ప్చ్‌.. మారలేదు! | Multiplex And Theatres no Change With GST Attacks | Sakshi
Sakshi News home page

ధరాఘాతం!

Published Wed, Sep 5 2018 12:39 PM | Last Updated on Wed, Sep 5 2018 12:39 PM

Multiplex And Theatres no Change With GST Attacks - Sakshi

విజయవాడలోని మల్టీప్లెక్సులు, సినిమా థియేటర్లలో అధిక ధరలు నియత్రించాలని జిల్లా వినియోగదారుల కోర్టు న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేసినా ఫలితం కన్పించడం లేదు. న్యాయస్థానం తీర్పు సైతం పట్టించుకోకుండా మాల్స్‌ యాజమాన్యాలు ధరలు తగ్గించకుండా దందా కొనసాగిస్తున్నాయి. తూనికలు, కొలతల శాఖాధికారులు తూతూమంత్రంగా దాడులు చేసి చేతులు దులుపుకుంటున్నారు.

సాక్షి, అమరావతిబ్యూరో :  కొద్ది రోజులుగా నగరంలోని మల్టీప్లెక్స్‌లు.. సినిమా థియేటర్లలో అధిక ధరల అదుపు కోసం తూనికలు కొలతల శాఖాధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తున్నా.. ఫలితం సున్నా అన్నట్లు ఉంటోంది. నిబంధనలు ఉల్లంఘిస్తున్న నిర్వాహకులపై కేసులు సైతం నమోదు చేసి.. జరిమానాలు విధించారు. మరోవైపు వినియోగదారుల ఫోరం కూడా లక్షలాది రూపాయల చొప్పున మాల్స్‌లో స్టాల్స్‌ నిర్వహిస్తున్న కంపెనీలపై జరిమానా విధించింది. ఈ పరిణామాలతో అధిక ధరల దోపిడీకి అడ్డుకట్ట పడుతుందని నగరవాసులు భావించారు. కానీ, అక్కడ జరుగుతున్న తంతు మాత్రం వేరేలా ఉంది. ఎమ్మార్పీ ధరలను చూసి జనం గుడ్లు తేలేస్తున్నారు. పాత ధరలనే కొత్త స్టిక్కర్‌పై చూపిస్తున్నారంటూ ఫిర్యాదు చేస్తేనేమో సంబంధిత అధికారులు తమకేమీ సంబంధం లేదంటూ చేతులెత్తేస్తుండటంతో అంతిమంగా నగరవాసులే నష్టపోతున్నారు. ధరల దోపిడీకి గురవుతున్నారు.

అక్రమాలకు అడ్డాగా..
అనేక సామాజిక సందేశాలు.. పోరాటాల ఇతివృత్తంగా రూపొందే చలనచిత్రాలు ప్రదర్శించే వేదికలే అక్రమాలకు అడ్డాగా మారుతున్నాయి. నిబంధనలు అమలు చేయాలని చట్టాలు ఆదేశిస్తున్నా.. న్యాయస్థానాలు భారీ జరిమానాలు విధిస్తూ తీర్పులిస్తున్నా విక్రేతలకు, సినిమా హాళ్ల యాజమాన్యాలకు మాత్రం పట్టడం లేదు. మల్టీప్లెక్స్‌ థియేటర్లలో కాంబో పేరుతో ప్రేక్షకులను నిలువు దోపిడీ చేస్తున్నారు. దీనిని అరికట్టాల్సిన తూనికలు, కొలతల శాఖ అధికారులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవడం లేదు. ఏడు నెలల్లో థియేటర్లపై తూనికలు, కొలతల శాఖ అధికారులు చేసిన దాడులు నామమాత్రంగా ఉండటమే దీనికి తార్కాణం. ఈ ఏడాది జూలై నాటికి షాపింగ్‌ మాల్స్, మల్టీప్లెక్స్‌లు, సినిమా థియేటర్లలో తూనికలు, కొలతల శాఖ అధికారులు ఆకస్మిక దాడులు చేశారు. ఎమ్మార్పీ కంటే అదనంగా విక్రయిస్తూ.. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న పీవీపీ, పీవీఆర్, ట్రెండ్‌సెట్, ఎల్‌ఈపీఎల్‌ ఐనాక్స్, ఊర్వశీ ఐనాక్స్, మీరజ్‌ మల్టీప్లెక్స్‌లు, షాపింగ్‌ మాల్స్‌పై మొత్తం 77 కేసులు నమోదు చేశారు. జరిమానా రూ.5.52 లక్షలు వసూలు చేశారు. అయినా మల్టీప్లెక్స్‌ల్లో ఏ మార్పు లేకపోవడం గమనార్హం.

అదే తీరు.. అదే దందా..  
నెల రోజులుగా అధికారుల ఆకస్మిక దాడులు.. కేసులు.. జరిమానాలతో మల్టీప్లెక్స్‌లు, సినిమా థియేటర్ల నిర్వాహకుల్లో మార్పు వచ్చిందా?.. అని ‘సాక్షి’ క్షేత్రస్థాయిలో ఆరా తీస్తే అసలు విషయం వెలుగు చూసింది. అదే దోపిడీ.. అదే దందా కొనసాగుతోంది. కాకపోతే మరో పద్ధతిలో, అంటే.. వారు నిర్ణయించుకున్న ధరల్లో మార్పు లేకుండా కొత్తగా అతికించిన స్టిక్కర్లపై వాటిని ముద్రించి విక్రయిస్తున్నారు. చాలా చోట్ల బిల్లు ఇవ్వడం లేదు. కొన్ని చోట్ల మాత్రం ధరలు బోర్డులను ప్రదర్శించారు. మల్టీఫ్లెక్స్‌ థియేటర్‌లో విక్రయించే తినుబండారాల ధరలను ప్రేక్షకులకు కనిపించేలా బోర్డు ఏర్పాటు చేయాలి. విక్రయించిన వస్తువులకు విధిగా బిల్లు ఇవ్వాలన్న ఆదేశాలు ఉన్నాయి. బోర్డులు మాత్రం ఎక్కడా కనిపించడం లేదు. తినుబండారాలు కొనుగోలు చేస్తే.. బిల్లు ప్రేక్షకుడి చేతికి ఇస్తారు. దానిని తీసుకెళ్లి సర్వర్‌కు ఇవ్వాలి. ఈ క్రమంలో బిల్లు ఇచ్చినట్లే ఇచ్చి.. వెనక్కి తీసేసుకుంటున్నారు. ప్రేక్షకుడిని దగా చేయడంలో ఇదో లాజిక్‌గా అనుసరిస్తున్నారు.

విడిగా విక్రయిస్తే మేమేం చేయలేం..
నిబంధనల ప్రకారం ప్యాకేజ్డ్‌ ఆహార పదార్థాలపై ముద్రించిన గరిష్ట చిల్లర ధర కంటే ఒక్క రూపాయి ఎక్కువ వసూలు చేసినా.. చట్టవిరుద్ధమే. మాకు ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటాం. ప్యాకింగ్‌ చేసి కాకుండా విడిగా తినుబండారాలు, ఇతర వస్తువులను ఎంతకు విక్రయించినా.. మా పరిధిలోకి రాదు. అలాంటి ఫిర్యాదుల విషయంలో మేమేం చేయలేం.
– పీఎస్‌ఆర్‌ఎన్‌టీ స్వామి, డెప్యూటీ కంట్రోలర్, తూనికలు, కొలతలు శాఖ

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement