‘ముహూర్తం’ కుదిరింది.. క్యారెక్టర్ దొరికింది
సినిమాలు అంటే పిచ్చి. నటనంటే ప్రాణం. అందుకే ఆ యువకుడు హైదరాబాద్ రెలైక్కాడు. అవకాశం కోసం ఫిలింనగర్, జూబ్లీహిల్స్‌తో పాటు సినీస్టార్‌స, స్టూడియోలుండే ప్రతి చోటుకు వెళ్లాడు. అంతటా నిరాశే. ఇంటిబాట తప్పలేదు. కుటుంబ సభ్యులతో కొంత డబ్బు ఇప్పించుకుని మళ్లీ చలో భాగ్యనగరం. ఈ సారి ఓ ఫిలిం ఇన్సిట్యూట్‌లో శిక్షణ తీసుకున్నాడు. ఇండస్ట్రీ వారితో పరిచయాలు ఏర్పడ్డాయి. కట్ చేస్తే ఒక కెమెరామెన్ సాయంతో ముహూర్తం అనే సినిమాలో అవకాశం లభించింది. క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా చాన్‌స కొట్టేశాడు. అలా మొదలైన సినీ ప్రయాణంలో ఎన్నో కష్టాలు.. అయినా ఎదురీదుతున్నాడు.
* మంచి నటుడిగా స్థిరపడాలన్నదే నా లక్ష్యం
* సినీ, టీవీ ఆర్టిస్ట్ వెంకట
ఎమ్మిగనూరు టౌన్: వెంకట గోవిందురాజు అలియాస్ వెంకట 14 ఏళ్లక్రితం ఎమ్మిగనూరుకు ఎస్‌ఎంటీ కాలనీలో నివాసం ఉండేవారు. తల్లిదండ్రులు రంగయ్య, సుభద్రమ్మలు. తండ్రి చేనేత సహకార ఉత్పత్తి, విక్రయ సంఘం (వైడబ్ల్యూసీఎస్)లో చిరుద్యోగి. స్థానిక వీవర్స్‌కాలనీ హైస్కూల్‌లో వెంకట పదో తరగతిదాకా చదివాడు. పుస్తకాల కన్నా సినిమా సీన్లే ఆయన కళ్లలో కదలాడేవి. అలా చదువుకు శుభం కార్డు పడింది. తర్వాత సినిమాల్లో నటించాలని హైదరాబాద్ బయల్దేరాడు. అవకాశాల కోసం ప్రారంభంలో నాలుగేళ్లు కడుపుకాల్చుకొని స్టూడియోలు, దర్శకుల చుట్టూ తిరిగారు. అయినా ఫలితం లేదు. దీంతో మళ్లీ ఊరికొచ్చాడు. కుటుంబ సభ్యులతో కొంత మొత్తాన్ని తీసుకువెళ్లి అభినయ ఫిలిం ఇన్సిట్యూట్‌లో ఆరు నెలలు పాటు శిక్షణ పొందాడు. అక్కడ కొద్ది మంది డెరైక్టర్లు, కెమెరామెన్లతో పరిచయం ఏర్పడింది.
బంగారు చౌదరి అనే కెమెరామెన్ ‘ముహూర్తం’ అనే సినిమాలో దర్శకుడు మూర్తికి చెప్పి చిన్న వేషం ఇప్పించారు. తర్వాత సీతయ్య, బాబీలో జూనియర్ ఆర్టిస్టుగా నటించారు. ఆపై అవకాశాలు రాలేదు. టీవీ రంగం వైపు అడుగులు వేశారు. వివిధ టీవీ చానల్స్‌లో ప్రసారమైన లక్ష్యం, మిస్టర్ రోమియో, తూర్పుపడమర, ఏడు అడుగులు, శ్రీమతి శ్రీ దేవత తదితర సీరియల్స్‌లో క్యారెక్టర్ అర్టిస్టుగా నటించారు. కానీ తిరిగి సినిమా వైపు మనస్సు మొగ్గుచూపడంతో 1940 ఒక గ్రామంలో, అదేనీవు..అదేనేనులో హీరో శశాంక్‌కు మిత్రుడిగా, రైల్వేస్టేషన్, కోయిల, అమ్మనాన్న ఊరెళితే, తమాషా, నాకంటూ ఒకడు, శ్రీమతి కల్యాణం సినిమాల్లో నటించారు.
ఇటీవల స్వాతి చినుకులు (ఈటీవీ), సీరియల్‌లో సేల్స్‌మెన్‌గా నటించారు. సినిమా అల్లుడు (జెమినీ టీవీ)లో ఫైనాన్సియర్‌గా నటించారు. డిసెంబర్ నుంచి ఆ సీరియర్ ప్రారంభం కానుంది. పస్తుతం కన్నడ, తెలుగులో నిర్మిస్తున్న దండు, కడప ముద్దుబిడ్డ సినిమాల్లో నటించానని, అవి రిలీజ్ కావాల్సి ఉందని వెంకట పేర్కొన్నారు. ఇప్పటి వరకు 20కు పైగా సినిమాల్లో చిన్నచిన్న వేషాల్లో నటించానని, మున్ముందు దర్శక, నిర్మాతలు అవకాశాలు ఇస్తే తన టాలెంట్‌ను నిరూపించుకుని క్యారెక్టర్ ఆర్టిస్టుగా సినిమా ఇండస్ట్రీలో స్థిరపడేందుకు శ్రమిస్తానని ఆయన తన మనసులో మాట చెప్పారు.