ఎయిర్‌పోర్టు పోలీస్ స్టేషన్‌లో విచారణ సమయంలో పోలీసుల హడావుడి (ఫైల్)
ఔను.. మహేష్‘చంద్రం’లది డ్రామాయేనని తేలిపోయింది.పోలీసుల హైడ్రామా, పనితీరుపై ముప్పిరిగొన్న అనుమానాలు, అంచనాలను తాజా పరిణామాలు అక్షరాలా నిజమని రుజువు చేశాయి.
వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై హత్యాయత్నం ఘటన కేసు విచారణలోనే కాదు.. ఆ కేసును నిరుగార్చి.. క్లోజ్ చేసేయాలన్న తొందరలోనూ పోలీసులు కుట్రకు తెరలేపిన విషయం హైకోర్టు ఆదేశాలతో బట్టబయలైంది.
కేసును నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ(ఎన్‌ఐఏ)కి అప్పజెబుతూ హైకోర్టు కేంద్ర హోం శాఖకు ఆదేశాలు ఇచ్చిన విషయాన్ని ముందే పసిగట్టిన సర్కారు అప్పటికప్పుడు విశాఖ పోలీసులతో హడావుడిగా ప్రెస్‌మీట్ పెట్టించింది.రాష్ట్ర పోలీసుల విచారణపై నమ్మకం లేని వైఎస్సార్‌సీపీ నేతలు హైకోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో కేసునుఎన్‌ఐఏకు అప్పజెప్పాలని ఉన్నత న్యాయస్థానం డిసెంబర్ 31నే కేంద్ర హోమ్ శాఖను ఆదేశించింది.కేంద్ర హోమ్‌శాఖ ఆదేశాలతో జనవరి ఒకటో తేదీన కేసు తీసుకున్నహైదరాబాద్‌లోని ఎన్‌ఐఏ విభాగం ఎఫ్‌ఐఆర్ కూడా నమోదు చేసింది. అంటే ఆ రోజు నుంచే కేసు ఎన్‌ఐఏ చేతుల్లోకి వెళ్ళిపోయింది.ఈ ఉప్పందుకున్న సర్కారు ఆదేశాలతో విశాఖ పోలీస్ కమిషనర్ మహేష్‌చంద్ర లడ్హా ఆ మరుసటి రోజు.. అంటేజనవరి 2న హడావుడిగా మీడియా సమావేశం పెట్టి ప్రతిపక్ష నేతపై హత్యాయత్నాన్ని చిన్నపాటి ఘటనగా తేల్చేశారు. విచారణ దాదాపు క్లోజ్ అయిందని, శ్రీనివాసరావు ఒక్కడే.. ఏదో ప్రచారం కోసం చేశాడనిచాలా తేలిగ్గా తీసిపారేశారు,వైఎస్ జగన్‌పై జరిగిన హత్యాయత్నం కేసు విచారణ సందర్భంగా కేసును ఎన్‌ఐఏకు అప్పజెప్పిన విషయం హైకోర్టు స్పష్టం చేయడంతో విశాఖ పోలీసుల కుటిలత్వం, సర్కారు కుట్ర బట్టబయలయ్యాయి.
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై హత్యాయత్నం ఘటన కేసు విచారణలో మొదటి నుంచి హైడ్రామాలకు తెరలేపిన విశాఖ పోలీసులు చివరికి కేసు జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఏ) పరిధిలోకి వెళ్ళిందని తెలిసిన తర్వాత కూడా అర్ధంతరంగా ప్రెస్‌మీట్ పెట్టి మరో కుట్రకు తెరలేపారు. వైఎస్ జగన్‌పై విశాఖపట్నం ఎయిర్‌పోర్ట్‌లో అక్టోబర్ 25న జరిగిన హత్యాయత్నంపై విచారణ తొలి రోజు నుంచీ పోలీసుల తీరు అడుగడుగడునా అనుమానాలకే తావిచ్చింది. జగన్‌పై కత్తితో దాడి చేసిన ఎయిర్‌పోర్ట్‌లోని ఫ్యూజన్ ఫుడ్స్ రెస్టారెంట్ ఉద్యోగి శ్రీనివాసరావుకే విచారణను పరిమితం చేసిన పోలీసులు ఇంతవరకు అసలు కుట్రధారులు, సూత్రధారుల జోలికే పోలేదు.
పలు కేసులున్నా..
తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరం మండలం థానేలంక గ్రామానికి చెందిన శ్రీనివాసరావుపై అక్కడి పోలీస్‌స్టేషన్‌లోనే ఎన్నో కేసులున్నాయి. నేర చరిత ఉన్న వారిని రక్షణశాఖ అధీనంలోని విశాఖ ఎయిర్‌పోర్ట్‌లో పొరపాటున కూడా ఉద్యోగంలోకి తీసుకోరు. పోలీస్‌స్టేషన్ నుంచి ఎన్‌వోసీ(నో అబ్జెక్షన్ సర్టిఫికెట్) ఇస్తేనే ఎయిర్‌పోర్ట్ ప్రాంగణంలో ఉద్యోగం చేసేందుకు అర్హులు. అయితే నేరచరిత ఉన్న శ్రీనివాసరావు ఎయిర్‌పోర్ట్‌లోకి ఎలా ప్రవేశించగలిగాడు.. అతనికి ఎన్‌వోసీ ఇప్పించిందెవరు.. అన్న ప్రశ్నలకు ఇంతవరకు పోలీస్ కమిషనర్ కూడా స్పష్టమైన సమాధానం ఇవ్వలేదు.
ఈ ప్రశ్నలకు సమాధానాలేవీ?
∙శ్రీనివాసరావు పనిచేస్తున్న ఫ్యూజన్ ఫుడ్స్ రెస్టారెంట్ యజమాని తొట్టెంపూడి హర్షవర్ధన్ ప్రసాద్ చౌదరి మొదటి నుంచి కరడుగట్టిన తెలుగుదేశం పార్టీ నాయకుడు. అప్పట్లో ఎన్‌టిఆర్ మొదలు ఇప్పటి సీఎం చంద్రబాబునాయుడు, లోకేష్‌లు వైజాగ్ ఎప్పుడొచ్చినా వెన్నంటే ఉండి హల్‌చల్ చేస్తుంటారు. ఇక దగ్గుబాటి పురంధేశ్వరి సిఫార్సుతో 2010లో వైజాగ్ ఎయిర్‌పోర్ట్‌లో రెస్టారెంట్ లీజుకు తీసుకున్న హర్షవర్ధన్.. మొదటి నుంచి టీడీపీ నేతలు సిఫార్సు చేసిన వ్యక్తులనే రెస్టారెంట్‌లో ఉద్యోగంలోకి తీసుకున్నాడు. అలాంటిది శ్రీనివాసరావును ఎవరు సిఫార్సు చేశారు.. ఎవరు చెబితే ఉద్యోగంలోకి తీసుకున్నాడు.. ? అనే దిశగా పోలీసులు విచారణే చేయలేదు.
బయటి నుంచి గుండుసూది కూడా తీసుకెళ్లలేని ఎయిర్‌పోర్ట్‌లోకి శ్రీనివాసరావు కత్తులు ఎలా తీసుకురాగలిగాడు. జగన్‌పై హత్యాయత్నానికి పాల్పడ్డ రోజే కత్తులకు రెస్టారెంట్‌లోనే స్టెరిలైజ్ చేశాడని స్వయంగా సీపీనే ప్రకటించారు. అంత జరుగుతుంటే హర్షవర్ధన్ ఎందుకు అడ్డుకోలేదనే దానిపై సీపీ నుంచి సమాధానమే లేదు.
∙శ్రీనివాసరావుది మొదటి నుంచి రెస్టారెంట్‌లో సాయంత్రం నుంచి రాత్రి వరకు ఉండే బీ షిఫ్ట్ డ్యూటీ. జగన్‌పై దాడి చేసిన రోజు మాత్రం ఉదయమే విధుల్లోకి వచ్చినా రెస్టారెంట్‌లోనే ఉన్న హర్షవర్ధన్ ఎందుకు ప్రశ్నించలేదు. శ్రీనివాసరావు ఉద్యోగం అసిస్టెంట్ కుక్ అయితే సర్వీస్ అసిస్టెంట్ చేసే పని అతను చేస్తుంటే ఎందుకు అడ్డుకోలేదు..? పోనీ జగన్‌తో సెల్పీ కోసం అని శ్రీనివాసరావు చెప్పాడనుకున్నా అతని వద్ద కెమెరా ఫోన్ లేదని రెస్టారెంట్‌లో ఉన్న వారందరికీ తెలుసు. అప్పుడైనా కెమెరా ఫోన్ లేకుండా సెల్ఫీ ఏమిటని అడగాలి. కనీసం అప్పటి వరకు అక్కడే ఉన్న హర్షవర్ధనైనా ప్రశ్నించాలి.. కానీ అలా ఎవరూ అడగలేదు.
ఈ చిన్న విషయాలు కూడా హర్షవర్ధన్ పట్టించుకునేంతటి పరిస్థితి లేదు అని చెబితే నమ్మశక్యం కాదు.. ఎందుకంటే ఆ రెస్టారెంట్‌లో పనిచేసే ఉద్యోగులు పదిమంది లోపే. రోజులో ఎక్కువసేపు హర్షవర్ధన్, ఆయన భార్య ఆ రెస్టారెంట్‌లోనే ఉంటుంటారు. కాబట్టి ఉద్యోగుల తీరును దగ్గరి నుంచి చూస్తుంటారు. అలాంటిది శ్రీనివాసరావును మేము కనిపెట్టలేకపోయామంటే.. అది నిజమే కాదు.
