ప్రభుత్వానిది నిరంకుశ చర్య: ముద్రగడ
కిర్లంపూడి: మాజీ ఎంపీ, కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం శుక్రవారం మరోసారి పాదయాత్రకు ఉపక్రమించగా పోలీసులు యథావిధిగా అడ్డుకున్నారు. తూర్పు గోదావరి జిల్లా కిర్లంపూడిలోని స్వగృహం నుంచి జేఏసీ నాయకులు, కాపు నేతలతో ముద్రగడ బయలుదేరి ఇంటి గేటు వద్దకు వచ్చే సరికి ఓఎస్డీ రవిశంకర్‌రెడ్డి ఆధ్యర్యంలో పోలీసులు పాదయాత్రకు అనుమతిలేదని అడ్డుకున్నారు. కొంత కాలంగా వేలాది మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేసి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారంటూ ఈ సందర్భంగా ముద్రగడ ప్రభుత్వంపై మండిపడ్డారు.
ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయాలనే డిమాండ్‌తో శాంతియుతంగా పాదయాత్ర చేస్తానంటే పోలీసులతో అడ్డగించడం నిరంకుశ చర్యగా అభివర్ణించారు. మహారాష్ట్రలో మరాఠాలు రిజర్వేషన్ల కోసం ఏడాది కాలంగా ఎన్నో ప్రదర్శనలు ర్యాలీలు చేసినప్పటికీ అక్కడి ప్రభుత్వాలు ర్యాలీలను అడ్డుకోలేదన్నారు.