేలా చూస్తానని మంత్రి హామీ ఇవ్వడంతో ఎట్టకేలకు ఆందోళన విరమించారు. రేఖపల్లిలో జరిగిన ఆందోళనకు మాజీ ఎమ్మెల్యే సున్నం రాజయ్య, టేకులబోరులో జరిగిన ఆందోళనకు ఆదివాసీ నాయకులు సున్నం వెంకటరమణ, కరక సత్యనారాయణ నాయకత్వం వహించారు. -
మేమింతే..
సాక్షి, హన్మకొండ: ఊరందరిదీ ఓ దారైతే ఉలిపి కట్టది ఓ దారి అన్నట్టుగా ఉంది ఏటూరునాగారం ఐటీడీఏ తీరు. వనజాతర నిర్వహణలో అన్ని ప్రభుత్వ శాఖలను ముందుండి నడిపించాల్సిన ఐటీడీఏ అన్నింట్లో వెనుకబడింది. ఇతర ప్రభుత్వ శాఖలు ఇప్పటికే పనులు ప్రారంభించగా... సమీకృత గిరిజానాభివృద్ధి సంస్థ ఇంకా టెండర్ల దశలోనే కొట్టుమిట్టాడుతోంది. గిరిజన వర్గానికి చెందిన కేంద్ర సామాజిక న్యాయశాఖ సహాయ మంత్రి పోరిక బలరాం నాయక్ ఇలాకాలోనే గిరిజన జాతరపై ఐటీడీఏ నిర్లక్ష్యం వహించడం ప్రభుత్వం పట్టింపులేని తనానికిఅద్దం పడుతోంది. మేడారం జాతర పనులకు సంబంధించి మొదటి డెడ్‌లైన్ గడిచినా ఇప్పటి వరకు ఈ శాఖ పనులు ప్రాథమిక దశను కూడా దాట లేదు. స్పష్టత లేని ఐటీడీఏ అధికారులు వచ్చే ఫిబ్రవరి 12 నుంచి 15వ తేదీ వరకు జరగనున్న మేడారం మహాజాతరలో వివిధ అభివృద్ధి పనులకు ఈ శాఖ మొదట రూ.పది కోట్లతో పనులు చేపట్టాలని ప్రతిపాదనలు పంపింది. ఆ తర్వాత వాటిని రూ. 6.41 కోట్లకు కుదించింది. చివరకు ఆ పనులు ప్రారంభించలేక చతికిలపడుతోంది. ఐటీడీఏ పరిధిలో రూ. 1.42 కోట్లతో జంపన్నవాగులోని మంచినీటి బావుల్లో పూడికతీత, పైపుల ద్వారా నీటి సరఫరా, రూ. 22 లక్షలతో పెయింట్, ఇతర పనులను చేపడుతోంది. ముందుగా నిర్దేశించిన లక్ష్యం ప్రకారం ఈ పనులు 2013 డిసెంబర్ 31 నాటికి పూర్తి కావాలి. గద్దెల చుట్టూ పెయింటింగ్ పనులు ఇప్పుడే మొదలయ్యాయి. మరోవైపు మంచినీటి సరఫరాకు సంబంధించిన పనుల ను టెండర్ ద్వారా వద్దంటూ స్వయంగా ఐటీడీఏ శాఖనే చేపడుతోంది. చిలకలగుట్ట, జంపన్నవాగు, రెడ్డిగూడెం సమీపంలో మంచినీటి బావులు ఉండగా... వీటిలో ఇప్పటివరకు రెడ్డిగూడెం దగ్గర ఉన్న నాలుగు బావుల్లోనే పూడికతీత పూర్తయింది. ఇక జంపన్నవాగు, చిలకల గుట్ట వద్ద ఉన్న బావుల వైపు ఐటీడీఏ అధికారు లు కన్నెత్తి చూడలేదు. వీటిని ఎప్పుడు పూర్తి చేస్తారు, పైపులెప్పుడు బిగిస్తారనే అంశంపై అధికారులకే స్పష్టత లేకుండా పోరుుంది. కథంతా కాజ్వే చుట్టూ... ఐటీడీఏ చేపడుతున్న పనుల్లో సగానికి పైగా నిధులు ఊరట్టం కాజ్వే చుట్టు చేపట్టే రోడ్లకు వెచ్చిస్తున్నారు. మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, కరీంనగర్ జిల్లాల నుంచి ఎడ్లబండ్లపై వచ్చే భక్తులకు ఈ కాజ్వే మార్గం ఎంతో కీలకం. గత జాతర తర్వాత ఈ కాజ్వే దెబ్బతినగా, డిసెంబర్లో పర్యటించిన కలెక్టర్ మరమ్మతు చేయించాలని సూచించినా ఫలితం లేదు. రూ. 