నగల దుకాణంలో భారీ చోరీ | 30 lakh Worth jewelery Theft In Hanuman Junction | Sakshi
Sakshi News home page

నగల దుకాణంలో భారీ చోరీ

Published Fri, Aug 23 2019 9:44 AM | Last Updated on Fri, Aug 23 2019 9:49 AM

30 lakh Worth jewelery Theft In Hanuman Junction - Sakshi

సాక్షి, హనుమాన్‌జంక్షన్‌(విజయవాడ) : కృష్ణా జిల్లా హనుమాన్‌జంక్షన్‌ సెంటర్‌లో ఓ జ్యూవెలరీ షాపులో దుండగులు చోరీకి పాల్పడ్డారు. నగల దుకాణం గోడకు రంధ్రం పెట్టి దొంగలు లోనికి చొరబడ్డారు. సుమారు రూ.30 లక్షల విలువ చేసే బంగారు, వెండి ఆభరణాలను దుండగులు అపహరించుకుపోయారు. జాతీయ రహదారిపై అర్ధరాత్రి వేళలోనూ జనసంచారం ఉండే ప్రాంతం కావటం, పోలీసులు కూడా నైట్‌ బీటు నిర్వహించే సెంటర్‌కు కూతవేటు దూరంలో  దుండగులు యథేచ్ఛగా భారీ చోరీకి తెగబడటంతో ప్రజల్లో ఆందోళన నెలకొంది. స్థానిక ఏలూరురోడ్డులోని ఆంజనేయ జ్యూవెలరీ  వర్క్స్‌లో బుధవారం అర్ధరాత్రి దొంగలు చొరబడ్డారు.

షాపు పక్కన ఉన్న చిన్న సందులో అర్ధరాత్రి నుంచి దుకాణం గోడకు రంధ్రం పెట్టి దుండగులు లోనికి వెళ్లారు. గోడను పగులు కొట్టేందుకు దుండగులు వినియోగించిన గడ్డ పొలుగు, నీళ్ల డబ్బాలను ఘటనా స్థలంలోనే విడిచి వెళ్లారు. షాపులో సీసీ కెమెరాలు ఉండటంతో చోరీ ఘటన మొత్తం పూర్తిగా రికార్డు అయింది. ఇద్దరు దుండగులు దాదాపుగా 15 నిమిషాల  పాటు షాపులో తిరుగుతూ నెమ్మదిగా నగలను సర్దుకుని వెళ్లినట్లుగా సీసీ కెమెరా ఫుటేజ్‌ని బట్టి తెలుస్తోంది. చొక్కాలను ధరించకుండా, ముఖాలకు ముసుగు ధరించి షాపులో సంచరించినట్లు సమాచారం. దాదాపు 36 కాసుల బంగారం, మరో 25 కేజీల వెండి ఆభరణాలను దుండగులు దొంగిలించినట్లుగా లెక్క తేల్చారు.

బాపులపాడు మండలం కానుమోలుకు చెందిన ఆంజనేయ జ్యూవెలరీ వర్క్స్‌ షాపు యజమాని బల్లంకి అప్పారావు గురువారం ఉదయం షాపు తెరిచి ఒక్కసారిగా నిర్ఘాంతపోయాడు. చోరీ జరిగిన విషయాన్ని వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు. జిల్లా సరిహద్దు రీత్యా పశ్చిమగోదావరి జిల్లా పెదపాడు పోలీసులు ఈ చోరీ ఘటనపై కేసు నమోదు చేశారు. హనుమాన్‌జంక్షన్‌ ఎస్‌ఐ కె.అశోక్‌ కుమార్‌ ఘటనా స్థలానికి చేరుకుని చోరీ జరిగిన విధానాన్ని పరిశీలించారు. క్లూస్‌టీం, డాగ్‌ స్క్వాడ్‌ చోరీ జరిగిన ప్రాంతంలో తనిఖీ నిర్వహించారు. షాపు యాజమాని ఇటీవలే అధిక మొత్తంలో నగల స్టాకు తీసుకురావటంతో గుర్తించిన వ్యక్తులే దోపిడీకి తెగబడి ఉండవచ్చని భావిస్తున్నారు. షాపు గోడ పగలకొట్టడం, లోనికి వచ్చి నగలు సర్దుకోవడం ఇలా  దాదాపు గంటన్నర పాటు దుండగులు ఘటనాస్థలిలో ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement