సాక్షి, గుంటూరు : ఎన్నికల ముందు పాదయాత్ర సందర‍్భంగా ఓ హామీ ఇచ్చాను. ఇచ్చిన ప్రతి మాటను నిలబెట్టుకోవాలనే ఆరాటంతో ఈ ఆర్నెల్లు పని చేశాం. అందులో భాగంగా ఇచ్చిన మాటలో ఒకదాన్ని నిలబెట్టుకునేందుకు ఇక్కడకు వచ్చాను. మేనిఫెస్టోను భగవద్గీత, బైబిల్, ఖురాన్‌గా భావిస్తున్నాను. ఇవాళ రకరకాల ఆరోపణల మధ్య రాష్ట్రంలో పరిపాలన చూస్తున్నాం. మంచి పరిపాలన ఎక్కడైనా జరుగుతుంటే జీర్ణించుకోలేని పరిస్థితి. ఈ మధ్య కాలంలో నా మతం, కులం గురించి కూడా మాట్లాడారు. దానికి నాకు చాలా బాధ అనిపించింది. నా మతం మానవత్వం. ఈ వేదికగా చెబుతున్నా... నా కులం మాట నిలబెట్టుకునే కులం. నేను ఉన్నాను... నేను విన్నాను అనే మాటను నిలబెట్టుకున్నందుకు గర్వంగా ఉంది. ఇక వాళ్లు చేస్తున్న అవాకులు, చెవాకులు పక్కనపెడితే..ఇవాళ జరుగుతున్న ఓ గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. మనిషి ప్రాణాలకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ ఈ ఆరోగ్య రంగంలో విప్లవానికి నాంది పలికాం. ఇందుకు నాకు సంతోషంతో పాటు గౌరవంగా ఉంది’ అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు.
జనవరి 1 నుంచి కొత్త ఆరోగ్యశ్రీ కార్డులు
గుంటూరు మెడికల్ కాలేజీ జింఖానా ఆడిటోరియంలో వైఎస్సార్ ఆరోగ్య ఆసరా పథకాన్ని ఉద్దేశిస్తూ ఆయన ప్రసంగించారు. ‘ఆరోగ్యలో శస్త్ర చికిత్స అనంతరం విశ్రాంతి సమయంలో రోజుకు రూ.225 చొప్పున నెలకు గరిష్టంగా రూ.5వేలు చెల్లిస్తాం. వైద్యుల సిఫార్సుల మేరకు ఆర్థిక సాయం ఎంతవరకూ ఇవ‍్వాలో నిర్ణస్తాం. పాదయాత్ర సందర్భంగా నేను మాటిచ్చాను. రూ.5 లక్షలలోపు ఆదాయం ఉన్నవారికి జనవరి 1 నుంచి కొత్త ఆరోగ్యశ్రీ కార్డులు జారీ చేస్తాం. కార్డుతో పాటు క్యూఆర్ కోడ్‌లో పేషెంట్‌కు సంబంధించి మెడికల్ రిపోర్టును అందులో పొందుపరుస్తాం. అలాగే ఆరోగ్యశ్రీ పరిధిలోకి 2వేల రోగాల వరకూ పెంచుతున్నాం. పైలట్ ప్రాజెక్ట్ కింద ముందుగా పశ్చిమ గోదావరి జిల్లాలో జనవరిలో ప్రారంభిస్తాం. ఆ తర్వాత ఏప్రిల్ నుంచి ఒక్కో జిల్లా చొప్పున విస్తరించుకుంటూ వెళతాం.
ప్రభుత్వ ఆస్పత్రుల్లోనూ నాడు-నేడు
వైద్యం ఖర్చు రూ.1000 దాటితే ఆరోగ్యశ్రీ వర్తిస్తుంది. వచ్చే ఏప్రిల్ నాటికి 1060 కొత్త 104, 108 వాహనాలను కొనుగోలు చేస్తాం. ఫోన్ కొట్టిన 20 నిమిషాల్లో అంబులెన్స్ మీ ముందు ఉంటుంది. ఆస్పత్రికి తీసుకువెళ్లడమే కాకుండా, మంచి వైద్యం అందించి చిరునవ్వుతో తిరిగి ఇంటికి వెళ్లేలా చూస్తాం. అలాగే స్కూల్ విద్యార్థులకు ఉచిత కంటి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నాం. హైదరాబాద్, బెంగళూరు, చెన్నైలోని 130కి పైగా సూపర్ స్పెషాల్టీ ఆస్పత్రుల్లో ఆరోగ్యశ్రీ వర్తిస్తుంది. ఈ నెల 15 నుంచి 510 రకాల మందులను ప్రభుత్వ ఆస్పత్రుల్లో అందుబాటులోకి తెస్తాం. వచ్చే ఏడాది ఏప్రిల్ నుంచి అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో డబ్ల్యూహెచ్‌వో ప్రామాణికం ఉన్న మందులు అందుబాటులోకి తెస్తాం. ప్రభుత్వ ఆస్పత్రుల్లోనూ నాడు-నేడు అమలు చేస్తాం. మూడేళ్లలో ప్రభుత్వ ఆస్పత్రుల రూపురేఖలు మార్చి, ప్రైవేట్ ఆస్పత్రులకు దీటుగా అభివృద్ధి చేస్తాం
హెల్త్ రికార్డులతో కూడిన కొత్త ఆరోగ్యశ్రీ కార్డులు జారీ చేస్తాం. డయాలసిస్ రోగులకు ఇస్తున్న విధంగానే తలసేమియా, హీమెఫిలియా వ్యాధిగ్రస్తులకు జనవరి 1 నుంచి నెలకు 10వేలు ఇస్తాం. అలాగే కేన్సర్ పేషంట్లు కూడా ఆరోగ్యశ్రీ పరిధిలోకి వస్తారు. ఆస్పత్రుల్లో ఖాళీగా ఉన్న డాక్టర్లు, నర్సులు, ఇతర ఆస్పత్రి సిబ్బందికి సంబంధించిన పోస్టులు భర్తీ చేస్తాం.’ అని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment