కొవ్వూరు శివారున హత్యకు గురై రక్తపు మడుగులో పడి ఉన్న టీడీపీ కౌన్సిలర్ పాకా గోపాలకృష్ణ మృతదేహం (ఫైల్), కొవ్వూరులో స్టాండ్ సెంటర్‌లో పట్టపగలు హత్యకు గురై రక్తపుమడుగులో పడి ఉన్న యువకుడి మృతదేహం (ఫైల్)
సాక్షి ప్రతినిధి, ఏలూరు : ప్రశాంతతకు మారుపేరుగా ఉన్న ఏలూరులో నడిరోడ్డుపై నరుక్కొని చంపుకోవడాలు, హత్యలు, హత్యాయత్నాలతో ఇక్కడ భయపడుతూ బతికే పరిస్థితి ఏర్పడింది. పట్టపగలే తనకు అడ్డువస్తున్నాడని ఒక న్యాయవాదిని హత్య చేయించిన ఘటన సంచలనం రేపింది. ఆ తర్వాత కూడా నగరంలో రౌడీషీటర్ల హత్యలు, హత్యాయత్నాలు, తుపాకీ కాల్పులతో ఇక్కడ బతుకు భద్రం కాదనే పరిస్థితికి తెలుగుదేశం నేతలు తీసుకువచ్చారు. జిల్లా కేంద్రంలో టీడీపీ నేతల భూకబ్జాలకు అడ్డూఅదుపూ లేకుండా పోయింది. విలువైన స్థలాలు, కోర్టు పరిధిలో ఉన్న స్థలాలను ఆక్రమించుకున్నారు. ఆఖరికి స్కూలు స్థలాలు, చెరువులను కూడా వదిలిపెట్టలేదు. ఈ ఐదేళ్లలో అధికార పార్టీ నేతలు చేసిన భూకబ్జాలు సుమారు రూ.70 కోట్ల నుంచి రూ.80 కోట్ల వరకు ఉండవచ్చని అంచనా.
పెచ్చుమీరిన చింతమనేని ఆగడాలు
దళితులకు పదవులెందుకంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం దగ్గర నుంచి ఇసుక అక్రమాలను అడ్డుకున్న తహసీల్దార్ వనజాక్షిని జుట్టుపట్టుకుని ఈడ్చిన సంఘటనతో పాటు దెందులూరు అరాచకాలకు అడ్డాగా మారింది. ఈ ఐదేళ్లలో తన మాట వినలేదని గతంలో పెదవేగి ఎస్సైపై దాడి చేశారు. దీనిపై కేసు సైతం నమోదైంది. అటవీ అధికారి, మార్కెటింగ్ శాఖ అధికారులపైనే దాడికి పాల్పడిన ఘటనలు అనేకం ఉన్నాయి. అంతేకాకుండా తన ఇసుక దందాను అడ్డుకున్నారని ముసునూరు మహిళా తహసీల్దార్ వనజాక్షిని జట్టు పట్టుకుని మరీ దాడికి పాల్పడిన ఘటన అప్పట్లో రాష్ట్రంలోనే సంచలనం రేపింది. ముఖ్యమంత్రి చంద్రబాబు చింతమనేనిని వెనకేసుకురావడంతో ఆయన ఆగడాలకు అంతులేకుండా పోయింది.
గుండుగొలను సెంటర్‌లో బందోబస్తు చేస్తున్న ఏఎస్సై, సీపీఓలపై దాడికి పాల్పడ్డారు. ఇళ్లస్థలాలు, పొలాలు గొడవల పేరుతో ఇలా ప్రతిరోజు ఎవరోఒకరిని కొడుతూ రౌడీలా చెలామణి అవుతున్నా పోలీసులు ఏమీ చేయలేని నిస్సహాయస్థితిలో ఉంటున్నారు. చివరికి జర్నలిస్టులను సైతం వదలని పరిస్థితి నెలకొంది. దెందులూరు నియోజకవర్గంలో ఓ మాఫియా కింగ్‌లా చింతమనేని వ్యవహరిస్తున్నారు. ఇసుక, మట్టి, చెరువుల భూములు ఇలా అన్నింటినీ దోచేస్తున్నా అడిగే నాథుడే లేకుండాపోయాడు. 2000 సంవత్సరంలో అప్పటి చంద్రబాబు ప్రభుత్వం హయాంలోనే చింతమనేని ప్రభాకర్‌పై ఏలూరు త్రీటౌన్‌లో రౌడీషీట్‌ను సైతం పోలీసులు తెరిచారు.
కారుతో గుద్ది శ్రీగౌతమి హత్య
నరసాపురంలో తెలుగుదేశం నేతలు రెచ్చిపోయారు. ఒక నేత, పలువురు ప్రజాప్రతినిధులతో కలిసి తాను రహస్యంగా రెండోపెళ్లి చేసుకున్న యువతిని కడతేర్చారు. సివిల్స్‌కు ప్రిపేర్ అవుతున్న శ్రీగౌతమి అనే యువతిని ప్రేమ పేరుతో రహస్యంగా రెండోపెళ్లి చేసుకున్న సజ్జా బుజ్జి అనే నేత, నరసాపురం జెడ్పీటీసీతో పాటు మరికొందరిని కలుపుకుని తన చెల్లెలితో పాటు బండిపై వెళ్తున్న గౌతమిని కారుతో గుద్దించి చంపడం సంచలనం రేపింది. సీఐడీ పోలీసులు సక్రమంగా స్పందించడంతో నిందితులు జైలుకు వెళ్లారు.
రెచ్చిపోయిన ఇసుక మాఫియా
జిల్లాలో గడిచిన ఐదేళ్లలో ఇసుక మాఫియా రెచ్చిపోయింది. ఉచిత ఇసుక విధానంలో టీడీపీ ఎమ్మెల్యేలు, నేతలు రూ.కోట్లు కొల్లగొట్టారు. ్ర ఇసుక మాఫియాతో విబేధాలతో కొవ్వూరు పురపాలక సంఘంలో 16వ వార్డు కౌన్సిలర్‌గా పనిచేసిన పాకా గోపాలకృష్ణ 2016 ఏప్రిల్ 2న దారుణహత్యకు గురయ్యారు. ఔరంగబాద్ ఇసుక ర్యాంపులో చోటు చేసుకున్న వివాదమే ఈయన హత్యకు దారితీసింది. ర్యాంపులో టీడీపీ నాయకులు ఆధిపత్యం కోసం అదే పార్టీకి చెందిన గోపాలకృష్ణను అత్యంత దారుణంగా పట్ట పగలు నడిరోడ్డుపైనే కిరాతకంగా నరికి చంపారు.
అనంతరం 2017 సెప్టెంబర్ 13న ఓ యువకుడ్ని కొందరు యువకులు అత్యంత దారుణంగా నరికి చంపారు. బస్టాండ్ జంక్షన్‌లో పట్టపగలు యువకుడు రోడ్డుపైన కత్తులతో దాడి చేసి కిరాతకంగా హతమార్చారు. ఈ హత్యలో కీలక నిందితుడు మంత్రి కేఎస్ జవహర్ కుమారుడికి అనుచరుడిగా ఉండేవారు. నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. గడిచిన ఐదేళ్లుగా జిల్లాలో జరిగిన రౌడీయిజం, ఇసుక మాఫియాతో ప్రజలు విసుగెత్తిపోయారు. ఈసారి ఎన్నికల్లో జిల్లా ప్రజలు పూర్తిస్థాయిలో మార్పు కోరుకుంటున్నారు. ప్రస్తుత పాలకులకు బైబై చెప్పాలని నిర్ణయించుకున్నారు.
పశ్చిమగోదావరి జిల్లా అంటే గుర్తుకు వచ్చేది ప్రశాంతత..
పచ్చదనం. అయితే గడిచిన ఐదేళ్ల కాలంలో పశ్చిమగోదావరి అంటే రౌడీయిజం, తమకు నచ్చని వారిని తుదముట్టించడం, బెదిరింపులు, దాడులు, దౌర్జన్యాలు నిత్యకృత్యంగా మారాయి. మాట విననివారిని తప్పుడు కేసుల్లో ఇరికించడం, వేధించడం పరిపాటిగా మారింది. ఈ నేపథ్యంలో జిల్లాలో ప్రశాంతత రావాలంటే ఈ రౌడీరాజ్యానికి స్వస్తి పలకాలని ఓటర్లు
ఒక నిర్ణయానికి వచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment