నెల్లూరు(టౌన్), న్యూస్‌లైన్: మున్సిపల్ కార్పొరేషన్, మున్సిపాలిటీల్లోని కాంట్రా క్టు, ఔట్‌సోర్సింగ్, సొసైటీ పారిశుధ్య కార్మికులకు ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు రూ.12,500 వరకు కనీస వేతనం పెంచాలని కోరుతూ శనివారం నుంచి రాష్ట్ర వ్యాపితంగా ఐక్యకార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో నిరవధిక సమ్మె చేపడుతున్నట్లు ఏపీ మున్సిపల్ వర్కర్స్, ఎంప్లాయీస్ యూనియన్ (సీఐటీయూ) గౌరవాధ్యక్షుడు మాదాల వెంకటేశ్వర్లు తెలిపారు.
శుక్రవారం బాలాజీనగర్‌లోని డాక్టర్ రామచంద్రారెడ్డి భవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గత ఏడాది అక్టోబర్ 21 నుంచి 24వ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా జరిగిన సమ్మెలో ప్రభుత్వం పలు సమస్యల పరిష్కారానికి హామీ ఇచ్చిందని తెలిపారు. ఇప్పటివరకు పట్టించుకోకపోవడం దారుణమన్నారు. అందుకే తప్పని సరి పరిస్థితుల్లో సమ్మె చేపట్టబోతున్నామన్నారు. గతంలో మున్సిపల్ కార్మికుల వద్ద నుంచి వసూలు చేసిన కోట్లాది రూపాయల పీఎఫ్ మొత్తాన్ని పలు మున్సిపాలిటీల్లో కమిషనర్లు దిగమింగారని ఆరోపించారు. ఆ మొత్తాన్ని వెంటనే కార్మికుల ఖాతాలో జమచేయాలని డిమాండ్ చేశారు. కార్మికుల సమస్యలు పరిష్కరించకపోతే ఆమరణ దీక్షకు దిగుతామని హెచ్చరించారు. ఈ సమావేశంలో వివిధ సంఘాలకు చెందిన నాయకులు కత్తి శ్రీనివాసులు, పెంచలనరసయ్య, కర్రెయ్య పాల్గొన్నారు.
సీఐటీయూ ఆధ్వర్యంలో ప్రదర్శన, మానవహారం
తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ సీఐటీయూ ఆధ్వర్యంలో కార్పొరేషన్‌కు చెందిన పారిశుధ్య కార్మికులు స్థానిక గాంధీబొమ్మ సెంటర్లో ప్రదర్శన నిర్వహించారు. తరువాత అక్కడే మానవహారంగా ఏర్పడి తమ నిరసనను వ్యక్తం చేశారు. ట్రాఫిక్‌ను అడ్డుకున్నారు.
నేటి నుంచి మున్సిపల్ కార్మికుల సమ్మె
Published Sat, Feb 8 2014 3:42 AM | Last Updated on Sat, Oct 20 2018 6:17 PM
Advertisement