‘నారా హఠావో.. ఆంధ్రకో బచావో’ | Muslim Minorities Protest Against TDP In Guntur | Sakshi
Sakshi News home page

‘నారా హఠావో.. ఆంధ్రకో బచావో’

Published Fri, Aug 31 2018 12:42 PM | Last Updated on Tue, Oct 16 2018 5:58 PM

Muslim Minorities Protest Against TDP In Guntur - Sakshi

సభలో హామీల అమలు కోరిన ముస్లిం యువకుడిని లాక్కెళ్తున్న పోలీసులు(ఫైల్‌)

గుంటూరు :నాలుగేళ్లుగా తిరగని కార్యాలయం లేదు.. పెట్టని అర్జీ లేదు.. ఒక్క సమస్యా పరిష్కారం కాలేదు. అందుకే సీఎం వద్దే తమ గోడు వెళ్లబోసుకుంటే కాస్తయినా దయ చూపుతారని ఆశించారు. ఎంతో శ్రమకోర్చి కర్నూలు జిల్లా నుంచి గుంటూరులోని ‘నారా హమారా.. టీడీపీ హమారా’ సభ వద్దకు వచ్చారు. పాలకులను కలిసే అవకాశం లేక ప్లకార్డుల రూపంలో వారి ఆవేదనను వెలిబుచ్చారు. ముస్లిం సంక్షేమమే టీడీపీ ధ్యేయమంటూ సీఎం మాటలు మైకుల్లో దద్దరిల్లుతుండగా.. ప్లకార్డులు చూపిన ముస్లిం యువకులను పోలీసులు ఈడ్చుకెళ్లారు. 24 గంటల తర్వాత టీడీపీ నేత మీరావలి ఫిర్యాదుతో కేసు కట్టారు. న్యాయం చేయండయ్యా అని వేడుకుంటే.. అన్యాయంగా అరెస్టు చేశారంటూ బాధితుల కుటుంబ సభ్యులు ఘొల్లుమంటున్నారు.. ఫిర్యాదు చేసిన మీరావలి సైతం.. కావాలనే తనతో టీడీపీ నేతలు కేసు పెట్టించి.. వారంతా తప్పుకున్నారని, తోటి ముస్లిం యువకులకు అన్యాయం జరుగుతుంటే తట్టుకోలేకపోతున్నానని వాపోతున్నారు. సంచలనం రేపిన ఈ ఘటనపై రాష్ట్రంలోని ముస్లింలంతా టీడీపీ ప్రభుత్వంపై రగిలిపోతున్నారు. ఎక్కడికక్కడ నిరసన గళం వినిపిస్తున్నారు.  

ఎన్నికలు రానున్న తరుణంలో ముస్లిం మైనార్టీలను మరోసారి మోసం చేయాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రయత్నం చేస్తున్నారని ముస్లిం మైనార్టీలు మండిపడుతున్నారు. ‘నారా హమారా..టీడీపీ హమారా’ పేరిట నిర్వహించిన సభలో వందల కోట్ల రూపాయల విలువైన అనేక  హామీలు గుప్పించిన చంద్రబాబు, వాటిని ఎలా అమలు చేయగలరో చెప్పాలని నిలదీస్తున్నారు. 2019లో బడ్జెట్‌ ప్రవేశపెట్టే అవకాశం లేదని, ఓట్‌ ఆన్‌ అకౌంట్‌ బడ్జెట్‌లో ఎక్కడి నుంచి నిధులు తెస్తారని ప్రశ్నిస్తున్నారు. ఇచ్చిన హామీలు అమలు చేయమని కోరిన ముస్లిం యువకులను అక్రమంగా అరెస్టు చేసి వేధిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ‘నారా హఠావో.. ఆంధ్రకో బచావో’  నినాదంతో ముందుకు వెళ్తామని పేర్కొంటున్నారు.  చంద్రబాబు ముస్లింలను మోసం చేస్తున్న తీరు వివరిస్తామని చెబుతున్నారు. ఈ సందర్భంగా పలువురు తమ అభిప్రాయాలను వెలిబుచ్చారు.

