హనుమాన్‌జంక్షన్, న్యూస్‌లైన్ : ఇంటి యాజమానురాలిని అతి కిరాతకంగా హతమార్చిన ఘటన హనుమాన్‌జంక్షన్‌లో మంగళవారం కలకలం రేపింది. హత్యచేసిన అనంతరం మృతదేహాన్ని మూటకట్టి ఇంట్లోని సోఫా కింద దాచిపెట్టి నిందితుడు పరారయ్యాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం స్థానిక ఆర్టీసీ బస్టాండ్ ఎదుట గల సరిత ఫ్యాన్సీ స్టోర్స్ యాజమాని అల్లాడి భానుమూర్తికి గుడివాడ రోడ్డులోని బండివానిచెరువు గట్టులో సొంతిల్లు ఉంది. అందులోని ఒక పోర్షన్‌లో కొంతకాలంగా గొర్రెల రవికుమార్ అద్దెకు ఉంటున్నాడు. మంగళవారం భానుమూర్తి రోజూలాగానే ఉదయం 8 గంటలకు షాపునకు వెళ్లారు. ఆ తర్వాత పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో ఏసీటీవోగా పనిచేస్తున్న ఆయన కుమారుడు గోపీకృష్ణ ఉద్యోగ విధులకు వెళ్లిపోయాడు.
ఇంట్లో భార్య వరలక్ష్మి (48) ఒంటరిగా ఉన్నారు. అద్దెకు నివసిస్తున్న రవికుమార్ భార్య, పిల్లలు పదిరోజుల క్రితం భీమవరం సమీపంలోని కాళ్లలోని బంధువుల ఇంటికి వెళ్లారు. కార్పెంటర్‌గా పనిచేసే రవికుమార్ ఒక్కడే ఇక్కడ ఉన్నాడు. ప్రతిరోజూ 11.30 గంటలకు భర్తకు క్యారేజీ తీసుకుని షాపునకు వచ్చే వరలక్ష్మి సమయం దాటిపోయినా రాకపోవటంతో భానుమూర్తి ఇంట్లోని ల్యాండ్‌ఫోన్‌కు కాల్ చేశారు. ఫోన్ ఎవరూ తీయకపోవడంతో ఇంటికి వచ్చిన ఆయనకు భార్య ఆచూకీ కనిపించలేదు. ఇంటి తలుపులు మాత్రం అన్నీ తెరిచి ఉండటంతో ఆందోళనకు గురై వెంటనే కొడుకు గోపీకృష్ణకు సమాచారం అందించారు. హుటాహుటిన జంక్షన్ చేరుకుని పోలీసులకు ఫిర్యాదు చేశారు.
రవికుమార్‌తో ఉదయమే వాగ్వాదం..
ఉదయం ఇంటి యాజమానురాలు వరలక్ష్మి, రవికుమార్‌ల మధ్య పరస్పరం వాగ్వివాదం జరిగినట్లు చుట్టుపక్కల వాళ్లు చెప్పటంతో అద్దెకు ఉంటున్న వ్యక్తిపై పోలీసులకు అనుమానం వచ్చింది. అప్పటికే పలుమార్లు రవికుమార్ సెల్‌కు ఫోన్ చేస్తే వస్తున్నా అంటూనే ఎంతకూ రాకపోవటం అనుమానాలను బలపర్చింది. దీంతో వారు రవికుమార్ అద్దెకుంటున్న గది తాళాలు పగలగొట్టి సోదా చేయటంతో విషయం వెలుగుచూసింది. వరలక్ష్మి మృతదేహాన్ని సంచిలో మూటకట్టి సోఫా కింద దాచివుంచటాన్ని గుర్తించారు. బయటికి తరలించేందుకు ఆస్కారం లేక నిందితుడు పరారయ్యాడని భావిస్తున్నారు
.
కత్తితో దాడి..
మృతురాలి ఒంటిపై కత్తితో దాడి చేసినట్లు గాయాలున్నాయని పోలీసులు గుర్తించారు. పక్కటెముకలు, మెడ, అరచేయి శరీర భాగాలపై గాయాలున్నట్లు తెలిపారు. సుమారు ఎనిమిది నెలలుగా ఇంటి అద్దె కుడా చెల్లించటం లేదని, తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న రవికుమార్ బంగారు నగలు, సొమ్ము అపహరించేందుకు ఈ హత్య చేసి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. డీఎస్సీ శంకర్‌రెడ్డి, సీఐ వైవీ రమణ, ఎస్‌ఐ ప్రభాకరరావు, ఏఎస్‌ఐ బాలస్వామి ఘటనాస్థలిలో వివరాలు సేకరించారు
జంక్షన్‌లో దారుణ హత్య
Published Wed, Sep 4 2013 5:02 AM | Last Updated on Mon, Jul 30 2018 9:15 PM
Advertisement