‘మాఫీ’యా! | Municipal Commissioner house of sand smugglers | Sakshi
Sakshi News home page

‘మాఫీ’యా!

Published Sun, Oct 13 2013 2:23 AM | Last Updated on Tue, Oct 16 2018 6:08 PM

Municipal Commissioner house of sand smugglers

ప్రొద్దుటూరు, న్యూస్‌లైన్: మున్సిపల్ కమిషనర్ ఇంటిపై ఇసుక అక్రమ రవాణాదారులు దాడికి యత్నించిన సంఘటనలో క మిషనర్ యూ టర్న్ తీసుకున్నారు. పోలీసుల అదుపులో ఉన్న ట్రాక్టర్ డ్రైవర్‌కు, జరిగిన సంఘటనకు సంబంధం లేదని కమిషనర్ వెంకటకృష్ణ లిఖిత పూర్వకంగా పోలీస్ స్టేషన్‌లో రాయించడంతో డ్రైవర్‌పై కేసు నమోదు కాలేదు. ఇసుక అక్రమ రవాణాను అరికట్టేందుకు చర్యలు తీసుకుంటున్న ప్రొద్దుటూరు మున్సిపల్ కమిషనర్ ఇంటిపై దాడికి ప్రయత్నించిన సంఘటన పట్టణంలో చర్చనీయాంశంగా మారింది.
 
 శుక్రవారం రాత్రి ఈ సంఘటన జరగడంతో పోలీసులు తక్షణం స్పందించి మున్సిపల్ కమిషనర్ ఇంటిపైకి వెళ్లిన రామాపురం గ్రామానికి చెందిన ఇసుక మాఫియా నాయకుడికి చెందిన ట్రాక్టర్ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. అయితే 24 గంటలు తిరగకముందే ఆ డ్రైవర్‌కు, జరిగిన సంఘటనకు సంబంధం లేదని లిఖిత పూర్వకంగా పోలీస్‌స్టేషన్‌లో కమిషనర్ రాయించడంతో డ్రైవర్‌పై కేసు నమోదు కాలేదు.
 
 ఈ సంఘటన వెనుక ప్రధానంగా అధికార పార్టీ నేతల ఒత్తిడే కారణమా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.  ప్రొద్దుటూరు ప్రాంతంలో విచ్చల విడిగా ఇసుక అక్రమ రవాణా జరుగుతుండటంతో పెన్నానదిలో భూగర్భ జలాలు నానాటికి అడుగంటిపోతున్నాయి. చాలా రోజులుగా మున్సిపల్ అధికారులు ఇసుక అక్రమ రవాణాపై దృష్టి సారించినా పూర్తి స్థాయిలో నివారించలేకపోయారు. కాగా మండలంలోని రామాపురం గ్రామంలో మాత్రం యధావిధిగా ఇసుక అక్రమ రవాణా జరుగుతోంది. ఇందుకోసం అధికార పార్టీకి చెందిన సీనియర్ నేత అనుచరుడు ఏకంగా భారీ యంత్రాలు, ట్రాక్టర్లను ఏర్పాటు చేసుకున్నారు. నిత్యం పెన్నానది నుంచి ఇసుక తవ్వకాలు జరిపి గ్రామంలో రాశులు పోయడం, డిమాండ్‌ను బట్టి వాటిని అమ్మడం జరుగుతోంది. చాలా కాలం నుంచి ఇలాగే జరుగుతున్నా అధికారులు నివారించలేని పరిస్థితి. గతంలో ఇలానే ఇసుక ట్రాక్టర్‌కు ఓ తహశీల్దార్ అడ్డుపడగా ఇసుక మాఫియా నేత నడిరోడ్డుపైనే హెచ్చరించాడు. దీంతో తహశీల్దార్ వెనుదిరగాల్సి వచ్చింది. అనేక మార్లు ఇతని ట్రాక్టర్లను అధికారులు స్వాధీనం చేసుకోవడం, నేతల ఒత్తిళ్లతో వదిలేయడం జరుగుతోంది. రామాపురంలో ఇసుక రాశులు ఉన్నాయని తెలుసుకున్న మున్సిపల్ కమిషనర్ నాలుగు రోజుల క్రితం గ్రామంపై దాడులు నిర్వహించారు. గ్రామంలోని ఇసుక రాశులను చూసి ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఇకపై ఇసుక అక్రమ రవాణా చేస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇదిలావుండగా శుక్రవారం రాత్రి ఇసుక అక్రమ రవాణాపై తనిఖీ చేసేందుకు కమిషనర్ రామాపురం గ్రామానికి వెళ్లారు.
 
 అదే సమయంలో ఇసుక మాఫీయా నేత డ్రైవర్‌తోపాటు మరికొందరు పట్టణంలోని కమిషనర్‌పై దాడి చేసేందుకు స్వయంగా ఆయన ఇంటికి వెళ్లారు. ఆ సమయంలో కమిషనర్ ఇంటిలో లేకపోగా దాడి చేసేందుకు వచ్చిన డ్రైవర్‌ను సిబ్బంది పట్టుకుని వన్‌టౌన్ పోలీసులకు అప్పగించారు. వెంటనే కమిషనర్ తనపై దాడికి వచ్చిన సంఘటనకు సంబంధించి సిబ్బంది చేత ఫిర్యాదును లిఖిత పూర్వకంగా రాసి స్టేషన్‌కు పంపారు. ఇదిలావుండగా కొంత సేపటి తర్వాత స్వయంగా మున్సిపల్ కమిషనర్ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి డ్రైవర్‌ను వదిలిపెట్టాలని డ్యూటీలో ఉన్న పోలీసులను కోరారు. కాగా సీఐ వచ్చిన తర్వాత మాట్లాడితే డ్రైవర్‌ను వదిలేస్తామని, అంతవరకు తామేమి చేయలేమని పోలీసులు తెలిపారు.
 
 కమిషనర్ యూటర్న్
 ఇదిలావుండగా శుక్రవారం రాత్రి జరిగిన సంఘటనకు సంబంధించి జిల్లా అధికార యంత్రాంగం స్పందించింది. ప్రసార మాధ్యమాల ద్వారా కమిషనర్‌పై దాడియత్నానికి సంబంధించిన సంఘటనను తెలుసుకున్న జిల్లా అధికారులు శనివారం ఉదయం కమిషనర్ చాంబర్‌లో సమావేశం నిర్వహించారు. జమ్మలడుగు ఆర్డీఓ రఘునాథరెడ్డి, డీఎస్పీ శ్రీనివాసులరెడ్డి ఆధ్వర్యంలో ఇసుక అక్రమ రవాణా అరికట్టడంపై చర్చించారు. ఈ నేపథ్యంలో శనివారం సాయంత్రం కమిషనర్ తనపై ఎవ్వరు దాడికి ప్రయత్నించలేదని, అదుపులోకి తీసుకున్న డ్రైవర్‌ను వదిలివేయాలని పోలీసులకు లిఖిత పూర్వకంగా రాసి పంపారు. శుక్రవారం రాత్రి తాను ఆఫీసు పని నిమిత్తం బయటికి వెళ్లానని, గుర్తు తెలియని వ్యక్తి తాగిన మైకంలో తన ఇంటి తలుపు తడుతుండగా అనుమానంతో సిబ్బంది అతన్ని పట్టుకుని పోలీసులకు సమాచారం ఇచ్చారని తెలిపారు.
 
 అంతేగానీ అతను దాడికి యత్నించలేదని ఆయన లిఖితపూర్వకంగా పోలీసులకు తెలిపారు. దీంతో ఎట్టకేలకు పోలీసులు తమ అదుపులో ఉన్న ట్రాక్టర్ డ్రైవర్‌ను వదిలిపెట్టారు. ఇసుక మాఫియా నిర్వహిస్తున్న వ్యక్తి అధికార పార్టీకి చెందిన వాడు కావడంతో రాజకీయ ఒత్తిళ్లవల్లే ఇలా జరిగి ఉండవచ్చని పలువురు చర్చించుకుంటున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement