
ముఖేష్ బదానీతో సంబంధాలపై విచారణ
కడప: బద్వేలులో ఇటీవల అరెస్ట్ అయిన స్మగ్లర్ నర్సింహారెడ్డి ఇచ్చిన సమాచారం ప్రకారం అంతర్జాతీయ ఎర్ర చందనం స్మగ్లర్ ముఖేష్ బదానీని అరెస్ట్ చేసినట్లు మైదుకూరు డీఎస్పీ రామకృష్ణయ్య చెప్పారు. అతనికి ఎవరితో సంబంధాలు ఉన్నాయో విచారించవలసి ఉందన్నారు. బదానీని ఈరోజు కోర్టులో హజరుపరుస్తామని చెప్పారు. కస్టడీ పటిషన్ వేయనున్నట్లు రామకృష్ణ తెలిపారు.
ముఖేష్ బదానీని జిల్లా ప్రత్యేక బృందం పోలీసులు అరెస్ట్ చేశారు. హర్యానా రాష్ట్రం హిస్సార్ జిల్లాకు చెందిన ముఖేష్ బదానీ అంతర్జాతీయ స్థాయిలో ఎర్ర చందనం స్మగ్లర్‌గా పేరొందాడు. బద్వేల్, రైల్వే కోడూరు పోలీస్ స్టేషన్లలో ఎర్ర చందనం అక్రమ రవాణాకు సంబంధించి బదానీపై పలు కేసులు నమోదయ్యాయి. జిల్లాలోని కొందరు టీడీపీ నేతలతో నేరుగా సంబంధాలున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఇప్పటికే అతనితో సన్నిహిత సంబంధాలను కొనసాగించిన వారిలో కొందరిని అట్లూరు, బద్వేలు పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం. ముఖేష్ బదానీని రాజంపేట డీఎస్పీ అరవిందబాబు, సీఐలు రాజేంద్రప్రసాద్, వెంకటప్ప, మరికొంతమంది సిబ్బంది అరెస్ట్ చేసి జిల్లాకు తీసుకొచ్చారు. అతనికి ఆస్పత్రిలో వైద్యపరీక్షలు చేయించి కోర్టులో హాజరుపరుస్తారు.