కుటుంబ సభ్యులతో మమత
వయసేదైతేనేం.. ఏదో సాధించాలన్న ఆరాటం చిన్నతనం నుంచి ఆమె నైజం. ఎన్నుకున్నది ఏ రంగమైతేనేం.. పోటీ పడి మరీ అగ్రపథంలో ఉండాలన్నది ఊహ తెలిసినప్పటి నుంచి ఆమె ధ్యేయం. ఆ పట్టుదల ఆమెను వివిధ రంగాల్లో ముందంజలో నిలిపింది. వివాహం తర్వాత కేవలం ఇంటికే పరిమితం కాకుండా పరిచయంలేని రంగాల్లో కూడా రాణించేలా ప్రేరణ ఇచ్చింది. ఇందుకు భర్త సహకారం కూడా తోడైంది. దాంతో షార్ట్ ఫిల్మ్ రూపకల్పనలో తన సామరధ్యన్ని రుజువు చేసుకోవడమే కాదు.. చలనచిత్ర రంగంతో సైతం ఆమె పరిచయం పెంపొందించుకున్నారు. మోడలింగ్ రంగంలో ముందంజ వేశారు. అలా ఒక్కో అడుగుగా పురోగమించిన మమత, ఇప్పుడు మిసెస్ ఆంధ్రప్రదేశ్ టైటిల్ దక్కించుకుని విజయ శిఖరాల దిశగా దూసుకుపోయే ఉత్సాహం తనలో మెండుగా ఉందని నిరూపించారు. తన పయనాన్ని ఇంకా కొనసాగించి మిసెస్ యూనివర్స్ టైటిల్ గెలుచుకుని విశాఖ ఖ్యాతిని వ్యాపింపజేయాలన్నది తన ధ్యేయమని తెలిపారు.
విశాఖపట్నం, బీచ్‌రోడ్డు (విశాఖ తూర్పు): ‘చిన్నతనం నుంచి ఏదో ఒక ప్రత్యేకత నాలో ఉండాలనుకునే స్వభావం నాది. అయితే ఏం సాధించాలో తెలియని వయస్సది. తల్లిదండ్రులకూ అవగాహన పరిమితంగానే ఉండేది. దాంతో ఆరాటంతోనే ఆగిపోయాను.’అని తన గురించి, తన ప్రయత్నాల గురించి చెప్పుకొచ్చారు మిసెస్ ఆంధ్రప్రదేశ్‌గా ఎన్నికైన మమత. డాజిల్ సంస్థ ఢిల్లీలో ఇటీవల నిర్వహించిన మిసెస్ ఇండియా వరల్డ్ పోటీల్లో ప్రతిభ చూసి క్రౌన్ గెలుచుకున్న మమత ఈ దారిలో తన అనుభవాలను వివరించారు. వివాహం అయిన తర్వాత తన జీవితంలో చెప్పుకోదగ్గ మార్పు వచ్చిందని చెప్పారు. ‘చలనచిత్ర రంగంతో పరిచయం ఉన్న కారం విజయ్ నా భర్త. నా పట్టుదలను ఆయన అర్థం చేసుకున్నారు. దాంతో ఆసక్తి ఉన్న రంగాల్లో ముందంజ వేశాను.’ అన్నారామె.
యాంకర్‌గా ప్రారంభం
‘భర్త సినీ పరిశ్రమలో, మీడియాలో ఉండడంతో ఆయనకు తోడుగా అడుగు ముందుకేశాను. ఆయన రూపొందించే కార్యక్రమాలలో యాంకర్‌గా వ్యవహరించడం మొదలెట్టాను. క్రమేణా ఇతరులు రూపొందించే కార్యక్రమాలలో కూడా యాంకర్‌గా కొనసాగాను. ఇది నా ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేసింది. క్రమంగా చిత్ర నిర్మాణంపై అవగాహన పెరిగింది. ఆ అనుభవంతో రైట్ చాయిస్ అనే షార్ట్ ఫిల్మ్ తీశాను. అలా ఉత్తరాంధ్రలో లఘు చిత్రం తీసిన తొలి మహిళా డైరెక్టర్ అన్న పేరు తెచ్చుకున్నాను.’అన్నారు. రైట్ చాయిస్ చిత్రానికి ఎందరినుంచో అభినందన లభించిందని తెలిపారు. తర్వాత తన నిర్మాణ సారథ్యంలో మహాత్మా గాంధీ అన్న చిత్రం రూపొందిందని చెప్పారు. తాను కాస్ట్యూమ్ డైరెక్టర్‌గా, నటిగా రూపు దిద్దుకున్న అంబేడ్కర్ చిత్రానికి అందరి ప్రశంసలు లభించాయని, ఈ రెండు చిత్రాలూ నంది అవార్డులు పొందాయని తెలిపారు.
తొలిపోటీలోనే షాక్
‘క్రమంగా నా చూపు మోడలింగ్ రంగం వైపు మళ్లింది. నా అంతట నేనుగా ఈ రంగం గురించి అవగాహన పెంపొందించుకున్నాను. ఆ ఉత్సాహంతోనే గత ఏడాది మిసెస్ వైజాగ్ పోటీలలో పాల్గొన్నాను. కానీ.. ఫైనల్స్ వరకు వచ్చిన నేను ఓటమి చవిచూశాను. ఇది షాక్‌లా తగిలింది. అవగాహన ఉందనుకుంటే చాలదని.. పట్టుదలతో ప్రయత్నించాలని అర్థమైంది. దాంతో ఈసారి ప్రతీ అంశంపై దృష్టి పెట్టి కిరీటం గెలుచుకున్నాను.’ అని చెప్పారు.
ఆశయం ఉంటే చాలదు..
తాను ఎందరికి ఆదర్శప్రాయమయ్యానో తెలియదని.. అయి తే ఆకాంక్ష ఉంటే చాలదని, దానిని సాధించడానికి దీక్షతో పని చేయాలన్న సూత్రాన్ని మాత్రం చాటి చెప్పగలిగానని మమత అన్నారు. ఆశయాలు ఉండి వాటిని సఫలం చేసుకోలేని వారిలో చైతన్యం నింపాలన్నది తన ఆకాంక్షని చెప్పారు. తనకు ఇద్దరు కుమార్తెలని, ఇద్దరూ మోడలింగ్ రంగంలో రాణించేలా చూడాలన్నది లక్ష్యమని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment