ముగ్గూ సింగారం.. ఆ పాటే బంగారం | Muggu Singapore as well as that of gold .. | Sakshi
Sakshi News home page

ముగ్గూ సింగారం.. ఆ పాటే బంగారం

Published Thu, Jan 15 2015 2:12 AM | Last Updated on Tue, Oct 16 2018 6:35 PM

ముగ్గూ సింగారం.. ఆ పాటే బంగారం - Sakshi

ముగ్గూ సింగారం.. ఆ పాటే బంగారం

కర్నూలు(కల్చరల్): ఏమే రామలచ్చిమి. ‘‘ఊర్ల ఒకర్ని మించి ఒకరు ముగ్గులు ఏత్సుండారు. మా సిన్నతనంల తెల్ల ముగ్గు ఒక్కటేసి అదే శానా సింగారంగ ఉందని సంబ్రపడిపోతుంటిమి. ఇప్పుడు పోటీలు ఎక్కువైనాయి. అందుకే శంగనొట్టు రంగులు తెచ్చి ముగ్గులెయ్యబట్టినారు.’’ కోడలితో చెప్పింది రాజమ్మ.

అవునత్తా.. నేను గూడ కర్నూలులోని మున్సిపల్ స్కూల్‌లో పెట్టిన సంక్రాంతి సంబరాల ముగ్గుల పోటీకి పోయింటిగదా. వాయబ్బ ఆ ముగ్గులతోని మనం పోటీ పడలేమనిపించింది. పల్లెలోల్లే కాదు.. బాగా సదుకున్న కాలేజి పిల్లోల్లు కూడా రంగురంగుల ముగ్గులేత్సుంటే యింగ మనం ఎక్కడికెల్లి తట్టుకుంటం.. చెప్పింది రామలచ్చిమి.
 
అవులే.. ఎవరో ఒగరు ఏందోకటి ప్రైజు ఇత్సారంటే మాంచి ముగ్గులేస్తరన్నమాట. సంకురేత్రి పండుగకు ఎయ్యల్నే ముగ్గులంటే.. వాల్లిచ్చే కానుకల కోసం ముగ్గులేస్తే ఎట్ల. పోటీలు పెట్టెతోల్లు సప్రేటుగా అందుర్ని పిల్చి ఒక సోట ముగ్గులేపిచ్చేది గాదు. పొద్దున్నే లేసి ఒక వూరికిపోయి ఇంట్ల ముందర ఏసిన ముగ్గులను సూసి యాముగ్గు బాగుంటే ఆ ముగ్గుకు ప్రైజు యియ్యల్ల. అద్ది అస్సలైన పోటీ.

ఇదేందే గాదెనిండిందీ అంటే ఎలుకలు మెండైనయి అన్నట్ల.. సంక్రాంతి వచ్చిందంటే ముగ్గులు రానోల్లంతా బుక్కులు సూసి నేర్సుకొని ముగ్గులేసెతోల్లు శానా ఎక్కువయినరు. వర్జినాలుగ ముగ్గులేసేటోల్లు అట్లకాపి గీపి కొట్టరు. సొంతంగ ఆలోసన సేసి సంకురాతిరికి సరిఫొయ్యే ముగ్గులేత్సరు. చెప్పింది రాజమ్మ. నిజ్జంగ బలే జెప్పినవ్ రాజమ్మత్తా..! అట్లగిన పోటీలు పెడ్తే పల్లెల్లో ఆడోల్లందరికీ ఫస్టు ప్రైజే వస్తుంది సూడు.. చెప్పింది రామలచ్చిమి.
 
ఏందే అత్తా క్వాడండ్లు గలిసి ముగ్గుల సుద్దులు సెప్పడం మొదలుపెట్టినరు. పండుగనాడు యింత కర్సికాయలు, బచ్చ్యాలు, సద్దరొట్టెలు సేసేదుంద్యారా ! అడిగాడు అటుగా వచ్చిన ధర్మన్న మామ..! యాడసేస్తరప్ప... పండగ నాడు గూడా అందరు టీవీలకు అతుక్కుపోయి సంక్రాంతి పాటలు సూస్కుంట కూసున్నరు. వీల్లు ఎప్పుడు బచ్చ్యాలు సెయ్యల్ల. మనం ఎప్పుడు తినల. ఇప్పుడిదాంక రామన్నమామ గూడనాతోని సెప్పిపోయ. ఎక్కడి టీవీలొచ్చినాయె ఏమోగాని పండగ పూట గూడ మన్సులు పనులు సేసేది మానుకోండరు. యింగ పట్నవాసాల్లో అయితే రడీమేడ్ బచ్చ్యాలు ఇంటికి కొనుక్కొచ్చి పండుగలు సేస్తున్నరు.. చెప్పింది రాజమ్మత్త.
 
ఆ టీవీల్లో సూసే బదులు మాంచి గొబ్బమ్మ పాటలు బయటికొచ్చి పాడొచ్చుగదా. నా సిన్నతనంలో గుడిపాటి నాగప్పమామ అందరికీ గొబ్బిపాటలు కోలన్న పాటలు నేర్పిస్తుండె. పొద్దున్నే వగిసి పిల్లోల్లు ముగ్గులేసుకుంట గొబ్బిపాటలు పాడుతుండ్రి. సాయంత్రం గోకారమ్మ కట్టకాడ అందరుజేరి కోలన్నలు పాడుతుంటే దుమ్ములేస్తుండె. మన సుట్టుపక్కల సిన్నటేకూరు పెద్దటేకూరు, ఉల్లిందకొండ, తాండ్రపాడు పసుపుల ఊర్ల నుండి జనం మన దిన్నెదేవరపాడుకు వచ్చి గుంపులు గుంపులుగా కూసుంటుండ్రి. మన జొహరాపురం రాజు గంగిరెద్దులాడిస్తుంటే అందరు నోరు తెర్సుకొని సూస్తుండ్రి.

గుడిపాటి నాగప్ప సింతమాను సివుకు లాడె.. కొమరమీను జానులాడె..అనుకుంటా నడుంగుల నిలబడి కోలన్న పాట అందుకుంటే అందరం బెత్తెడెత్తు ఎగిలి సిందులేస్తుంటిమి. తింటే గారెలు తినల్ల.. యింటే భారతం యినల్ల.. సూస్తే సంకురాతిరి సంబ్రమే సూడాల్ల మరి అని జనం ఆ రోజుల్లో అంటుండ్రి. యిప్పుడు యిసిత్రంగా జనం కెవ్వుకేక పాటలను తెచ్చి ఈ కోలన్న పాటల్లో పెడ్తున్నరు. అవి యిననీక యింపుగా లేవు. సూడనీక సొంపుగా లేవు. చేతులూపుతూ చెప్పాడు ధర్మన్న మామ. పకపక నవ్వారు రాజమ్మత్త, రామలచ్చిమి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement