కంచిలి మండలం క్రాంతినగర్ వద్ద గ్రానైట్ లీజును రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్న గిరిజనులు (ఫైల్)
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: అధికార పార్టీ ఎమ్మెల్యే బెందాళం అశోక్ ప్రాతినిధ్యం వహిస్తున్న ఇచ్ఛాపురం నియోజకవర్గంలో అవినీతి, మామూళ్ల వసూళ్లకు అంతు లేకుండా పోయిందని నియోజకవర్గ ప్రజలు ఆగ్రహిస్తున్నారు. నియోజకవర్గంలో అంగన్‌వాడీ న్యూట్రిషన్ కౌన్సిలర్ పోస్టుల నియామకంలో భారీగా వసూళ్లకు పాల్పడినట్లు ఎమ్మెల్యే అశోక్, ఆయన తండ్రి ప్రకాశ్, టీడీపీ నాయకులపై వచ్చిన ఆరోపణలు సంచలనం కలిగించాయి. 283 మంది కౌన్సిలర్ల నియామకం కోసం ఒక్కో అభ్యర్థి నుంచి రూ.50 వేల నుంచి రూ.లక్ష వరకూ ముక్కుపిండి మరీ వసూలు చేశారని బాధితులే రోడ్డెక్కారు. 2015 నవంబరులో ఈ కౌన్సిలర్ల నియామకం జరిగింది. తీరా ఏడాది తిరగకముందే వారిని పోస్టింగుల నుంచి తొలగించేయడం గమనార్హం.
బాధితులంతా నిరసనకు దిగి ఎమ్మెల్యే అశోక్‌ను చుట్టుముట్టి నిలదీసిన సంగతి తెలిసిందే. అలాగే ఇచ్ఛాపురం మండలంలోని తిప్పనపుట్టుగ గ్రామానికి చెందిన దివ్యాంగుడు ఘనశ్యామ్ మజ్జి ఇంటర్మీడియెట్ తర్వాత టీచర్ ట్రైనింగ్ పూర్తి చేశాడు. ఇచ్ఛాపురం మున్సిపాలిటీలో అటెండర్ పోస్టు కోసం దివ్యాంగుల కోటాలో తన పేరు సిఫారసు చేయాలని టీడీపీ ఎమ్మెల్యే బెందాళం అశోక్‌కు విన్నవించుకుంటే..ఎమ్మెల్యే తండ్రి బెందాళం ప్రకాశ్ అక్షరాలా మూడు లక్షల రూపాయలు లంచం డిమాండ్ చేశారు. మరోవైపు ప్రభుత్వపరంగా జరిగే నిర్మాణ పనులనూ ఎమ్మెల్యే వదల్లేదు. తన బినామీలకే కట్టబెట్టారు.
ఇసుక అక్రమ రవాణాకు అంతేలేదు
బాహుదా, మహేంద్రతనయ నదులు ఇచ్ఛాపురం నియోజకవర్గానికి ప్రకృతి సంపద! వాటిలో ఇసుక తవ్వకాలతో పర్యావరణానికి ముప్పు వాటిల్లుతుందనే ఉద్దేశంతో ర్యాంపులకు ఎక్కడా గనులశాఖ అధికారులు అనుమతి ఇవ్వలేదు. కానీ అక్రమ సంపాదనే పనిగా పెట్టుకున్న కొంతమంది టీడీపీ నాయకులు రంగంలోకి దిగారు. ఆ నదుల్లో ఇసుకను నిలువెత్తు లోతున తవ్విచేసి రెండు చేతులా సంపాదించారు.
సామాన్యుల ఇళ్లనూ వదల్లేదు
హుద్‌హుద్ తుపాను బాధితుల కోసం సోంపేట, కవిటి మండల కేంద్రాల్లో నిర్మిస్తున్న ఇళ్లను కూడా టీడీపీ నాయకులు వదల్లేదు. తుపానుతో నష్టపోయినవారికి కాకుండా ఇతరుల నుంచి భారీగా ముడుపులు తీసుకుని ఆ ఇళ్లను కట్టబెట్టారనే విమర్శలు వస్తున్నాయి.
తిత్లీ పరిహారంలోనూ పరిహాసం
ఇటీవల తిత్లీ తుపానుతో నష్టపోయిన వారికి అందాల్సిన పరిహారం విషయంలోనూ ఎమ్మెల్యే అశోక్ అనుచరులు చేతివాటం ప్రదర్శించారు. బాధితుల జాబితాలో బినామీలను జొప్పించి, వారికి జరిగిన నష్టం తక్కువే అయినా అధిక మొత్తంలో చూపించి పరిహారంలో భారీగా పర్సంటేజీలు నొక్కేశారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అంతేకాదు కూలిపోయిన కొబ్బరి చెట్లకు నష్టపరిహారం నమోదుకు సంబంధించిన ఆప్టికేషన్ లాగిన్ రహస్య సంకేతం(కోడ్) తెలుసుకుని ఈ అక్రమాలకు పాల్పడ్డారనే ఆరోపణలు వచ్చాయి.
అలాగే కవిటి మండలంలో కొబ్బరి రైతులకు ప్రకటించిన రుణ ఉపశమనం పథకం (గరిష్ట లబ్ధి రూ.50వేలు) కోసం అమరావతిలోని రైతు ప్రాధికార సంస్థలో మేనేజ్ చేస్తామనే సాకుతో ఎమ్మెల్యే అనుచరుడైన ఓ టీడీపీ నాయకుడు పలువురు రైతుల నుంచి దండిగా వసూళ్లకు పాల్పడ్డాడు. ఆఖరికి రాయితీతో వచ్చే బోటు ఇంజిన్లు, వలలు ఇవ్వడానికీ భారీగానే వసూళ్లు చేయడంపై మత్స్యకారులు తీవ్ర ఆవేదన చెందుతున్నారు.
క్వారీల్లో కాసుల గలగల
కంచిలి మండలంలోని జలంత్రకోట పంచాయతీ పరిధి క్రాంతినగర్, రాధాశాంతినగర్, నువాగడ గ్రామాల ఉనికికే ప్రమాదం పొంచి ఉన్నా అక్కడి కొండపై గ్రానైట్ క్వారీ నిర్వహణకు ఎమ్మెల్యే అశోక్ బంధువులే లీజు పొందడంపై స్థానికులు పెద్ద ఎత్తున నిరసన తెలిపినా ఫలితం లేకపోయింది. కంచిలి మండలంలోని మండపల్లి పంచాయతీ పరిధి బంజిరి నారాయణపురం గ్రామానికి ఆనుకుని ఉన్న కొండపై కంకర తవ్వకాలకు, గ్రానైట్ క్వారీ, క్రషర్ ఏర్పాటుకు అక్రమంగా అనుమతులు ఇచ్చిన వ్యవహారం కూడా వివాదాస్పదమైన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment