సాక్షి, కిర్లంపూడి : పిల్లనిచ్చిన మామ నందమూరి తారక రామారావుకే ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు వెన్నుపోటు పొడిచారని కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం మండిపడ్డారు. ఆయనకే కనుక కూతురునిచ్చి పెళ్లి చేయకపోతే ఎక్కడ ఉండేవారో అంటూ విమర్శించారు. సింహాసనం కోసం గతంలో ఎన్టీఆర్‌పై చెప్పుల దండలు వేయించి అవమానపరిచారని, ఈ రోజు చెప్పులు విడిచి వంగి వంగి దండాలు పెడుతున్నారని ఎద్దేవా చేశారు. అవమానభారంతో క్షోభ అనుభవించి ఎన్టీఆర్ మరణానికి కారణమైన బాబు ముందు రాజ్‌కపూర్ ఎందుకు పనికిరారని, వాళ్లు నటిస్తే, బాబు జీవిస్తాడని విమర్శించారు.
గతంలో బీజేపీతో పొత్తు పెద్ద తప్పిదమన్న బాబు, ఏముఖం పెట్టుకొని 2014ఎన్నికల్లో కలిసి పోటీచేశారని ప్రశ్నించారు. అందిన కాడికి దోచుకుతిని వృద్ధ నారీ పతివ్రతలాగా కబుర్లు చెప్పడంలో బాబుకు పోటీ లేరని దుయ్యబట్టారు. హామీలు అడిగితే కులాల మధ్య చిచ్చు పెడుతున్నారని మండిపడ్డారు. బీజేపీతో నాలుగేళ్లు కలిసి ఉన్న ముఖ్యమంత్రి, ఇప్పుడు కేసుల భయంతో తనని కాపాడాలంటూ మొసలి కన్నీరు కారుస్తున్నారని విమర్శించారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, జేడీఎస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే రాజ్యాంగం గెలిచిందన్న బాబు, 23 మంది ప్రతిపక్ష ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి, వారిలో మరో నలుగురికి మంత్రి పదవులు ఇవ్వడం నైతికం కాదన్నది మీ రాజ్యాంగ పరిధిలోకి రాదా అని నిలదీశారు.
చంద్రబాబు వల్ల రాష్ట్రం సర్వనాశనం అయిపోయిందని ముద్రగడ అన్నారు. ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీపై ఒంటికాలితో లేచే సీఎం, ఇప్పుడు కాంగ్రెస్‌కు ఓటు వేయండని అడగటం హైటెక్ వ్యభిచారం కిందకు రాదా అని నిలదీశారు. చంద్రబాబు ఉపన్యాసాల్లో సొల్లు, సోది వినలేక ప్రజలు రావడం మానేస్తే ఉపాధి హామీ కూలీలను సమావేశాలకు తరలించుకోవడానికి సిగ్గులేదా అని ప్రశ్నించారు. ప్రజాస్వామ్యంలో ప్రజల దయతో బతకాలని, అంతేకాని నేనే గొప్పవాడివని విర్రవీగిపోకండి అంటూ హెచ్చరించారు.తనకు నచ్చని వారిపై చెప్పులు, రాళ్లదాడి చేయించడం వంటివి చంద్రబాబు మానుకోవాలంటూ ముద్రగడ సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment