కూనవరం/ వీఆర్‌పురం, న్యూస్‌లైన్: కేంద్ర మంత్రి పోరిక బలరాం నాయక్‌కు ఆదివాసీల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. కూనవరం, వీఆర్ పురం మండలాల్లో ఆదివారం జరిగిన ఆయన పర్యటనను ఆందోళనకారులు అడ్డుకున్నారు. తమ గ్రామాలను ముంచే పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణాన్ని నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ కూనవరం మండలం టేకులబోరులో ఆయన కాన్వాయ్‌కి అడ్డుతగిలారు. పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణానికి తాము వ్యతిరేకం కాదని ప్రకటన ఎలా చేశారంటూ ఆదివాసీలు, ఉద్యోగ సంఘాల నాయకులు మంత్రి కాన్వాయ్‌ని చుట్టుముట్టారు.
అనంతరం మంత్రి మాట్లాడుతూ.. ముంపు గ్రామాలు తెలంగాణలోనే ఉంటాయని, ఏ ఒక్క గ్రామం కూడా సీమాంధ్రలోకి వెళ్లదని స్పష్టం చేశారు. ఈ విషయంలో చివరి నిమిషంలో తనతో పాటు జిల్లా మంత్రి రాంరెడ్డి వెంకటరెడ్డి, భద్రాచలం, పినపాక ఎమ్మెల్యేలు కుంజా సత్యవతి, రేగా కాంతారావు కలిసి సోనియాకు, దిగ్విజయ్‌సింగ్‌కు విన్నవించామని చెప్పారు. ఈ విషయంలో తాను శక్తివంచన లేకుండా శ్రమిస్తున్నాని అన్నారు. దీంతో ఆందోళన విరమించిన నాయకులు పోలవరం నిర్మాణాన్ని నిలిపివేసేలా చూడాలని కోరుతూ మంత్రికి వినతిపత్రం అందజేశారు.
అనంతరం ఆయన వీఆర్ పురం మండలానికి వెళ్లగా.. రేఖపల్లి ప్రధాన రహదారిపై సీపీఎం ఆధ్వర్యంలో పలువురు ఆదివాసీలు అడ్డుకున్నారు. పోలవరం పేరుతో ఈ ప్రాంతంలో ఎంతోకాలంగా అభివృద్ధి పనులు నిలిచిపోయాయని, ఇప్పుడు ముంపు ప్రాంతాల పేరుతో తమ జీవితాలతో ఆడుకోవద్దని మంత్రి కాన్వాయ్‌ని ముట్టడించారు. ఆయన ముందుకు వెళ్లకుండా రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ముంపు గ్రామాలన్నీ తెలంగాణలో నే ఉంటాయని బలరాం నాయక్ చెప్పినా.. ఆందోళనకారులు వినిపించుకోలేదు. ఈ విషయంలో అధికార పార్టీ నాయకులే రోజుకో మాట మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
భద్రాచలం రెవెన్యూ డివిజన్‌లోని ఒక్క గ్రామం కూడా సీమాంధ్రలో కలవదని మంత్రి నచ్చజెప్పే ప్రయత్నం చేసినా.. వారు నమ్మలేదు. ఇలా సుమారు గంటకు పైగా మంత్రి కాన్వాయ్ రోడ్డుపైనే ఉండాల్సి వచ్చింది. ముంపు బాధితులకు న్యాయం జరిగేలా చూస్తానని, ఈ ప్రాంతమంతా తెలంగాణలోనే ఉంచేలా చూస్తానని మంత్రి హామీ ఇవ్వడంతో ఎట్టకేలకు ఆందోళన విరమించారు. రేఖపల్లిలో జరిగిన ఆందోళనకు మాజీ ఎమ్మెల్యే సున్నం రాజయ్య, టేకులబోరులో జరిగిన ఆందోళనకు ఆదివాసీ నాయకులు సున్నం వెంకటరమణ, కరక సత్యనారాయణ నాయకత్వం వహించారు.
నిరసన హోరు...
Published Mon, Feb 17 2014 1:51 AM | Last Updated on Tue, Aug 21 2018 8:34 PM
Advertisement