‘సాక్షి’ విలేకరిపై హత్యాయత్నం | Murder Attempt On Sakshi Reporter In Kurnool | Sakshi
Sakshi News home page

‘సాక్షి’ విలేకరిపై హత్యాయత్నం

Published Fri, May 31 2019 7:57 AM | Last Updated on Fri, May 31 2019 9:47 AM

Murder Attempt On Sakshi Reporter In Kurnool

టీడీపీ కార్యకర్తల చేతిలో గాయపడిన సాక్షి విలేకరి వెంకటేశ్వర్లు

కోవెలకుంట్ల : కర్నూలు జిల్లా సంజామల మండల ‘సాక్షి’ విలేకరి వెంకటేశ్వర్లుపై గురువారం రాత్రి 10.30 గంటల సమయంలో హత్యాయత్నం జరిగింది. స్థానికుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి.  గతంలో తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా వార్తలు రాశాడన్న కారణంతో గ్రామానికి చెందిన టీడీపీ నాయకులు గని దస్తగిరిరెడ్డి, గని రమణారెడ్డికి విలేకరి వెంకటేశ్వర్లుకు మధ్య మనస్పర్థలు తలెత్తాయి. ఈ క్రమంలో సంజామల శివారులోని వెంకటేశ్వరస్వామి ఆలయంలో గురువారం రాత్రి బంధువుల వివాహం ఉండటంతో వెంకటేశ్వర్లు  అక్కడకు వెళ్లారు. ఈ విషయం తెలుసుకున్న టీడీపీ నేతలు తమ అనుచరులైన నాగిశెట్టి, హజరత్, శ్రీనివాసులును విలేకరిపై దాడికి ఉసిగొల్పారు. వారు కత్తి, రాళ్లతో ఆయనపై దాడి చేశారు.  రెండుసార్లు కత్తితో పొడిచేందుకు ప్రయత్నించగా కత్తిపోట్ల నుంచి వెంకటేశ్వర్లు తప్పించుకున్నారు. ఆ వెంటనే బండరాయితో తలపై బలంగా కొట్టడంతో విలేకరి కింద పడ్డాడు. పక్కన ఉన్న రాళ్లతో మళ్లీ దాడి చేయడంతో తలకు గాయాలయ్యాయి.

అలాగే విలేకరి వెంట ఉన్న గ్రామానికి చెందిన ఫొటోగ్రాఫర్‌ మహేష్‌పైనా దుండగులు దాడికి పాల్పడ్డారు. ఆ ప్రదేశంలో గొడవ జరుగుతున్నట్టు భావించిన స్థానికులు గట్టిగా కేకలు వేయడంతో దుండగులు అక్కడి నుంచి పరారయ్యారు. తీవ్రంగా గాయపడిన వెంకటేశ్వర్లును చికిత్స నిమిత్తం కోవెలకుంట్ల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా వార్తలు రాశారన్న నెపంతోనే విలేకరిని హత్య చేయించేందుకు టీడీపీ నాయకులు కుట్ర పన్నినట్టు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు పోలీసుల విచారణలో తేలాల్సి ఉంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement