మున్సిపల్ కార్మికుల సమస్యలు సీఎం దృష్టికి
మంత్రి పరిటాల సునీత హామీ
కడప కార్పొరేషన్ : మున్సిపల్ కార్మికుల డిమాండ్లు న్యాయసమ్మతమైనవని, ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి పరిష్కారమయ్యేలా కృషి చేస్తానని రాష్ట్ర పౌర సరఫరాల శాఖామంత్రి పరిటాల సునీత హామీ ఇచ్చారు. జిల్లా పర్యటనకు వచ్చిన మంత్రి సునీతను అడ్డుకొనేందుకు మున్సిపల్ కార్మికులు నగరపాలక సంస్థ కార్యాలయం నుంచి కోటిరెడ్డి సర్కిల్, ఏడురోడ్ల కూడలి మీదుగా కళాక్షేత్రం వరకూ ర్యాలీ నిర్వహించారు. కళాక్షేత్రం బయట బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా పోలీసులు చొరవ తీసుకొని మంత్రి సునీతను కార్మికుల వద్దకు తీసుకొచ్చి మాట్లాడించారు.
తమ సమస్యలు పరిష్కరించాలని కొందరు మహిళలు మంత్రి కాళ్లు పట్టుకొనే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మున్సిపల్ కార్మికులు రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె చే స్తున్నారని, వారి సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ నగర కార్యదర్శి బి. మనోహర్, కార్మిక నాయకులు ఎస్. రవి, శ్రీరామ్, సిద్దిరామయ్య, దస్తగిరమ్మ, సాలమ్మ, కొండమ్మ, అధిక సంఖ్యలో కార్మికులు పాల్గొన్నారు.
త్వరలో రేషన్ డీలర్లకు వేతనాలు
వేంపల్లె : రాష్ట్రంలోని రేషన్ డీలర్లకు త్వరలో వేతనాలు అందిస్తామని పౌరసరఫరాల శాఖ మంత్రి పరిటాల సునీత వెల్లడించారు. వేతనాలను సీఎం ఆమోదించారని.. కేబినేట్ ఆమోద ముద్ర వేసిన తర్వాత వేతనాలు మంజూరు చేస్తామన్నారు. జిల్లా పర్యటనలో భాగంగా మంగళవారం ఉదయం వేంపల్లెకు వచ్చిన మంత్రి పరిటాల సునీతకు శాసనమండలి డిప్యూటీ చెర్మైన్ సతీష్‌రెడ్డి, సర్పంచ్ విష్ణువర్థన్‌రెడ్డి తదితరులు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా స్థానిక రేషన్ డీలర్లు మంత్రికి వినతి పత్రం సమర్పించారు. పనిభారం ఎక్కువగా ఉందని.. ప్రభుత్వం ఇచ్చే కమీషన్ సరిపోలేదని డీలర్లు మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. రేషన్ డీలర్లకు వేతనాలు ఇవ్వాలని ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని ఈ సందర్భంగా మంత్రి పేర్కొన్నారు.