'సన్నివేశాలు చేసి, పక్కకు వెళ్లి భార్య కోసం ఏడ్చేవారు'
ఎమ్మెస్ నారాయణ మరణం జూనియర్ ఆర్టిస్టులకు తీరని లోటు. చిన్న ఆర్టిస్టులను అనుక్షణం ప్రోత్సహిస్తూ ఉండేవారు. ఆయన నాకు గురువుతో సమానం. ఆయనతో కలిసి 20 చిత్రాల్లో నటించాను. నేను హీరోగా నటిస్తున్న ‘పులిరాజా ఐపీఎస్’ చిత్రంలో సిన్సియర్ పోలీసు అధికారి పాత్రలో ఎమ్మెస్ నారాయణ నా తండ్రిగా నటిస్తున్నారు. ఈ నెల 25 నుంచి మన జిల్లాలో ఈ చిత్రం షూటింగ్ జరగాల్సి ఉంది. ఇంతలోనే ఆయన మరణించడం మమ్మల్ని తీవ్ర దిగ్భాంతికి గురి చేసింది.
- పొట్టి రాంబాబు, కమెడియన్
ఆయనతో నటించిన తర్వాతే మంచి గుర్తింపు
హాస్య నటుడు ఎమ్మెస్ నారాయణతో కలిసి నటించిన తర్వాతే నాకు మంచి గుర్తింపు లభించింది. ఆయన మృతి యావత్ సినీజగత్తుకు తీరనిలోటు. ఆయన హాస్యానికి ఎంతటివారైనా దాసోహమవుతారు. నాకు పెళ్లయిన తర్వాత చాలా కాలం సినీరంగానికి దూరంగా ఉన్నాను. ఆ సమయంలో దర్శకుడు త్రివిక్రమ్ మల్లేశ్వరి సినిమాలో ఎమ్మెస్ నారాయణతో నటించే అవకాశం ఇచ్చారు. ఆయనతో నటించేందుకు తొలుత సందేహాం వ్యక్తం చేస్తే.. నటించి చూస్తే నీకే తెలుస్తుందని త్రివిక్రమ్ నన్ను ఒప్పించారు. ఆ సినిమా ఒక రేంజ్‌లో నాకు గుర్తింపు తెచ్చింది.
పెళ్లయిన తర్వాత నా కెరీర్‌కు మంచి పునాదిగా నిలిచింది. అప్పటినుంచీ ఎమ్మెస్ నారాయణ కాంబినేషన్‌తో నేను చేసిన ప్రతి సినిమా చాలా హిట్ అయింది. దుఃఖంలో ఉన్న సమయంలో కూడా హాస్య నటులు నవ్వుతూనే నటించాలని, అది మన వృత్తి అని ఆయన ‘దూకుడు’ చిత్రం షూటింగ్‌లో చెప్పారు. ఆ సినిమా షూటింగ్ సమయంలో ఆయన భార్యకు ఆపరేషన్ చేస్తున్నారు. షాట్‌లో హాస్య సన్నివేశాలు చేసి, పక్కకు వెళ్లి భార్య కోసం ఏడ్చేవారు. మళ్లీ షాట్‌కు సిద్ధమయ్యేవారు. ఒక అన్నలా నాకు నటనలో సూచనలు, సలహాలు ఇచ్చేవారు. ఆయన మృతి నన్ను తీవ్రంగా కలసివేసింది.
- హేమ, ప్రముఖ సినీ నటి - రాజోలు
పాఠాలు చెబుతూనే అందరినీ నవ్వించేవారు
ఇంటర్మీడియట్ చదివే రోజుల్లో మాకు ఎమ్మెస్ నారాయణగారు తెలుగు లెక్చరర్. చేతిలో పాఠ్యపుస్తకం లేకుండానే పాఠం బోధిస్తూ తెలుగు గ్రామర్‌తో పాటు సినిమాల గురించి, కథల గురించి చెబుతూ అందరినీ నవ్విస్తూ ఉండేవారు. ఆయన క్లాస్ అంటేనే పక్క గ్రూపు వారు కూడా వచ్చి మావద్ద కూర్చొనేవారు. గది అంతా నిండిపోయేది. ‘ఎవరో మన గురించి అనుకుంటారని మనం అనుకోకూడదు. ముందుకు సాగాలి’ అని ఎమ్మెస్ నారాయణగారు చెప్పిన మాటలు నాకు ఇప్పటికీ గుర్తే.
కళాశాలకు సెలవు పెట్టి ఆయన మద్రాసు వెళుతుంటే, ‘సినిమాపై మోజుతో భవిష్యత్తును పాడు చేసుకుంటున్నాడు’ అని అప్పటి లెక్చరర్లు అనుకునేవారు. సినిమాల్లో నటించి ఎంత పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్నారో, లెక్చరర్‌గా కూడా ఆయనకు అంతే పేరుండేది. కళాశాలలో సాంస్కృతిక కార్యక్రమాలకు ఆయనే ఇన్‌చార్జిగా ఉండి, దేశభక్తియుత నాటకాలు ఎక్కువగా వేయించేవారు. ఆయన మృతి నిజంగా తీరనిలోటు. కళాశాల రోజులు తలచుకుంటే ఆయనే మొదట గుర్తుకు వస్తారు.
- బి.సాయిరమేష్, ఇన్‌స్పెక్టర్,
బొమ్మూరు పోలీస్ స్టేషన్, కేజీ ఆర్‌ఎల్ కళాశాల
పూర్వ విద్యార్థి, భీమవరం, పశ్చిమ గోదావరి జిల్లా
- రాజమండ్రి రూరల్
కోనసీమపై మక్కువ
ఎమ్మెస్‌కు కోనసీమ అంటే చాలా ఇష్టం. రాజోలులో కబడ్డీ.. కబడ్డీ.. చిత్రం షూటింగ్ జరిగిన సమయంలో ఆయన తరచూ యూత్‌క్లబ్‌కు వచ్చేవారు. ‘దేవరాయ’ షూటింగ్ పశ్చిమ గోదావరి జిల్లాలో జరుగుతున్నప్పుడు రాజోలు వచ్చి కాయగూరలు కొనుక్కుని, స్వయంగా వంట చేసుకునేవారు. ‘దేవరాయ’ సినిమాలో తన క్యారెక్టర్ పేరును ‘అక్కిరాజు’గా పెట్టుకుని నాపై అభిమానం చాటుకున్నారు. ఆ సమయంలో నవ్వుతూ ‘అక్కిరాజుగారూ నేను పోయినా ఈ ‘దేవరాయ’ సినిమాలో మీ పేరు చిరస్థాయిగా నిలిచిపోతుంది’ అని అన్నారు.- ముదునూరి అక్కిరాజు, యూత్‌క్లబ్ అధ్యక్షుడు