బుచ్చిరెడ్డిపాళెం : మండలంలోని మునులపూడి అరుంధతీయవాడలో పురాతన కాలం నాటి నంది విగ్రహం చోరీ చేసి తరలిస్తుండగా గ్రామస్తులు అడ్డుకుని విగ్రహంతో సహా నలుగురు వ్యక్తులను పట్టుకున్న సంఘటన గురువారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు.. ఆరుగురు వ్యక్తులు ఇన్నోవా వాహనంలో బుధవారం అర్థరాత్రి కనిగిరి రిజర్వాయర్ చెరువు గట్టు వద్ద దళితవాడ లోని బీరాలమ్మ ఆలయం వద్దకు చేరుకున్నారు. అక్కడ ఆలయం ఎదురుగా ఉన్న పురాతన నంది విగ్రహాన్ని అతికష్టం మీద పెకలించి వాహనంలోకి చేర్చారు.
నంది విగ్రహం బరువుకు కారు ముందుకు సాగలేకపోయింది. దీంతో డ్రైవర్ ఎక్స్‌లేటర్ గట్టిగా నొక్కేసరికి ఒక్కసారిగా కారు ముందుకు దూకింది. ఈ అలికిడి విన్న మత్స్యకారులు అక్కడికి చేరుకునేలోగా కారు వెళ్లిపోయింది. ఈ విషయాన్ని గ్రామంలో ఉన్న తమ బంధువులకు చెప్పేసరికి వారు అప్రమత్తమై వాహనాన్ని గ్రామంలో అడ్డుకున్నారు. కారులో ఉన్న ఇద్దరు పరారు కాగా నలుగురు వ్యక్తులు దొరికారు. వారు గ్రామస్తులపై తిరగబడాలని చూడటంతో వారిని పట్టుకుని కొట్టడమే కాకుండా కారును ధ్వసం చేశారు. ఈ విషయాన్ని పోలీసులకు తెలుపగా ఎస్సై శ్రీనివాసరావు సంఘటనా స్థలానికి వచ్చి నంది విగ్రహం, వాహనంతో సహా నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. నెల్లూరు రూరల్ డీఎస్పీ వీఎస్ రాంబాబు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. జరిగిన విషయాన్ని అడిగి తెలుసుకున్నారు. దీనిపై విచారణ చేస్తున్నట్లు ఆయన తెలిపారు.