కాపులను మోసగిస్తున్న బాబు
♦ మాజీ మంత్రి ముద్రగడ
♦ హామీల అమలుకు ఈ నెల 10 సాయంత్రం వరకూ గడువు
♦ లేదంటే 11 నుంచి నిరాహార దీక్ష
♦ ఉద్యమం వెనుక జగన్ లేరు
♦ ఉన్నారని నిరూపిస్తే రాజకీయాలనుంచి తప్పుకుంటా
♦ లేదంటే బాబు తప్పుకుంటారా?
సాక్షి ప్రతినిధి, కాకినాడ: ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా చంద్రబాబు కాపుజాతిని మోసగిస్తున్నారని కాపు ఉద్యమ నాయకుడు, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం ధ్వజమెత్తారు. తన నిరాహార దీక్ష విరమణ సందర్భంగా టీడీపీ నాయకులు ఇచ్చిన హామీల అమలుకు ఈ నెల 10 సాయంత్రం వరకూ గడువు ఇచ్చారు. అప్పటికీ స్పందించకుంటే ఈ నెల 11 నుంచి కిర్లంపూడిలోని తన నివాసంలో ఆమరణ నిరాహార దీక్ష మొదలు పెడతానని స్పష్టం చేశారు. తన ఉద్యమం వెనుక వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఉన్నారనే టీడీపీ నాయకుల ఆరోపణలను ఖండించారు. అది నిరూపిస్తే ఉద్యమం నుంచే కాదు రాజకీయాల నుంచి తప్పుకుంటానని సవాలు విసిరారు.
తూర్పు గోదావరి జిల్లా కిర్లంపూడిలోని తన నివాసంలో శుక్రవారం మీడియాతో ఆయన మాట్లాడారు. బలిజ, తెలగ, ఒంటరి, కాపు జాతులను బీసీల్లో చేర్చేందుకు ఎన్నికల్లో చంద్రబాబు హామీ ఇవ్వడంతో తాను జాతి కోసం పోరాటం సాగిస్తున్నానని పునరుద్ఘాటించారు. కాపు ఓట్లతో గద్దెనెక్కిన చంద్రబాబుకు ఆ వాగ్దానాలు, ఆ హామీలు గుర్తు చేస్తూ ఉత్తరం రాశానన్నారు. కాపులను బీసీల్లోకి చేరుస్తామని, సంవత్సరానికి రూ.వెయ్యి కోట్లు ఇచ్చే హామీలను నెరవే రుస్తామని ఆగస్టు 15న విశాఖలో చంద్రబాబు ప్రకటించారని గుర్తు చేశారు. హామీల అమలుపై చంద్రబాబు ఇప్పటివరకూ స్పష్టమైన ప్రకటన చేయకపోగా రకరకాల అసత్య ప్రచారాలను సాగించారని, కాపు రుణమేళా పేరుతో ఏలూరులో జరిగిన కార్యక్రమానికి ముందు ఒక వ్యక్తితో అనరాని మాటలు అనిపించారని ఆవేదన వ్యక్తం చేశారు. హామీలను విస్మరించడంపై తాను ప్రశ్నిస్తుంటే.. కాపు కులస్తులతో తనపై చంద్రబాబు దాడి చేయిస్తున్నారని ఆరోపించారు. ఆయన భార్యాభర్తలను కూడా విడ దీసే ఘనుడని ముద్రగడ వ్యాఖ్యానించారు. తన ఫోన్లు ట్యాప్ చేయడంతో పాటు, తన ఇంటికి వచ్చే వారి సమాచారం అంతా చంద్రబాబు సేకరిస్తున్నారని ఆరోపించారు.
ఉద్యమం వెనుక జగన్ లేరు..
ఉద్యమం వెనుక వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి లేరని స్పష్టం చేశారు. వైఎస్ జగన్‌తో తాను ఎన్నిసార్లు మాట్లాడానో చంద్రబాబు నిరూపించాలని ముద్రగడ సవాలు విసిరారు. నిరూపిస్తే ఉద్యమం నుంచే కాకుండా తన కుటుంబం సహా రాజకీయాల నుంచి తప్పుకుంటానన్నారు. నిరూపించకపోతే చంద్రబాబు రాజకీయాల నుంచి తప్పుకుంటారా? అని ప్రశ్నించారు. రాజధానికోసం చంద్రబాబే భయపెట్టి రైతుల భూములు లాక్కొన్నారని ఆరోపించారు.