∙వైఎస్ జగన్ గత ఆగస్టు నెల నుంచి వారానికి దాదాపు రెండుసార్లు చొప్పున ఎయిర్‌పోర్ట్‌కు వస్తున్నారు. తొమ్మిది నెలలుగా అక్కడే పనిచేస్తున్న శ్రీనివాసరావు ఏరోజూ ఎందుకు జగన్‌ను కలవలేదు.? జగన్‌ను జనంలో కలవాలంటే కాస్త కష్టమైన పనేమో గానీ.. వాస్తవానికి ఎయిర్‌పోర్ట్ లోపల జగన్‌ను ఒకింత సాధ్యమయ్యే పనే, మరి వీరాభిమాని అని చెబుతున్న అతను జగన్‌ను అక్టోబర్ 25వ తేదీన కత్తి దూసే వరకు ఎందుకు కలవలేదు.?
సీఎస్‌వో తీరూ అనుమానాస్పదమే
గత రెండున్నర నెలలుగా జగన్ ఎయిర్‌పోర్ట్‌కు ఎప్పుడొచ్చినా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ స్థానిక వార్డు అధ్యక్షుడు శ్రీధర్ ఇంటి నుంచి కాఫీ వచ్చేది. హైదరాబాద్ నుంచి వచ్చేటప్పుడు ఆయన విమానం దిగి నేరుగా బయటకు వచ్చి పాదయాత్ర జరిగే ప్రాంతానికి వెళ్ళిపోతారు. ఇక్కడి నుంచి హైదరాబాద్‌కు వెళ్ళేటప్పుడు మాత్రమే కాస్త సమయముంటే వీవీఐపీ లాంజ్‌కు వెళ్ళి పార్టీ నేతలతో భేటీ అవుతారు. అయితే ఘటన జరగడానికి వారం ముందే జగన్‌కు బయటి నుంచి కాఫీ తీసుకురావడం కుదరదని ఎయిర్‌పోర్ట్ చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్(సీఎస్‌వో) వేణుగోపాల్ అడ్డుకున్నారు. కాఫీ ఫ్లాస్క్ కూడా స్వాధీనం చేసుకుని సీరియస్ అయ్యారు. పక్కనే ఉన్న రెస్టారెంట్ నుంచే తీసుకోవాలని పార్టీ నేతలను ఆదేశించాడు. ఇలా అన్న రెండో వారమే ఆ రెస్టారెంట్ నుంచే శ్రీనివాసరావు వచ్చి కత్తి దూశాడు. రెస్టారెంట్ కేంద్రంగానే కుట్ర జరిగిందన్న అనుమానాలు ఇక్కడే బలపడుతున్నాయి.
శేషప్రశ్నలతోనేకేసు చుట్టబెట్టేశారు
పక్కా వ్యూహం ప్రకారం రాష్ట్ర శాంతి భద్రతల పరిధిలోకి వచ్చే ప్రాంతంలో కాకుండా సునిశిత సమస్యగా మారే కేంద్ర బలగాల పరిధిలోని ఎయిర్‌పోర్ట్‌లో ప్రధాన ప్రతిపక్ష నేతపై దాడికి తెగబడటం మామూలు విషయం కాదు. ఒక్క వేటుతో గొంతులోకి కత్తి దించి ప్రాణాలు హరించడమే లక్ష్యంగా ఘాతుకానికి తెగించిన శ్రీనివాసరావుకు ఇదంతా చేయమని నూరిపోసిందెవరు..? అతన్ని అందుకు ప్రేరేపించి ఏం జరిగినా మేం చూసుకుంటాం.. అని అండగా నిలిచిందెవరు.. పక్కా పథకం ప్రకారం పదినెలలుగా విశాఖ ఎయిర్‌పోర్టులోనే మకాం వేయించి ఉసిగొల్పిందెవరు.. అనే కీలక విషయాలను విశాఖ పోలీసులు కనీసంగా రాబట్టలేకపోయారు. ఇలా ఎన్నో ప్రశ్నలకు కనీసం సమాధానం చెప్పలేని పోలీసులు జనవరి 2న కేసు విచారణ క్లోజ్ అయిందని, శ్రీనివాసరావు ఒక్కడే ఏదో ప్రచారం కోసం చిన్నపాటి దాడి చేశాడని చెప్పడం వెనుక అసలు కుట్ర.. శుక్రవారం హైకోర్టు ఆదేశాలతో స్పష్టమైంది.
Comments
Please login to add a commentAdd a comment