hanuman junction
-
అట్టర్ ప్లాప్ .. పవన్ కళ్యాణ్ స్పీచ్ పబ్లిక్ జంప్
-
నగల దుకాణంలో భారీ చోరీ
సాక్షి, హనుమాన్‌జంక్షన్(విజయవాడ) : కృష్ణా జిల్లా హనుమాన్‌జంక్షన్ సెంటర్లో ఓ జ్యూవెలరీ షాపులో దుండగులు చోరీకి పాల్పడ్డారు. నగల దుకాణం గోడకు రంధ్రం పెట్టి దొంగలు లోనికి చొరబడ్డారు. సుమారు రూ.30 లక్షల విలువ చేసే బంగారు, వెండి ఆభరణాలను దుండగులు అపహరించుకుపోయారు. జాతీయ రహదారిపై అర్ధరాత్రి వేళలోనూ జనసంచారం ఉండే ప్రాంతం కావటం, పోలీసులు కూడా నైట్ బీటు నిర్వహించే సెంటర్‌కు కూతవేటు దూరంలో దుండగులు యథేచ్ఛగా భారీ చోరీకి తెగబడటంతో ప్రజల్లో ఆందోళన నెలకొంది. స్థానిక ఏలూరురోడ్డులోని ఆంజనేయ జ్యూవెలరీ వర్క్స్‌లో బుధవారం అర్ధరాత్రి దొంగలు చొరబడ్డారు. షాపు పక్కన ఉన్న చిన్న సందులో అర్ధరాత్రి నుంచి దుకాణం గోడకు రంధ్రం పెట్టి దుండగులు లోనికి వెళ్లారు. గోడను పగులు కొట్టేందుకు దుండగులు వినియోగించిన గడ్డ పొలుగు, నీళ్ల డబ్బాలను ఘటనా స్థలంలోనే విడిచి వెళ్లారు. షాపులో సీసీ కెమెరాలు ఉండటంతో చోరీ ఘటన మొత్తం పూర్తిగా రికార్డు అయింది. ఇద్దరు దుండగులు దాదాపుగా 15 నిమిషాల పాటు షాపులో తిరుగుతూ నెమ్మదిగా నగలను సర్దుకుని వెళ్లినట్లుగా సీసీ కెమెరా ఫుటేజ్‌ని బట్టి తెలుస్తోంది. చొక్కాలను ధరించకుండా, ముఖాలకు ముసుగు ధరించి షాపులో సంచరించినట్లు సమాచారం. దాదాపు 36 కాసుల బంగారం, మరో 25 కేజీల వెండి ఆభరణాలను దుండగులు దొంగిలించినట్లుగా లెక్క తేల్చారు. బాపులపాడు మండలం కానుమోలుకు చెందిన ఆంజనేయ జ్యూవెలరీ వర్క్స్ షాపు యజమాని బల్లంకి అప్పారావు గురువారం ఉదయం షాపు తెరిచి ఒక్కసారిగా నిర్ఘాంతపోయాడు. చోరీ జరిగిన విషయాన్ని వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు. జిల్లా సరిహద్దు రీత్యా పశ్చిమగోదావరి జిల్లా పెదపాడు పోలీసులు ఈ చోరీ ఘటనపై కేసు నమోదు చేశారు. హనుమాన్‌జంక్షన్ ఎస్ఐ కె.అశోక్ కుమార్ ఘటనా స్థలానికి చేరుకుని చోరీ జరిగిన విధానాన్ని పరిశీలించారు. క్లూస్‌టీం, డాగ్ స్క్వాడ్ చోరీ జరిగిన ప్రాంతంలో తనిఖీ నిర్వహించారు. షాపు యాజమాని ఇటీవలే అధిక మొత్తంలో నగల స్టాకు తీసుకురావటంతో గుర్తించిన వ్యక్తులే దోపిడీకి తెగబడి ఉండవచ్చని భావిస్తున్నారు. షాపు గోడ పగలకొట్టడం, లోనికి వచ్చి నగలు సర్దుకోవడం ఇలా దాదాపు గంటన్నర పాటు దుండగులు ఘటనాస్థలిలో ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. -
మత్తు ఇంజక్షన్ ఇవ్వటం వల్లే..
విజయవాడ: బ్యూటీషియన్ హత్యాయత్నం కేసులో కొత్తకోణాలు వెలుగు చూస్తున్నాయి. హత్యాయత్నానికి గురైన పిల్లి పద్మకు మత్తు ఇంజక్షన్ ఇచ్చినట్లు నిర్ధరణ అయింది. నిందితుడు నూతన్ కుమార్ కోసం ప్రత్యేక బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి. రెండు రోజుల క్రితం నూతన్ కుమార్‌తో పద్మగొడవపడినట్లు సమాచారం. వివాహేతర సంబంధం వికటించడం వల్లే హత్యాయత్నం జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు. రాజమహేంద్రవరానికి చెందిన పల్లె పద్మ, హనుమాన్ జంక్షన్ ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని ఓ బ్యూటీ పార్లర్లో పని చేస్తోంది. కుటుంబకలహాలతో భర్త సూర్యనారాయణతో వేరుగా ఉంటుంది. ఏలూరుకు చెందిన బత్తుల నూతన్‌కుమార్‌తో తారకరామ కాలనీలో కొంతకాలంగా సహజీవనం చేస్తోంది. వీరి మధ్య మనస్పర్థలు తలెత్తడంతో నూతన్ కుమార్, పద్మకు మత్తు ఇంజక్షన్ ఇచ్చి కాళ్లూ, చేతులూ కట్టేసి కత్తితో రెండు చేతులూ నరికేసి హింసించినట్లు తెలుస్తోంది. అనంతరం నూతన్ కుమార్ పరారయ్యాడు. పూర్తి వివరాలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
చింతమనేనికి వ్యతిరేకంగా నిరసన
సాక్షి, ఏలూరు : దెందులూరు టీడీపీ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ చింతమనేని ప్రభాకర్ దాడికి వ్యతిరేకంగా దెందులూరు హనుమాన్ జంక్షన్ లో ప్రజలు బుధవారం నిరసన ప్రదర్శన నిర్వహించారు. ప్రజల నిరసనకు వైఎస్సార్సీపీ నాయకులు దుట్టా రామచంద్రరావు, కటారి రామచంద్రరావు మద్ధతు తెలిపారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ..గరికపాటి నాగేశ్వరరావు పై దాడికి పాల్పడ్డ ఎమ్మెల్యే చింతమనేనిని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. రోజు రోజుకూ చింతమనేని అరాచకాలు పెరిగిపోతున్నాయని, చంద్రబాబు, లోకేష్ అండతోనే చింతమనేని రెచ్చిపోతున్నారని విమర్శించారు. దాడులు చేయడం చింతమనేనికి అలవాటుగా మారిందని, కోర్టులు చింతమనేనికి శిక్షలు వేసినా బుద్ది రాలేదని మండిపడ్డారు. గతంలో చింతమనేని, తహశీల్దార్ వనజాక్షిపై దాడి చేశారని చెప్పారు. చింతమనేని దాడులు చేస్తున్నా పోలీసులు చోద్యం చూస్తున్నారని, దాడికి పాల్పడ్డ చింతమనేనిని ఇంతవరకు ఎందుకు అరెస్ట్ చేయలేదని పోలీసులను ప్రశ్నించారు. కాగా వివాదాస్పద ప్రవర్తనతో తరుచూ వార్తల్లో నిలిచే ఎమ్మెల్యే చింతమనేని ఆర్టీసీ సిబ్బందిపై విరుచుకుపడ్డారు. బస్సుపై ఉన్న చంద్రబాబు