మళ్లీ ముఖేష్దేమొదటి స్థానం
వాషింగ్టన్: రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేశ్ అంబానీ మరోసారి భారత్లో అత్యధిక సంపన్నుల జాబితాలో మొదటి స్థానంలో నిలిచారు. 23.6 బిలియన్ డాలర్ల ఆస్తితో ఆయన ఈ స్థానాన్ని కైవసం చేసుకున్నారని పోర్బ్స్ పత్రిక వెల్లడించింది. ముఖేశ్ ఆస్తి గత ఏడాది కంటే 2.6 బిలియన్లు పెరిగింది. దీంతో ఆయన వరుసగా ఎనిమిదో ఏడాది కూడా భారత్లో అత్యధిక సంపన్నుల జాబితాలో తొలి స్థానాన్ని కొనసాగించారని పేర్కొంది. భారత్లో 100 అత్యధిక సంపన్నుల తాజా జాబితాను గురువారం వాషింగ్టన్లో విడుదల చేసింది. ఈ జాబితాలో మొదటి వంద మంది భారతీయులేని బిలయనీర్లేనని తెలిపింది. కేంద్రంలో కొత్తగా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దేశంలో స్టాక్ మార్కెట్ కొత్త పుంతలు తొక్కిందని అభిప్రాయపడింది.
అలాగే రెండవ స్థానాన్ని ప్రముఖ ఔషధ కంపెనీ సన్ ఫార్మా వ్యవస్థాపకుడు దిలీప్ సింఘ్వీ అక్రమించారని చెప్పింది. ఇప్పటివరకు ఆ స్థానంలో ఉన్న ఎన్నారై వ్యాపారీ, ఉక్కు వ్యాపార దిగ్గజం లక్ష్మీ మిట్టల్ను ఐదో స్థానానికి నెట్టి మరీ దిలీప్ రెండవ స్థానాన్ని అందుకున్నారని పేర్కొంది. ఆ తర్వాత ఎనిమిది స్థానాలు వరుసగా 16.4 బిలియన్ డాలర్లతో విప్రో అధినేత అజీమ్ ప్రేమ్ జీ, 15.9 బిలియన్ డాలర్లతో టాటా గ్రూప్ అధినేత పల్లొంజి మిస్త్రీ, 15.8 బిలియన్లతో లక్ష్మీ నివాస్ మిట్టల్, 13.3 బిలియన్లతో హిందూజా బ్రదర్స్, రూ. 12.5 బిలియన్లతో శివ నాడర్, 11.6 బిలియన్లతో గోద్రెజ్ ఫ్యామిలీ, 9.2 బిలియన్లతో కుమార్ బిర్లా, రూ.7.8 బిలియన్లతో సునీల్ మిట్టల్ ఉన్నారని పోర్బ్స్ విడుదల చేసిన జాబితాలో వెల్లడించింది.