సాధారణ ఎన్నికల ప్రక్రియ
ముగిసేవరకు ఫలితాలు ప్రకటించొద్దు
సీఈవోకి రాజకీయ పార్టీల వినతి
ఫలితాల వాయిదాపై ఈసీకి నివేదిస్తాం: సీఈవో భన్వర్‌లాల్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ముందుగా జరగనున్న మునిసిపల్ ఎన్నికల ఫలితాల ప్రభావం ఆ తర్వాత జరిగే సార్వత్రిక ఎన్నికలపై పడే ప్రమాదం ఉందని పలు రాజకీయ పార్టీలు ఆందోళన వ్యక్తం చేశాయి. వీలైతే మునిసిపల్ ఎన్నికలు ముందుగా జరగకుండా చూడాలని, అలా సాధ్యం కాని పక్షంలో ఆ ఎన్నికల ఫలితాలనైనా సార్వత్రిక ఎన్నికల ప్రక్రియ ముగిసేంత వరకూ వెల్లడించకుండా చేయాలని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి (సీఈవో) భన్వర్‌లాల్‌కు రాజకీయ పార్టీలన్నీ విన్నవించాయి. సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ వెలువడిన నేపథ్యంలో బుధవారం సాయంత్రం భన్వర్‌లాల్ నిర్వహించిన సమావేశంలో ఎమ్మెల్సీ సి.కమలాకర్ రెడ్డి (కాంగ్రెస్), రవీందర్ (టీడీపీ), వై.వెంకటేశ్వరరావు (సీపీఎం), కె.లక్ష్మణ్ (బీజేపీ) తదితరులు పాల్గొన్నారు. శాంతియుత వాతావరణంలో స్వేచ్ఛాయుత ఎన్నికలు జరిగేలా అన్ని రాజకీయ పార్టీలు సహకరించాలని భన్వర్‌లాల్ కోరారు. లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసే వరకు మున్సిపల్ ఎన్నికల ఫలితాలు ప్రకటించకుండా నిలుపుదల చేసే అంశాన్ని కేంద్ర ఎన్నికల కమిషన్‌కు నివేదిస్తామని తెలిపారు.
మున్నిపోల్స్ సన్నద్ధంపై రమాకాంత్‌రెడ్డి చర్చ
మున్సిపల్ ఎన్నికల నిర్వహణపై రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ పి.రమాకాంత్‌రెడ్డి ఉన్నతాధికారులతో బుధవారం బుద్ధభవన్‌లో సమావేశం నిర్వహించారు. డీజీపీ ప్రసాదరావు, ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి అజయ్ కల్లం, పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శి సమీర్‌శర్మ, సీడీఎంఏ జనార్దన్‌రెడ్డి, ఎక్సైజ్ శాఖ ముఖ్య కార్యదర్శితో చర్చించారు. స్థానిక సంస్థల్లో శాంతిభద్రతల పరిస్థితి, పోలీసు బలగాల మోహరింపు, అసాంఘిక కార్యకలాపాల నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలతోపాటు, ఓటర్లు స్వేచ్ఛగా ఓటు వేసేలా తీసుకోవాల్సిన చర్యలపై డీజీపీ ప్రసాదరావు, శాంతిభద్రతల అదనపు డీజీపీతో చర్చించారు. చెక్‌పోస్టులు, పట్టణాలు, నగరాల్లో వాహనాల తనిఖీలు చేపట్టి... అక్రమంగా డబ్బు తరలిస్తుంటే సీజ్ చేయాలని నిర్దేశించారు. అనధికార మద్యం షాపులను తక్షణమే మూసివేయించాలని, మద్యం దుకాణాలు ప్రభుత్వం విధించిన సమయానికి మించి ఎట్టిపరిస్థితుల్లోనూ తెరిచి ఉంచకుండా చర్యలు తీసుకోవాలన్నారు.
సార్వత్రిక ఎన్నికలపై మున్సి‘పోల్స్’ ప్రభావం
Published Thu, Mar 6 2014 2:35 AM | Last Updated on Sat, Sep 2 2017 4:23 AM
Advertisement
Advertisement