ఫొటో ఎందుకు చిరిగిందంటూ డ్రైవర్, కండక్టర్లను నడిరోడ్డుపైనే దుర్భాషలాడుతూ చిందులు వేశారు. ఇదేమిటని ప్రశ్నించిన ఓ వ్యక్తిపై దాడి చేశారు. దీంతో కృష్ణా జిల్లా హనుమాన్ జంక్షన్లో నిన్న తీవ్ర ఉద్రిక్తత తలెత్తింది. వివరాల్లోకి వెళఙతే.. టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని మంగళవారం స్థానిక అభయాంజనేయ స్వామి దేవస్థానానికి వచ్చారు. అదే సమయంలో నూజివీడు డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు జంక్షన్ సెంటర్ నుంచి గుడివాడ వైపు వెళుతోంది. అయితే ఆ బస్సుపై అతికించిన ప్రభుత్వ ప్రచార పోస్టర్‌లోని సీఎం ఫొటో కాస్త చిరిగి ఉండటంతో చింతమనేని వెంటనే తన మనుషులను పంపించి బస్సును అడ్డగించారు. డ్రైవర్ వడ్డి శేఖర్, కండక్టర్ తోట వాసుబాబును కిందకు దించి.. వారిపై చింతమనేని పరుష పదజాలంతో విరుచుకుపడ్డారు. ప్రభుత్వ సొమ్ము తింటూ సీఎం ఫొటో చిరిగినా పట్టించుకోరా.. అంటూ తిట్లపురాణం అందుకున్నారు. ఆ సమయంలో అక్కడే ఉన్న స్థానికుడు గరికపాటి నాగేశ్వరరావు(చంటి) ప్రభుత్వ ఉద్యోగులతో ఇదేం వైఖరి అంటూ చింతమనేనిని ప్రశ్నించాడు. దీంతో ఆయన మరింత రెచ్చిపోయి.. నాగేశ్వరరావుపై ఏడాపెడా చేయి చేసుకోవడంతో అక్కడున్నవారు అవాక్కయ్యారు. విచిత్రమేమిటంటే ప్రభుత్వ విప్ చింతమనేని దాడి చేశారని ఫిర్యాదు చేసిన నాగేశ్వరరావు మీద హనుమాన్ జంక్షన్ పోలీసులు కేసు నమోదు చేశారు. చింతమనేని దాడికి నిరసనగా రోడ్డుపై నిరసన వ్యక్తం చేసినందుకు బాధితుడు నాగేశ్వర రావు సహా వైఎస్సార్సీపీ, కాంగ్రెస్ నేతలు 30 మందిపై కేసు నమోదు చేయడంతో ఆశ్చర్య పోవడం ప్రజల వంతైంది. పోలీసుల తీరుపై నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. -
హనుమన్ జంక్షన్లో చింతమనేని నానా హంగామా
-
హనుమాన్ జయంతికి ఏర్పాట్లు
కొండగట్టు(చొప్పదండి): కొండగట్టు అంజన్న క్షేత్రంలో ఈనెల 29నుంచి 31 వరకు జరిగే హనుమాన్ చిన్న జయంతి ఉత్సవాలకు ఆలయ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. దాదాపు 5లక్షలకు పైగా దీక్షాపరులు తెలంగాణ నుంచే కాకుండా వివిధ రాష్ట్రాల నుంచి తరలివస్తారు. ఇప్పటికే ఆలయ ఆవరణతో పాటు.. సెక్యూరిటీ గది సమీపంలో చలువ పందిర్లు పూర్తి చేశారు. బొజ్జ పోతన్న సమీపంలో పార్కింగ్‌కు ఏర్పాట్లు చేస్తున్నారు. పాత కోనేరుపై విమర్శలు వసున్నా.. నీటీ ఎద్దడి ఉన్నా.. ప్రత్యేక చొరవతో అందులో నీరు నింపనున్నట్లు అధికారులు పేర్కొన్నారు. కొనసాగుతున్న