నా బిడ్డది ఆత్మహత్య కాదు హత్యే!
సత్తెనపల్లి: నా బిడ్డది ఆత్మహత్య కాదని, హత్య చేశారని ఆదివారం మృతిచెందిన పఠాన్ అస్మా తండ్రి పఠాన్ అబుజర్, కుటుంబ సభ్యులు ఆరోపించారు. పెదకూరపాడు గ్రామానికి చెందిన వివాహిత పఠాన్ అస్మా బావిలో దూకి ఆత్మహత్యకు పాల్పడినట్లు పత్రికల్లో రావడంపై వారు అనుమానం వ్యక్తం చేశారు. ఏరియా వైద్యశాల వద్ద సోమవారం మృతురాలి తండ్రి పఠాన్ అబుజర్, సోదరుడు ఫిరోజ్, బంధువులు విలేకరులతో మాట్లాడారు.
సుభానీయే హత్య చేశాడు!
ఈ నెల 7న గ్రామానికి చెందిన షేక్ సుభానీ తమ కుమార్తె అస్మాను ట్రాప్ చేసి తీసుకెళ్లాడని, అస్మా ఆచూకీ కోసం ఎక్కడ వెతికినా కనిపించలేదన్నారు. పది రోజులైనా రాకపోవడంతో పెళ్లి చేసుకొని ఉంటాడనుకున్నామని, చివరకు పెదమక్కెన గ్రామ సమీపంలోని బావిలో ఆదివారం శవమై కనిపించిందన్నారు. పోస్టుమార్టం జరగకుండానే పోలీసులు ఆత్మహత్య అని ఎలా నిర్థారించారో తెలియడం లేదన్నారు. అస్మాను హత్య చేసిన వారిపై కఠినచర్యలు తీసుకొని తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. దీనిపై సత్తెనపల్లి రూరల్ ఎస్‌ఐ వెంకట్రావును అస్మా మృతిపై అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశామని చెప్పారు. పోస్ట్‌మార్టం నివేదికను బట్టి తదుపరి చర్యలు తీసుకుంటామన్నారు.
మృతదేహంతో ధర్నా
పెదకూరపాడు : అస్మాది ఆత్మహత్య కాదు హత్య అంటూ మృతురాలి తల్లిండ్రులు అబుజార్, ముంతాజ్, బంధువులు, ముస్లిం పెద్దలు సోమవారం సాయంత్రం 6 గంటల నుంచి పెదకూరపాడు కాలచక్రరోడ్డుపై ధర్నా చేశారు. అస్మా మృతిపై పూర్తి విచారణ జరిపి నిందితులను శిక్షించాలంటూ నినాదాలు చేశారు. జిల్లా రూరల్ ఎస్పీ వచ్చి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. అమరావతి ఎస్‌ఐ వెంకటప్రసాద్ బాధితులకు సర్దిచెప్పే ప్రయత్నం చేసినా ప్రయోజనం లేకుండా పోయింది. రాత్రి 10 గంటల వరకూ ధర్నా కొనసాగింది.