సాక్షి, కర్నూలు: మున్సిపల్ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. సుప్రీం కోర్టు ఆదేశాలతో ఆగమేఘాలపై ఎన్నికల షెడ్యూల్ విడుదల కాగా.. అధికారులు ఎన్నికల నిర్వహణకు సర్వ సన్నద్ధమయ్యారు. సోమవారం నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు అదనపు ఎన్నికల అధికారులు నామినేషన్లను స్వీకరించనున్నారు. శుక్రవారం వరకు ఈ ప్రక్రియ కొనసాగనుంది.
15న నామినేషన్లను పరిశీలించనున్నారు. జిల్లాలో ఐదు మున్సిపాలిటీలు, నాలుగు నగర పంచాయతీలకు ఏప్రిల్ 30న పోలింగ్ జరగనుంది. ఇందుకోసం అధికారులు సమాయత్తమవుతున్నారు. ఓటు హక్కు కలిగిన వారందరికీ అవకాశం కల్పించే ఉద్దేశంతో ఎన్నికల కమిషన్ ఆదివారం ప్రత్యేక ఓటరు దినోత్సవం నిర్వహించింది. అయితే కొత్త ఓటర్లకు మున్సిపల్ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం లేదని తెలుస్తోంది.
ఆదోని, నంద్యాల, ఎమ్మిగనూరు, డోన్, ఆళ్లగడ్డ, ఎమ్మిగనూరు, బనగానపల్లె, ఆత్మకూరు, నందికొట్కూరు పురపాలక సంఘాల పరిధిలోని 234 వార్డులకు ఎన్నికలు నిర్వహిస్తున్నారు. మొత్తం 5,49,449 మంది ఓటర్లు ఉండగా.. 513 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. దాదాపు 1400 నుంచి 1500 మందికి ఒకటి చొప్పున పోలింగ్ కేంద్రాలు ఏర్పాటయ్యాయి. పోలింగ్‌కు 565 ఈవీఎంలను వినియోగిస్తున్నారు. పురపాలక సంఘం పరిధిలోని ప్రతి 10 వార్డులకు ఒక అదనపు ఎన్నికల అధికారిని నియమించారు. నామినేషన్ల స్వీకరణ మొదలు.. ఫలితాలు ప్రకటించే వరకు ప్రక్రియ అంతా వీరి ఆధ్వర్యంలోనే కొనసాగనుంది. ఎన్నికల విధుల్లో 2,850 మంది సిబ్బంది పాల్గొననున్నారు.
మంచి ముహూర్తం..
బుధవారం
మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ప్రక్రియ సోమవారం నుంచి ప్రారంభం కానుంది. అయితే అధిక శాతం అభ్యర్థులు బుధవారం రోజున నామినేషన్ వేయాలని భావిస్తున్నారు. పౌర్ణమి ముందు వచ్చే ఏకాదశి, పుష్యమి నక్షత్రం.. అందునా బుధవారం కావడంతో ఆ ముహూర్తాన్నే అందరూ ఎంచుకుంటున్నారు. ఆ రోజున నామినేషన్ వేస్తే తమ రాజకీయ భవిష్యత్తుకు ఢోకా ఉండదనే ఉద్దేశంతో అభ్యర్థులు ఆ రోజు కోసం ఎదురుచూస్తున్నారు.
ఎన్నిలకు ఏర్పాట్లు పూర్తి
పురపాలక ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం. పారదర్శకంగా వ్యవహరించాలని అధికారులను ఆదేశించాం. సోమవారం నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది. పురపాలక సంఘాల కమిషనర్లు ఎన్నికల అధికారులుగా వ్యవహరించనున్నారు.
- మురళీకృష్ణ, రీజినల్ డెరైక్టర్, మున్సిపల్ శాఖ
‘పుర’ పోరు
Published Mon, Mar 10 2014 3:27 AM | Last Updated on Tue, Aug 14 2018 9:04 PM
Advertisement