24.5 లక్షలతో కాజ్వే మరమ్మతులు, రూ.50 లక్షలతో కాజ్వే నుంచి ఊరట్టం వరకు సీసీ రోడ్డు, రూ.48.50 లక్షలతో కాజ్వే నుంచి చిలకలగుట్ట వరకు రో డ్డు, రూ.40లక్షలతో ఆర్అండ్బీ రోడ్డు నుంచి వనం రోడ్డు వరకు రహదారి, రూ.1.30 కోట్ల తో జంపన్నవాగు ఆర్అండ్బీ రోడ్డు నుంచి కా జ్వే వరకు కొత్తగా రోడ్డు నిర్మాణం, రూ.1.30 కోట్లతో కొండాయి-దొడ్ల వరకు రోడ్డు, రూ 4.77 కోట్లతో చిన్నచిన్న పనులతో కలిపి రోడ్ల నిర్మాణం, అభివృద్ధి పనులు చేపడుతోంది. తొలుత అనుకున్నట్లుగా ఇవన్నీ గత నెల 31 నాటి కి పూర్తి కావాల్సి ఉండగా... 2014 జనవరి 5 నాటికి టెండర్ల ప్రక్రియ ఓ కొలిక్కి రాలేదు. వీటికి సంబంధించి టెక్నికల్ బిడ్లను అధికారు లు శనివారం తెరిచారు. వీటిని ఎప్పుడు పరిశీ లించి, కాంట్రాక్టర్లకు అప్పగిస్తారో.. అవెప్పుడు పూర్తవుతాయో... తెలియడం లేదు. దేశంలోనే పేరుగాంచిన అతిపెద్ద గిరిజన జాతరపై గిరిజ నుల కోసం ఏర్పాటు చేసిన సంస్థ నిర్లక్ష్యం చేయడం విమర్శలకు తావిస్తోంది. -
మేడారం జాతరకు రూ.100 కోట్లు ఉత్తదే
సాక్షిప్రతినిధి, వరంగల్: మేడారం జాతర ఏర్పాట్లకు నిధుల కేటాయింపుపై మంత్రులు, ఎంపీలు చెబుతున్న మాటలకు.. వాస్తవ పరిస్థితికి పొంతన కుదరడం లేదు. జిల్లాలో ఎక్కడ.. ఏ పని జరిగినా.. అది మేడారం జాతర కోసమే అన్నట్లుగా చెబుతున్నారు. సమ్మక్క-సారలమ్మ జాతర ఏర్పాట్ల పరిశీలన కోసం కేంద్ర మంత్రి పోరిక బలరాంనాయక్, రాష్ట్ర మంత్రులు రాంరెడ్డి వెంకట్‌రెడ్డి, పొన్నాల లక్ష్మయ్య, బస్వరాజు సారయ్య, ప్రభుత్వ చీఫ్‌విప్ గండ్ర వెంకటరమణారెడ్డి, ఎంపీలు సిరిసిల్ల రాజయ్య, గుండు సుధారాణి రెండు రోజుల క్రితం మేడారం వెళ్లారు . ఎప్పుడూ లేని విధంగా జాతర ఏర్పాట్ల కోసం ఈ ఏడాది రూ.100 కోట్లు ఖర్చు పెడుతున్నట్లు ఘనంగా ప్రకటించారు. రెండేళ్ల క్రితం జరిగిన జాతర కంటే వచ్చే జాతరకు అదనంగా 30 లక్షల మంది వస్తారని ఎవరికీ ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు చేయాలని, దీని కోసం నిధులు ఇస్తున్నామని అన్నారు. రూ.100 కోట్ల కేటాయింపుపై మంత్రుల ప్రకటనలు నిజమేనా అని ఆరా తీస్తే.. అసలు విషయాలు బయటపడ్డాయి. దెబ్బతిన్న రోడ్లను వెంటవెంటనే మరమ్మతు చేయాల్సి ఉండగా వాటిని ఇన్నాళ్లు పెండింగ్‌లో పెట్టి ఇప్పుడు చేపట్టారు. ఇలా రూ.18.57 కోట్లతో జిల్లా వ్యాప్తంగా జాతరతో సంబంధం లేకుండా చేస్తున్న పనులను.. మన మంత్రులు మేడారం కోటాలోనే వేసి మాట్లాడుతున్నారు. ఫిబ్రవరి 12 నుంచి 15 వరకు జరిగే జాతరకు వచ్చే కోటి మందికిపైగా భక్తుల అవసరాలకు కోసం 20 ప్రభుత్వ శాఖలు తరఫున రూ.114 కోట్లతో జిల్లా యంత్రాంగం రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. రాష్ట్ర ప్రభుత్వం రూ.87.94 కోట్లను విడుదల చేసింది. ఇప్పటికి విడుదలైన నిధులను చూసినా.. రూ.100 కోట్లు దాటలేదు. విడుదలైన నిధుల్లో అత్యధికంగా రూ.59.30 కోట్లు రోడ్లు భవనాల శాఖవే ఉన్నారుు. అరుుతే రోడ్లు భవనాల శాఖ వారు రూ.18.57 కోట్లతో జాతర మార్గాలకు ఎలాంటి సంబంధం లేని రోడ్లను మరమ్మతు చేస్తున్నారు. ఎక్కడెక్కడో చేస్తున్న పనులను కూడా జాతర పనుల్లోనే కలిపేశారు. రూ.100 కోట్లు తెచ్చామని చెప్పుకునేందుకు ఇలా సంబంధంలేని పనులను మేడారం పనుల్లో కలపడం విమర్శలకు తావిస్తోంది.