ఎంపీటీసీలకు ‘బాబు’ ఝలక్!
సాధారణ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలేవీ చంద్రబాబు నెరవేర్చలేదని రైతులు, డ్వాక్రా సభ్యులు, యువత, నిరుద్యోగులు ఇప్పటికే రగిలిపోతున్నారు! అలాంటి సామాన్యులకే కాదు రాజకీయ నాయకులకూ ఝలక్ తగిలింది! స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు ముందు ప్రకటించిన ఎంపీటీసీల గౌరవవేతనం పెంపు తాయిలం కూడా హుష్‌కాకి అయ్యింది! నెలనెలా ఇస్తున్న రూ.750 వేతనం ఏకంగా రూ.3 వేలకు పెంచామని, మూణ్నెల్ల మొత్తాన్ని ఒకేసారి బ్యాంకు ఖాతాల్లో జమ అవుతుందని టీడీపీ నాయకులు ఢంకా భజాయించి చెప్పారు. ఏప్రిల్ 1వ తేదీన ఎంపీటీసీ సభ్యులకు తెలిసిందేమిటంటే.. తాము మోసపోయామని!
సాక్షి ప్రతినిధి శ్రీకాకుళం: గత నెలలో ముగిసిన ఎమ్మెల్సీ ఎన్నికలలో స్థానిక సంస్థల కోటా సీట్లు కూడా ఉన్నాయి. జిల్లాలో పీరుకట్ల విశ్వప్రసాద్ పదవీకాలం ముగియడంతో స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ స్థానానికి ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఎన్నికలలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులతో పాటు నగరపాలక, పురపాలక సంఘాల సభ్యులకు ఓటుహక్కు ఉంటుంది. వారిలో ఎంపీటీసీల ఓట్లే అధికం. అభ్యర్థి విజయాన్ని శాసించేదీ వారే! ఇది ముందే గ్రహించిన చంద్రబాబు ప్రభుత్వం ఎంపీటీసీల నెలవారీ గౌరవ వేతనం రూ.750 నుంచి రూ.3 వేలకు పెంచుతున్నట్లు ప్రకటించింది.
అంతకు కొన్నాళ్ల ముందే పంచాయతీరాజ్ వ్యవస్థలో ఎంపీటీసీలు, జెడ్పీటీసీలను రద్దు చేయాలని కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు పంపింది చంద్రబాబు ప్రభుత్వమే! అంతేకాదు రాజ్యాంగ స్ఫూర్తికి గండికొడుతూ జన్మభూమి కమిటీలను తమ నెత్తినపెట్టారని గ్రామాల్లో సర్పంచులు, ఎంపీటీసీలు ఇప్పటికే తీవ్ర ఆవేదనలో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఎంపీటీసీలకు గౌరవ వేతనం పెంపు... అదీ మూడు రెట్లు పెంచారంటేనే అమలుపై పలువురిలో సందేహం కలిగింది! ఎన్నికల తాయిలం కదా! కచ్చితంగా అమలవుతుందనే ఆశలు పెట్టుకున్నారు.
ముందే చెల్లించేస్తామని చెప్పి...
గౌరవ వేతనం పెంపుపై ఎంపీటీసీలకు అనుమానం వస్తే ఎమ్మెల్సీ ఎన్నికలలో ప్రభావం కచ్చితంగా ఉంటుంది. దీన్ని ఊహించిన అధికార పార్టీ నాయకులు... గౌరవ వేతనం మూణ్నెల్లదీ ఒకేసారి బ్యాంకు ఖాతాల్లో జమ అయిపోతుందని నమ్మించారు. వాస్తవానికి మార్చి నెల వేతనం ఏప్రిల్‌లో జమ కావాలి. కానీ జనవరి నుంచి మార్చి వరకూ అంటే మూణ్నెల్లదీ ఒకేసారి రూ.9 వేల చొప్పున వచ్చేస్తుందని చెప్పుకొచ్చారు.
ఈ ప్రకారం జిల్లాలోని 676 మంది ఎంపీటీసీ సభ్యులకు రూ. 60.84 లక్షలు అందాలి. ఆ మేరకు జిల్లా పరిషత్తు ముఖ్య కార్యనిర్వహణాధికారి (సీఈవో) నుంచి జిల్లా ట్రెజరీకి నిధులు వెళ్లాయి. అక్కడి నుంచి సబ్ ట్రెజరీలకు చేరాయి. ఇక బ్యాంకు ఖాతాల్లో జమే తరువాయి కావడంతో మార్చి 31వ తేదీ అర్ధరాత్రి వరకూ ఎంపీటీసీలు ఎదురు చూశారు. తెల్లారితే ఏప్రిల్ ఒకటో తేదీ!
వెనక్కి మళ్లిన నిధులు..
ఈ మూడు నెలల గౌరవ వేతనం నిధులు జిల్లా ట్రెజరీకి పంపినా రాష్ట్ర ప్రభుత్వం అప్పటికే చెల్లింపులు నిలిపేయాలంటూ అనధికార ఆంక్షలు (ఫ్రీజింగ్) విధించింది. దీని ఫలితంగా గౌరవ వేతనం ఎంపీటీసీల బ్యాంకు ఖాతాలకు జమ కాలేదు. అంతేకాదు ఈనెల ఒకటో తేదీ నుంచి కొత్త ఆర్థిక సంవత్సరం మొదలు కావడంతో ఆ నిధులు కాస్తా వెనక్కిమళ్లిపోయాయి. దీంతో ఎంపీటీసీలకు నిరాశే మిగిలింది.
ఖాతాల నంబర్లు తీసుకుంటే నమ్మాం
మాకు రావాల్సిన గౌరవ వేతనం కూడా కొన్ని నెలలుగా రావట్లేదు. కానీ ఎమ్మెల్సీ ఎన్నికలకు ముందు వేతనం పెంపు అని ప్రకటించారు. మా బ్యాంకు ఖాతా ల నంబర్లు కూడా తీసుకుంటే నమ్మాం. తీరా ఇప్పటికీ చెల్లింపులు లేవు. – బొత్స పుష్ప, ఎంపీటీసీ, వెలగవాడ, పాలకొండ మండలం
ఎన్నికల లబ్ధి కోసమే హామీ...
ముఖ్యమంత్రి చంద్రబాబు ఎమ్మెల్సీ ఎన్నికలలో గట్టెక్కడం కోసం గౌరవ వేతనం పెంపు ప్రకటించారు. తీరా ఇప్పటివరకూ అమలు కాలేదు. ఒకపక్క ఎంపీటీసీ, జడ్పీటీసీ వ్యవస్థనే రద్దు చేయాలని చూస్తున్న చంద్రబాబు అంతకన్నా మేలు చేస్తారని ఊహించలేం. – నడుపూరు శ్రీరామమూర్తి, ఎంపీటీసీ, నందిగాం–2