ఏర్పాట్లు.. హనుమాన్ చిన్న జయంతికి వచ్చే భక్తులకు తాగునీరు, చలివేంద్రాలు, విద్యుత్, చలువ పందిర్లు, మరుగుదొడ్లు, భోజనం, భారీకేడ్లు, పార్కింగ్ వసతి, సీసీ కెమెరాలు, వైద్యం, శానిటేషన్, క్యూలెన్లు, దర్శనంపై అధికారులు దృష్టి సారిస్తున్నారు. ముఖ్యంగా తాగునీటికోసం 20 చలివేంద్రాలు ఉండగా.. రెవెన్యూ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో మరో 20 చలివేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. చలువ పందిర్లు వేసిన చోట విద్యుత్ వైర్లలో డ్యామేజ్ లేకుండా.. వికలాంగులకు, వృద్ధులకు కొండగట్టు కిందినుంచి దొంగలమర్రి మీదుగా కొండపైకి వచ్చేందకు కలెక్టర్ శరత్ చొరవతో 24 గంటలు.. 4 మినీ బస్సులు ఏర్పాటు చేస్తున్నారు. దాదాపు 4లక్షల లడ్డూలు, పులిహోర ప్యాకెట్లను ఎక్కువ మొత్తంలో అందుబాటులో ఉంచనున్నారు. నాచుపెల్లి గ్రామంలోని బావుల ద్వారా ట్యాంకర్ల సాయంతో కొండపైకి నీటిని తీసుకురావడం.. వందకుపైగా తాత్కాలిక మరుగుదొడ్లు.. వై–జంక్షన్ నుంచి బొజ్జ పోతన్న వరకు లైటింగ్, అదనంగా మరో 25 సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నారు. పాత కోనేరులో సైతం భక్తులు స్నానాలు ఆచరించేందుకు అందులో ఎప్పటికప్పుడు నీటిని అందుబాటులో ఉంచనున్నట్లు అధికారులు తెలిపారు. తాగునీటికోసం ప్రత్యేక ఏర్పాట్లు.. యేళ్లకేళ్ళుగా నెలకొన్న తాగునీటీ సమస్యపై అధికారులు ప్రత్యేక దృష్టిసారిస్తున్నారు. కొండ దిగువన, బొజ్జ పోతన్న వద్ద, కాలినడకన వచ్చే భక్తులకు చలివేంద్రాల ద్వారా నీరు అందిచనున్నారు. వీధిలైట్లు ఏర్పాటు.. రాత్రి సమయంలో దొంగలమర్రి నుంచి గట్టు మీదకు కాలినడకన వచ్చే భక్తుల సౌకర్యార్థం దారికి ఇరువైపుల నూతనంగా విద్యుత్ స్తంభాలు, లైట్లు ఏర్పాటు చేయనున్నట్లు అధికారులు తెలిపారు. అందుబాటులో మరుగుదొడ్లు.. జయంత్యుత్సవాలకే వచ్చే భక్తులకోసం కొండ దిగువన.. ౖకొండపెన ఉన్న శాశ్వత మరుగుదొడ్లే కాకుండా, బొజ్జ పోతన్న ప్రాంతంలో, కొండపైకి వెళ్లే మార్గమధ్యలో తాత్కలిక మరుగుదొడ్లను ఏర్పాటు చేయనున్నారు. -
జంక్షన్లో దారుణ హత్య
హనుమాన్‌జంక్షన్, న్యూస్‌లైన్ : ఇంటి యాజమానురాలిని అతి కిరాతకంగా హతమార్చిన ఘటన హనుమాన్‌జంక్షన్‌లో మంగళవారం కలకలం రేపింది. హత్యచేసిన అనంతరం మృతదేహాన్ని మూటకట్టి ఇంట్లోని సోఫా కింద దాచిపెట్టి నిందితుడు పరారయ్యాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం స్థానిక ఆర్టీసీ బస్టాండ్ ఎదుట గల సరిత ఫ్యాన్సీ స్టోర్స్ యాజమాని అల్లాడి భానుమూర్తికి గుడివాడ రోడ్డులోని బండివానిచెరువు గట్టులో సొంతిల్లు ఉంది. అందులోని ఒక పోర్షన్లో కొంతకాలంగా గొర్రెల రవికుమార్ అద్దెకు ఉంటున్నాడు. మంగళవారం భానుమూర్తి రోజూలాగానే ఉదయం 8 గంటలకు షాపునకు వెళ్లారు. ఆ తర్వాత పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో ఏసీటీవోగా పనిచేస్తున్న ఆయన కుమారుడు గోపీకృష్ణ ఉద్యోగ విధులకు వెళ్లిపోయాడు. ఇంట్లో భార్య వరలక్ష్మి (48) ఒంటరిగా ఉన్నారు. అద్దెకు నివసిస్తున్న రవికుమార్ భార్య, పిల్లలు పదిరోజుల క్రితం భీమవరం సమీపంలోని కాళ్లలోని బంధువుల ఇంటికి వెళ్లారు. కార్పెంటర్‌గా పనిచేసే రవికుమార్ ఒక్కడే ఇక్కడ ఉన్నాడు. ప్రతిరోజూ 11.30 గంటలకు భర్తకు క్యారేజీ తీసుకుని షాపునకు వచ్చే వరలక్ష్మి సమయం దాటిపోయినా రాకపోవటంతో భానుమూర్తి ఇంట్లోని ల్యాండ్‌ఫోన్‌కు కాల్ చేశారు. ఫోన్ ఎవరూ తీయకపోవడంతో ఇంటికి వచ్చిన ఆయనకు భార్య ఆచూకీ కనిపించలేదు. ఇంటి తలుపులు మాత్రం అన్నీ తెరిచి ఉండటంతో ఆందోళనకు గురై వెంటనే కొడుకు గోపీకృష్ణకు సమాచారం అందించారు. హుటాహుటిన జంక్షన్ చేరుకుని పోలీసులకు ఫిర్యాదు చేశారు. రవికుమార్‌తో ఉదయమే వాగ్వాదం.. ఉదయం ఇంటి యాజమానురాలు వరలక్ష్మి, రవికుమార్‌ల మధ్య పరస్పరం వాగ్వివాదం జరిగినట్లు చుట్టుపక్కల వాళ్లు చెప్పటంతో అద్దెకు ఉంటున్న వ్యక్తిపై పోలీసులకు అనుమానం వచ్చింది. అప్పటికే పలుమార్లు రవికుమార్ సెల్‌కు ఫోన్ చేస్తే వస్తున్నా అంటూనే ఎంతకూ రాకపోవటం అనుమానాలను బలపర్చింది. దీంతో వారు రవికుమార్ అద్దెకుంటున్న గది తాళాలు పగలగొట్టి సోదా చేయటంతో విషయం వెలుగుచూసింది. వరలక్ష్మి మృతదేహాన్ని సంచిలో మూటకట్టి సోఫా కింద దాచివుంచటాన్ని గుర్తించారు. బయటికి తరలించేందుకు ఆస్కారం లేక నిందితుడు పరారయ్యాడని భావిస్తున్నారు . కత్తితో దాడి.. మృతురాలి ఒంటిపై కత్తితో దాడి చేసినట్లు గాయాలున్నాయని పోలీసులు గుర్తించారు. పక్కటెముకలు, మెడ, అరచేయి శరీర భాగాలపై గాయాలున్నట్లు తెలిపారు. సుమారు ఎనిమిది నెలలుగా ఇంటి అద్దె కుడా చెల్లించటం లేదని, తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న రవికుమార్ బంగారు నగలు, సొమ్ము అపహరించేందుకు ఈ హత్య చేసి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. డీఎస్సీ శంకర్‌రెడ్డి, సీఐ వైవీ రమణ, ఎస్ఐ ప్రభాకరరావు, ఏఎస్ఐ బాలస్వామి ఘటనాస్థలిలో వివరాలు సేకరించారు