
18 ఎఫ్ రద్దు చేయాల్సిందే
కమలనాథన్ కమిటీకి టీ ఉద్యోగ సంఘాల జేఏసీ డిమాండ్
హైదరాబాద్: ఉద్యోగుల విభజన అనంతరం తెలంగాణ రాష్ట్రంలో ఖాళీగా ఉండే పోస్టుల్లో ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులను నియమించేందుకు వీలుకల్పించే 18 ఎఫ్‌ను మార్గదర్శకాల్లోంచి తొలగించాలని తెలంగాణ ఉద్యోగులు, టీచర్లు, గెజిటెడ్ అధికారులు, వర్కర్లు, పెన్షనర్ల జేఏసీ డిమాండ్ చేసింది. 1956 స్థానికతకు సంబంధించి సర్వీస్ పుస్తకాలను ఏపీ సాధారణ పరిపాలనా శాఖ ఆధ్వర్యంలో కాకుండా.. స్వతంత్ర సంస్థతో పరిశీలించే విధంగా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేసింది. ఆర్డర్ టు సర్వ్ పేరిట సాంక్షన్డ్ పోస్టులలో కావాలనే ఏపీ వారిని నియమించే ప్రయత్నాన్ని విరమించుకోవాలని కోరింది. నాలుగో తరగతి ఉద్యోగులందరినీ (జూనియర్ అసిస్టెంట్ స్కేలు కంటే తక్కువగా ఉన్నవారిని) స్థానికత ఆధారంగా వెంటనే బదిలీ చేయాలని డిమాండ్ చేసింది. ఈ మేరకు సోమవారం సచివాలయంలో కమల్‌నాథన్ కమిటీని కలిసి వినతిపత్రాన్ని సమర్పించామని ఉద్యోగ సంఘాల జేఏసీ చైర్మన్ దేవీప్రసాద్ తెలిపారు. అంతకుముందు తమ సంఘాల స్టీరింగ్ కమిటీ సమావేశమై కమలనాథన్ కమిటీ సిఫార్సులు, అభ్యంతరాలపై చర్చించినట్లు ఆయన చెప్పారు. ఆర్డర్ టు సర్వ్ ఉత్తర్వులను రద్దు చేయకపోవడాన్ని ఖండిస్తున్నామని తెలిపారు.
ఏ ప్రాంత ఉద్యోగులను ఆ ప్రాంతానికే కేటాయిస్తూ ప్రొవిజినల్ అలాట్‌మెంట్ పూర్తి చేయాలని కోరారు. 18 ఎఫ్(జీ) ప్రకారం కేంద్ర పాలన అమల్లో ఎవరినైనా నియమిస్తామనడం తెలంగాణ, ఆంధ్ర ప్రభుత్వాల ప్రజాస్వామ్యంపై దాడి చేయడమేనని దేవీప్రసాద్ పేర్కొన్నారు. కాగా.. ప్రత్యేక రాష్ట్రం కోసం ఉద్యమించి సాధించుకున్న సంతోషం కూడా ఉద్యోగులకు లేకుండా పోయిందని టీజీవో నేత, ఎమ్మెల్యే వి.శ్రీనివాస్‌గౌడ్ పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం చేతిలో కమలనాథన్ కమిటీని కీలుబొమ్మను చేసి ఏపీ ప్రభుత్వం ఆడిస్తోందని ఆయన ఆరోపించారు. ఉద్యోగ సంఘం నేత విఠల్ మాట్లాడుతూ... మొత్తం 12 లక్షల ఉద్యోగులు ఉంటే కేవలం 56 వేల మందికే విభజనను పరిమితం చేయడం సరికాదని పేర్కొన్నారు.