నిరసన తెలిపితే నాన్‌ బెయిలబుల్‌ కేసులా?
మైనార్టీ సదస్సులో సీఎం చంద్రబాబు చెబుతున్న అవాస్తవాలపై మౌనంగా ప్లకార్డులు ప్రదర్శించిన ముస్లిం యువతను అరెస్టు చేయడం,  మాట్లాడేందుకు వెళ్లిన సంచార్‌ కమిటీ మెంబర్‌ హబిబుల్లాను కూడా అరెస్టు చేసి నాన్‌బెయిలబుల్‌ కేసులు బనాయించారు. చంద్రబాబు వైఖరి చూస్తే ముస్లిం మైనార్టీ పట్ల టీడీపీ సర్కార్‌కు ఉన్న చిత్తశుద్ధి అర్థమవుతోంది.
  – సయ్యద్‌ మహబూబ్, వైఎస్సార్‌ సీపీ మైనార్టీ విభాగంనరసరావుపేట పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు

ముస్లింలను మోసం చేసేందుకు యత్నం
ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ముస్లిం మైనార్టీలను మరోసారి మోసం చేసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రయత్నిస్తున్నాడు. నాలుగున్నరేళ్లలో ఎన్నడూ లేనంతగా ముస్లింల పట్ల చంద్రబాబుకు అమితమైన ప్రేమ గుర్తుకొచ్చింది. మైనార్టీ కార్పొరేషన్‌లో 30 వేల దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. వాటి కోసం వంద కోట్లు  కేటాయిస్తానని చెప్పడం సత్యదూరం.
– షేక్‌ నాగూర్‌మీరాన్,వైఎస్సార్‌ సీపీ సత్తెనపల్లి పట్టణ అధ్యక్షుడు

ఓటు బ్యాంకుగా వాడుకుంటున్నారు
మైనార్టీలను కేవలం టీడీపీ ఓటు బ్యాంకుగా వాడుకుంటోంది. మైనార్టీలు ఏదైనా అడగటానికి కూడా కనీసం మంత్రి లేడు. గుంటూరులో జరిగిన మైనార్టీ సభలో పిల్లలు ఏదో మాట్లాడారని వాళ్లని పోలీసులు తీసుకెళ్లి, లోపల వేసి హింసించడం బాధాకరం.–షేక్‌ జలీల్‌ సాహెబ్,ఏఎంసీ మాజీ వైస్‌ చైర్మన్, సత్తెనపల్లి

హామీలు గుర్తు చేస్తే వేధింపులా..
అధికార పార్టీ ఇచ్చిన హామీలను గుర్తుచేస్తే నేరంగా భావించి మైనార్టీలను అక్రమంగా నిర్బంధించి వేధించటమే కాకుండ, కేసులు నమోదు చేయటం ఆక్షేపణీయం. మ్యానిఫెస్టోలో పేర్కొన్న హామీలనే కదా వారు సభలో ప్లకార్డుల రూపంలో అడిగింది. ప్రజాసామ్యయుతంగా మాకు న్యాయం చేయమని అడగటం కూడా నేరమా. హామీలు అమలు చేయకుండా ఆర్భాటపు సభలెందుకు.
–పీఎస్‌ ఖాన్, ముస్లిం వెల్పేర్‌ అసోసియేషన్‌ నియోజకవర్గ అధ్యక్షుడు, వినుకొండ

సభలు పెట్టినంతమాత్రాన నమ్మరు
ఉర్దూ మీడియం స్కూల్స్‌ ఎక్కడ అని అడగటం తప్పా. మదర్సా విద్యార్థులకు బస్‌పాస్‌లు, యూనిఫామ్స్‌ ఇవ్వమని గుర్తు చేయడం నేరమా. అధికార పార్టీకి మైనార్టీలపై ప్రేమలేదని మంత్రివర్గంలో ఒక్క మంత్రికి కూడా చోటులేకుండ చేసినప్పుడే అర్థమైంది. ఇప్పుడు సభలు పెట్టినంతమాత్రన ముస్లింలు నమ్మరు. అమాయకులను అరెస్టు చేసి వేధించడం తగదు.–ఎస్‌కే గౌస్‌ బాషా, కౌన్సిలర్, వినుకొండ

ప్రజాస్వామ్య స్ఫూర్తికే విరుద్ధం
ప్రజాస్వామ్య వ్యవస్థలో తమ భావాలను వ్యక్తీకరించే స్వేచ్ఛను చంద్రబాబు అణచివేయడం దారుణం. ప్రపంచంలో డిక్టేటర్లుగా వ్యవహరించిన హిట్లర్, ముసోలిన్‌ లాంటి వ్యక్తులే కాలగర్భంలో కలిసిపోయారు. చంద్రబాబు ఎంత. గతంలో పదేళ్లపాటు ప్రతిపక్షంలో కూర్చోబెట్టారు. మళ్లీ అతడికి అదే గతి పట్టబోతుంది. గత ఎన్నికల్లో తానిచ్చిన హామీలను గుర్తు చేసిన ముస్లిం యువకులను దారుణంగా కొట్టి, వారిపై కేసులు నమోదు చేయటం ప్రజాస్వామ్య స్ఫూర్తికే విరుద్ధం. –షేక్‌.ఖాదర్‌బాషా,నరసరావుపేట నియోజకవర్గ అధ్యక్షుడు,ఏపీ ముస్లిం వెల్ఫేర్‌ అసోసియేషన్‌ 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement