పెద్దకడ్మూర్‌లో కృష్ణను అప్పగిస్తున్న పోలీసులు
అమరచింత (కొత్తకోట) : సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్న పుకార్లతో నేటికీ గ్రామాల్లో భయాందోళనలు తొలగడం లేదు. బూచోలొచ్చారని, చంటిపిల్లలను ఎత్తుకెళ్లి చంపుతారని భయపడుతున్న తరుణంలో ఓ గుర్తు తెలియని వ్యక్తి యాచిస్తూ సంచరిస్తున్న సమయంలో యువకులు బంధించి పోలీసులకు అప్పగించారు. ఈ సంఘటన అమరచింతలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. పెద్దకడ్మూర్ గ్రామానికి చెందిన బుడగజంగాల కృష్ణ గురువారం అమరచింతకు వచ్చి భిక్షాటన చేశాడు. రాత్రివేళలో స్వగ్రామానికి వెళ్లడానికి అమరచింత బస్టాండ్‌కు రాగా అప్పటికే పెద్దకడ్మూర్ బస్సు గ్రామానికి వెళ్లిపోయింది.
దీంతో ఆకలితో ఉన్న కృష్ణ స్థానిక సయ్యద్‌నగర్‌కాలనీలో భిక్షమెత్తుకున్నాడు. ఈ తరుణంలో కాలనీకి చెందిన యువకులు పిల్లలెత్తుకెళ్లే దొంగగా ఉన్నాడంటూ పోలీసులకు సమాచారమిచ్చారు. పోలీసులు వచ్చి అపరిచిత వ్యక్తిని పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లి ఎస్‌ఐ సత్యనారాయణరెడ్డి ఆధ్వర్యంలో విచారించగా బుడగజంగాల కృష్ణ పెద్దకడ్మూర్‌కు చెందిన వ్యక్తిగా చెప్పాడు. దీంతో ఆ గ్రామ సర్పంచ్ లక్ష్మన్నకు ఫోన్ ద్వారా సమాచారం అందించగా.. తమ గ్రామానికి చెందిన వాడని చెప్పడంతో పోలీసులు కృష్ణను పెద్దకడ్మూర్‌కు తీసుకెళ్లి బంధువులకు అప్పగించారు.
Comments
Please login to add a commentAdd a comment