ప్రతీకాత్మక చిత్రం
అధికారంలో ఉన్నంత కాలం ఇసుకను మింగేసి, వేల కోట్లు ఆర్జించిన టీడీపీ నేతలే ఈ రోజు ఇసుక కోసం వింత నాటకాలు, కొంగ జపాలు చేస్తున్నారు. ఐదేళ్లపాటు నదులు, వాగులు, వంకలను గుల్ల చేసేసి రూ.3 వేల కోట్లకు పైగా దోచుకుని... ఇప్పుడేమో ఇసుక దోపిడీకి గురువుతుందని ఎదురుదాడికి దిగుతున్నారు. టీడీపీ హయాంలో ఎంత ఇసుకను దోచుకున్నారో జిల్లా ప్రజలందరికీ తెలుసు. రాత్రి, పగలని చూడకుండా వేలాది లారీలతో ఇసుక తరలించిన సందర్భాలు కళ్లారా చూశారు. ఆ రకంగా దోపిడీకి గురి కాకూడదని, తక్కువ ధరకు ఇసుకను అందించాలన్న ఉద్దేశంతో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం కొత్త ఇసుక పాలసీని రూపొందిస్తే తట్టుకోలేకపోతున్నారు. వరదల కారణంగా చేరిన నీటితో ఇసుకను తీయలేని పరిస్థితులను కూడా రాజకీయంగా వాడుకుని తమ అనుభవాలను ఎదుటి వారిపై రుద్దే ప్రయత్నం చేస్తున్నారు. ∙
సాక్షి, శ్రీకాకుళం : జిల్లాలోని ప్రధాన నదులైన వంశధార, నాగావళి, మహేంద్రతనయతోపాటు కాలువలు, వాగులను సైతం తవ్వేసి ఇసుకలో సైతం తైలం తీయవచ్చని టీడీపీ నేతలు నిరూపించారు. గత ఐదేళ్ల కాలంలో నీటి వనరులన్నీ ధ్వంసమైపోయాయి. భూగర్భ జలాలు అడుగంటిపోయి బక్కచిక్కిపోయాయి. టీడీపీ నాయకులు మాఫియాగా తయారై ఇసుకను దోచుకున్నారు. టీడీపీ ప్రభుత్వం ఘనంగా ప్రవేశ పెట్టిన ఉచిత ఇసుక విధానం సామాన్యులకు ఉపయోగపడలేదు గాని టీడీపీ నేతలకు మాత్రం వందల కోట్లు కురిపించింది. ఇసుక ర్యాంపుల ద్వారా దోచుకున్నదెవరంటే టీడీపీ నాయకుల వైపు ప్రజల వేళ్లు చూపిస్తాయి. జిల్లా శాండ్ కమిటీ పర్యావరణ అనుమతులున్న రీచ్‌ల నుంచే ఇసుకను తవ్వాల్సి ఉన్నా అనుమతులతో సంబంధం లేకుండా, పర్యావరణ చట్టాలకు, నిబంధనలకు తూట్లు పొడుస్తూ మాఫియా నదుల్లో కాసుల వేట సాగించారు.
సాయంత్రం 6 గంటల తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ నదుల్లో ఇసుక తవ్వకాలు జరపకూడదని నిబంధనలున్నా అర్ధరాత్రి నుంచి తెల్లవారుజాము వరకూ ర్యాంపుల్లో జేసీబీలు, పొక్లెయిన్లతో తవ్వకాలు జరిపిన దాఖలాలు ఉన్నాయి. లారీలను నేరుగా నదిలోకి తీసుకెళ్లి మరీ ఇసుకను నింపేశారు. వంతెనలకు, ఇరిగేషన్ పంపులు, వాటర్ ఫిల్టర్ సంపులకు 500 మీటర్ల దూరంలో ఇసుక తవ్వకాలను చేపట్టాలి. కానీ నిబంధనలు ఎక్కడా పట్టించుకోలేదు. నిబంధనల ప్రకారం రీచ్ ఒడ్డున మాత్రమే తవ్వకాలు చేపట్టాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ నది లోపలకు మిషనరీ వాహనాలు వెళ్లకూడదు. ఇసుక తవ్వకాలను వినియోగించకూడదు. కానీ నదుల్లోకి రోడ్డులేసి మరీ తవ్వుకుపోయారు. రీచ్‌ల వద్ద లారీకి రూ.20 వేలు, 30 వేలు వసూలు చేశారు.
