జాతకాల పిచ్చికి నా బిడ్డ బలయ్యాడు
భర్త, అత్తమామలపై మోక్షజ్ఞతేజ తల్లి విమలప్రియ ఆరోపణలు
నా బిడ్డ పుట్టగానే జాతకం బాగాలేదంటూ పూజలు చేశారని ఆవేదన
బిడ్డ కనిపించకపోతే రోజంతా నాకు చెప్పలేదని మండిపాటు
నా కడుపున పుట్టడమే వాడు చేసిన నేరమా అంటూ సూటిప్రశ్న
ఎవరి పనో తేల్చాలంటూ ఎస్పీకి వినతి
కొత్త మలుపు తిరిగిన బాలుడి హత్యకేసు
గుంటూరు : బాబాయి చేతుల్లో హతమైనట్లుగా చెబుతున్న చిన్నారి మోక్షజ్ఞతేజ వ్యవహారం అనూహ్య మలుపుతిరిగింది. బాబు మృతికి జాతకాల పిచ్చే కారణమని తల్లి విమలప్రియ ఎస్పీకి ఫిర్యాదు చేసేందుకు రావడంతో సరికొత్త ఆలోచనలకు తెరలేచింది. బాబాయి హరిహరణ్ కావాలని చంపాడని కొందరు, అతనికి మతిస్థిమితం బాగాలేక చంపాడని మరికొందరు చెబుతుండగా తన బిడ్డ మృతికి అత్తింటి వారి జాతకాల పిచ్చే కారణమంటూ తల్లి విమలప్రియ చెప్పడంతో అంతా అవాక్కయ్యారు. బిడ్డను కోల్పోయిన షాక్‌తో విమలప్రియ అలా మాట్లాడుతోందని, బాలుడి మృతికి తమకు ఎటువంటి సంబంధం లేదని విమలప్రియ భర్త, అత్తమామలు చెబుతున్నారు. విమలప్రియ ఎస్పీ కార్యాలయంలో విలేకర్లతో మాటాడిన విషయాలు ఆమె మాటల్లోనే...
‘జాతకాల పిచ్చికి నా బిడ్డ బలయ్యాడు.. నా కడుపున పుట్టడమే వాడు చేసిన నేరమా.. బిడ్డ పుట్టగానే జాతకం బాగాలేదంటూ పూజలు చేశారు.. నా బిడ్డ జాతకంలో తండ్రికి ప్రాణహాని ఉందని ఎవరో సిద్ధాంతి చెప్పారట.. నా బిడ్డ కనిపించకుండా పోతే ఒక రోజంతా నాకు తెలియకుండా చేశారు.. నేను తెనాలి వచ్చి చూసేంత వరకూ ఆ విషయాన్ని దాచారు.. నేను, నా బిడ్డ వారికి అడ్డుగా ఉన్నామని చెబితే వారి జీవితాల్లోంచి వెళ్ళిపోయేదాన్ని.. అంతేగాని ఇంత ఘాతుకానికి తెగబడి నాకు కడుపుకోత మిగులుస్తారా.. నా బిడ్డ ఎలా చనిపోయాడు.. ఎవరు చంపారనే విషయాలు బయటకు రావాలి’ అంటూ ఈ నెల 25వ తేదీన బాబాయి చేతిలో హతమైన ఏడాదిన్నర చిన్నారి మోక్షజ్ఞతేజ తల్లి విమలప్రియ ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం రాత్రి గుంటూరు నగరంలోని ఎస్పీ కార్యాలయంలో ఆమె విలేకర్లతో మాట్లాడుతూ తనకు భాస్కరరావుతో పెళ్ళైనప్పటి నుంచి ఆయన జాతకాల పిచ్చికి ఎన్నోసార్లు గొడవలు జరిగాయని ఆమె చెప్పారు. పెళ్లయిన కొత్తలో మామకు ప్రమాదం జరిగితే తనను పెళ్లి చేసుకోవడం వల్లే ఇలా జరిగిందంటూ వేధించాడనీ, అయినా పట్టించుకోకుండా ఇన్నాళ్లూ కాపురం చేశానని తెలిపారు. తాను, తన భర్త ఇద్దరం ఉద్యోగాలు చేస్తుండటంతో రెండు నెలలుగా తెనాలిలోని తమ అత్తగారింటిలో బిడ్డను ఉంచి వారంవారం వచ్చి చూసి వెళ్తుంటామని చెప్పారు.
బిడ్డకు ఎప్పుడు ఒంట్లో బాగాలేకపోయినా ఫోన్‌చేసి ఏ మందులు వాడాలని అడిగేవారని వారం రోజులుగా తన బిడ్డకు జ్వరం వస్తున్నా కనీసం ఫోన్ కూడా చేయలేదని ఆమె వాపోయారు. మోక్షజ్ఞతేజ హత్యకు గురయ్యే రెండు రోజుల ముందే కనిపించకుండా పోయినప్పటికీ తెనాలి వచ్చే వరకూ తనకు చెప్పలేదని, పైగా బిడ్డ ఎక్కడ ఉన్నాడనే విషయం కూడా సిద్ధాంతిని అడిగారని ఆవేదన వ్యక్తం చేశారు. విజయవాడ వైపున బతికే ఉన్నాడని సిద్ధాంతి చెప్పడంతో తన పెద్ద మరిది చంద్రశేఖర్ వెతకడానికి వెళ్లగా తన భర్త మాత్రం ఇంటిలోనే ఉండిపోయాడని చెప్పారు. బిడ్డపై మమకారం ఉంటే ఇంటిలో ఎందుకు ఉంటారంటూ ఆమె అనుమానం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా విమలప్రియ తల్లిదండ్రులు మీరయ్య, చంద్రకుమారి మాట్లాడుతూ జాతకాల పిచ్చితో తన మనవడిని నిర్ధాక్షిణ్యంగా హతమార్చారని వాపోయారు. ముక్కుపచ్చలారని ఏడాదిన్నర బిడ్డను చంపడానికి వారికి చేతులు ఎలా వచ్చాయంటూ బోరున విలపించాడు. అసలు తన బిడ్డ ఎలా చనిపోయాడో.. ఎవరు చంపారో తేల్చాలంటూ మోక్షజ్ఞతేజ తల్లి విమలప్రియ ఎస్పీకి వినతిపత్రం సమర్పించారు. బాధితుల సమస్య విన్న ఎస్పీ మాట్లాడుతూ ఈ కేసును ప్రత్యేకంగా పరిగణించి దర్యాప్తు కొనసాగిస్తానని హామీ ఇచ్చారు.
షాక్‌లో ఉండి అలా మాట్లాడి ఉంటుంది.
కన్న బిడ్డ చనిపోవడ ంతో మా కోడలు షాక్‌కు గురైంది. షాక్‌వల్లే అలా మాట్లాడి ఉంటుందని అనుకుంటున్నాం. మా కోడలు విమలప్రియ మంచిదే. ఆమె అలా మాట్లాడినందువల్ల నేనేమీ బాధపడటం లేదు. నా కొడుకు హరిహరణ్‌పై కేసు నమోదు చేయమని పోలీసులకు నిజాయతీగా చెప్పాను. - గోడపాటి రాంబాబు, మోక్షజ్ఞ తేజ తాత, తెనాలి