ఉల్లం‘ఘనుడు’ అచ్చెన్న
మంత్రి హోదాలో కింజరాపు అచ్చెన్నాయుడు దందా అంతా ఇంతా కాదు. నరసన్నపేట నియోజకవర్గంలోని మడపాం దగ్గరి నుంచి రోజుకు వందలాది లారీల ద్వారా విశాఖకు ఇసుక తరలించారు. శ్రీకాకుళం కొత్త రోడ్డు నుంచి మడపాం బ్రిడ్జి వరకు రాత్రి 11 నుంచి తెల్లవారుజాము 3 వరకు స్టాక్ పెట్టుకుని రోజుకు నాలుగైదు వందల లారీల ద్వారా తరలించారు. శ్రీకాకుళం రూరల్ మండలం పరిధిలోని పొన్నాం–బట్టేరు ఇసుక ర్యాంపుల నిర్వహణలో అచ్చెన్నాయుడు అనుచరులు దందా చేశారన్న వాదనలు ఉన్నాయి. ఇవే కాకుండా జిల్లా వ్యాప్తంగా నడిచిన ర్యాంపులకు అచ్చెన్నాయుడు, కూన రవికుమార్‌లను బిగ్‌బాస్‌లనేవారు. ఇక, శ్రీకాకుళం రూరల్ బట్టేరు వద్ద అయితే ఇసుక అక్రమాలను అడ్డుకున్నందుకు గ్రామ రెవెన్యూ అధికారులపై టీడీపీ నాయకులు దాడి చేశారు. ఇద్దరికి గాయాలు కూడా అయ్యాయి. కల్లేపల్లి, భైరీ ర్యాంపుల్లో టీడీపీ నేతల ఆగడాలు తెలిసిందే.
అతని కంటే ఘనుడు కూన
ఆమదాలవలస నియోజకవర్గంలో ఉన్న వంశధార, నాగావళి నదుల్లో అక్రమంగా నిర్వహించిన ఇసుక ర్యాంపుల్లో నాటి ఎమ్మెల్యే కూన రవికుమార్ బంధువులు, అనుచరగణం పాత్ర అందరికీ తెలిసిందే. అప్పట్లో అనేక వివాదాలు చోటు చేసుకున్నాయి. పోతయ్యవలస ర్యాంపు వద్ద నిబంధనలకు విరుద్ధంగా నదిలోనే లారీలు రాకపోకలు సాధించాయంటే పరిస్థితేంటో అర్థం చేసుకోవచ్చు. సరుబుజ్జిలి మండలంలోని పురుషోత్తపురం ర్యాంపు వద్ద ఇసుక కోసం వందల సంఖ్యలో లారీలు బారులు తీరిన సందర్భాలుండేవి. ఆమదాలవలస మండలం దూసి రైల్వే వంతెన సమీపంలో నాగావళి నదిలో ఇసుక తవ్వకాలు జరిపిన దాఖలాలున్నాయి. సరుబుజ్జిలి మండలంలోని పురుషోత్తపురం ఇసుక ర్యాంపు కూన రవికుమార్‌కు బంగారు గని మాదిరిగా ఉపయోగపడిందని అప్పట్లో కోడై కూసింది. 90 రోజుల కాలంలో రూ.10 కోట్ల వరకు ఆర్జించారని అప్పట్లో విపరీతమైన చర్చ నడిచింది.
చివరికీ పురుషోత్తపురం ఇసుక ర్యాంపులోనైతే 25 లారీలతో పాటు నాలుగు జేసీబీలు వరద పోటుకు మునిగిపోయాయి. డ్రైవర్లు, క్లీనర్లు వరదల్లో చిక్కుకున్నారు. రాత్రి వేళల్లో నిబంధనలకు విరుద్ధంగా అర్ధరాత్రి తవ్వకాలు చేస్తుండగా వరద ముంపునకు గురయ్యారు. ఆ వాహనాలన్నీ కింజరాపు అచ్చెన్నాయుడు, కూన రవికుమార్ ప్రధాన అనుచరులవే అన్నది అందరికీ తెలిసిందే. పొందూరు మండలం సింగూరు పేరుతో అనుమతులు ఇచ్చిన ర్యాంపును చూపించి నాగావళికి అవతల ఇసుక తవ్వేసి దూసి గ్రామం మీదుగా అక్రమ రవాణా చేయించారు. ఆమదాలవలస మండలంలోని నిమ్మ తొర్లాడ, జీకేవలస, కొత్తవలస, దూసిపేట, ముద్దాడపేట, తొగరాం, గోపినగర్ ప్రాంతాల్లో కూడా ఇసుకను అక్రమంగా దోచుకున్నారు. విశాఖ అవసరాల పేరుతో ఇసుక మాఫియాను ప్రోత్సహించి, పెద్ద ఎత్తున దోపిడీకి పాల్పడ్డారు.
నరసన్నపేట నియోజకవర్గంలోని మడపాం తదితర ర్యాంపుల్లో నాటి ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి అనుచరులు భారీగా వసూళ్లు చేశారన్న వాదనలు ఉన్నాయి. నరసన్నపేట, జలుమూరు, పోలాకి మండలాల్లో వంశధార నదికి ఆనుకుని ఉన్న ఇసుక టీడీపీ నేతలకు బంగారు బాతులా ఉపయోగపడింది. నరసన్నపేట మండలం లుకలాంలో అక్రమ ఇసుక తవ్వకాలు, ఇసుకను గుర్తించి 2016లో నాటి ఆర్డీవో దయానిధి, డీఎస్పీ భార్గవనాయుడు, అప్పటి మైన్స్ ఏడీలు లుకలాం మాజీ సర్పంచ్ సూర్యనారాయణపై కేసు నమోదు చేసేందుకు యత్నించగా, నాటి ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి అడ్డుకుని ఇసుకాసురులకు కాపు కాశారు. గోపాలపెంట, మడపాంలో జన్మభూమి కమిటీ సభ్యులు, నాటి ప్రజాప్రతినిధులు పెద్ద ఎత్తున దందా నడిపారు. గోపాలపెంట, మడపాం, చేనులవలస, బుచ్చిపేటలో అనధికారిక ర్యాంపు నిర్వహించి బగ్గు రమణమూర్తి పెద్ద ఎత్తున లబ్ధి పొందారన్న ఆరోపణలొచ్చాయి.
పాతపట్నం నియోజకవర్గంలో ఉన్న వంశధార, మహేంద్ర తనయ నదుల నుంచి ఇసుక వ్యాపారం యథేచ్ఛగా సాగింది. వరదల కారణంగా వంశధారలో మేట వేసిన పొనుటూరు, మాతల వద్ద నాటి ఫిరాయింపు ఎమ్మెల్యే కలమట వెంకటరమణ కనుసన్నల్లో అక్రమ తవ్వకాలు జరిగాయన్నది అందరికీ తెలిసిందే. పొలాల్లోని ఇసుక తొలగించి అమ్ముకునేందుకు అనుమతి కావాలని రైతుల పేరుతో కలెక్టర్‌కు దరఖాస్తు చేసుకోవడం, అధికారం అండతో అనుమతులు పొంది పొలాల్లోని మేటను వదిలేసి ఇసుకను అక్రమగా తోడేసిన దాఖలాలు ఉన్నాయి. వంశధార రిజర్వాయర్ నిర్మాణ అవసరాల పేరిట హిరమండలంలోని భగీరథపురం, పిండ్రువాడ, అక్కరాపల్లి, అంబావలి, రుగడ కొమనాపల్లి తదితర గ్రామాల నుంచి ఇసుకను బహిరంగంగా తరలించారు.
ఎచ్చెర్ల నియోజకవర్గంలో తమ్మినాయుడుపేట, ముద్దాడ పేట, పొన్నాడలో అనధికార ఇసుక ర్యాంపులు నడిచాయి. నాటి జెడ్పీ చైర్‌పర్సన్ చౌదరి ధనలక్ష్మి, నాటి మంత్రి కళా వెంకటరావు మధ్య వివాదం కూడా నడిచింది. ఇసుక ర్యాంపుల్లో వాటాల గురించి టీడీపీ నేతలు గొడవకు దిగిన దాఖలాలు ఉన్నాయి. ఇచ్ఛాపురం నియోజకవర్గంలో ఉన్న బాహుదా, మహేంద్రతనయ నదుల్లో రాత్రి, పగలు అనే తేడా లేకుండా ఇసుక అక్రమ తవ్వకాలు జరిపారు. బాహుదా నదిలో నిషేధిత ప్రాంతాలన్నింటిలోనూ ఇసుకను ట్రాక్టర్లతో తరలించారు. రోజుకు సగటున 1000 ట్రాక్టర్ల వరకు ఇసుక తరలించారు. ట్రాక్టర్లతో తరలించిన ఇసుకను దూరంగా మైదాన స్థలాల్లో పోగేసి, అక్కడ నుంచి జేసీబీ సాయంతో లారీల్లో లోడ్ చేయించి, వివిధ ప్రాంతాలకు అమ్మకాలు సాగించారు. ఇచ్ఛాపురం పట్టణ సరిహద్దులో బ్రిడ్జితోపాటు ఇటు ఈదుపురం నుంచి అటు బొడ్డబడ వరకు నదీ తర గ్రామాలన్నింటిలోనూ తవ్వకాలు చేపట్టారు. ఇవన్నీ స్థానిక ఎమ్మెల్యే బెందాళం అశోక్ అండదండలతో, కనుసన్నల్లో ఇసుక తవ్వకాలు జరిగాయి.
టీడీపీ రాక ముందు... అధికారంలోకి వచ్చాక...
టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ఇసుక ట్రాక్టరుకు రీచ్ వద్ద రూ.100కు మించకుండా సీనరేజి వసూలు చేసేవారు. దీనివల్ల సామాన్యుల ఇళ్ల నిర్మాణానికి ఇబ్బంది ఉండేది కాదు. అంతేకాదు పెద్ద భవంతుల నిర్మాణానికి ఎంత ఇసుక అవసరమైనా పెద్దగా ఖర్చు అయ్యేది కాదు. మరోవైపు సీనరేజీ రూపేణా జిల్లాలో ఏటా రూ.50 కోట్ల వరకూ ప్రభుత్వానికి ఆదాయం వచ్చేది. ఇలా వచ్చిన నిధులను స్థానిక సంస్థల మౌలిక సౌకర్యాల కల్పనకు ఖర్చు పెట్టేవారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇసుకను టీడీపీ నాయకులు, కార్యకర్తలకు పెద్ద ఆదాయ వనరుగా మార్చేశారు. ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టి మరీ దోపిడీకి తెరతీశారు. ఈ ఐదేళ్లూ ప్రతీ రోజూ వేలాది లారీలు, ట్రాక్టర్ల ద్వారా అటు ఒడిశా, ఇటు విశాఖ తదితర జిల్లాలకు అక్రమ రవాణా సాగించాయి.
Comments
Please login to add a commentAdd a comment