అంతుచిక్కని హత్యలు
నరసరావుపేట టౌన్: గుంటూరు జిల్లాలోని నరసరావుపేట డివిజన్ పరిధిలో గత పదిహేను రోజుల వ్యవధిలో చోటుచేసుకున్న వరుస హత్య కేసుల్లో మిస్టరీ వీడడం లేదు. హత్యకు గురికాబడ్డవారు ఎవరు..ఎందుకు హత్య గావించబడ్డారు.. సంఘటనలకు కారకులెవరు.. జిల్లావాసులా.. లేక ఇతర ప్రాంతాలవారా అనే అంశం తేలక.. కేసుల్లో పురోగతి లభించక పోలీసులు తలలు పట్టుకుంటున్నారు. వివరాలిలా ఉన్నాయి.. ఈనెల 3న చిలకలూరిపేట మండలం కావూరు-లింగంగుంట్ల గ్రామ సమీపంలోని కుప్పగంజివాగు వద్ద గుర్తు తెలియని యువతి హత్యకు గురైంది. ఆ కేసుకు సంబంధించి ఇంతవరకు మృతురాలు ఎవరనేది తేలలేదు. అసలు హత్యా లేక ఆత్మహత్య అనేది పోలీసులు నిర్థారించలేకపోతున్నారు. ఆ యువతి జిల్లా వాసి లేక ఇతర ప్రాంతానికి చెందినదా అనేది పోలీసులు ఆరా తీస్తున్నారు.
అదేవిధంగా 9వ తేదీ రొంపిచర్ల మండలం మునమాక రైల్వేస్టేషన్ సమీపంలో గుర్తుతెలియని 40 సంవత్సరాల వయస్సు గల వ్యక్తి రైలు పట్టాలపై శవమై కనిపించాడు. తొలుత రైలులో నుంచి జారి పడి మృతి చెంది ఉంటాడని పోలీసులు భావించారు. మృతుని జేబులో రైలు టికెట్ లభించకపోవడంతో ఎవరైనా హత్యచేసి అక్కడ పడవేశారా.. లేక ఆత్మహత్య అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. మృతిచెందిన వ్యక్తి ఎవరనేది నేటికీ తేలలేదు. అదే రోజు పట్టణంలోని బరంపేటలో గల కోళ్ళ లక్ష్మయ్య వీధిలో శ్రీనివాసరెడ్డి, అనిత దంపతులు ఫ్యానుకు ఉరివేసుకొని మృతిచెందారు. వీరిది తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి. ఎనిమిది నెలల క్రితం జీవనోపాధి కోసం పట్టణానికి వచ్చి అద్దె ఇంట్లో నివాసం ఉన్నారు.
సమాచారం తెలుసుకున్న బందువులు హుటాహుటిన మృతదేహాలను స్వగ్రామానికి తరలించారు. ఆర్థిక లావాదేవీల నేపథ్యంలో భార్యాభర్తల మధ్య వివాదం చోటుచేసుకొని అనితను హత్యచేసి అనంతరం శ్రీనివాసరెడ్డి కూడా ఆత్మహత్యకు పాల్పడ్డాడని పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలినట్లు సమాచారం. ఈనెల 14న మండలంలోని జొన్నలగడ్డ శివారు తిరుమల ఇంజినీరింగ్ కళాశాల వెనుకభాగంలో రైల్వే పట్టాల పక్కన 40 సంవత్సరాల వయస్సుగల వ్యక్తి హత్య గావించబడ్డాడు. రెండు చేతులు నూలుతాడుతో బంధించి తలపై బలమైన ఆయుధంతో దాడిచేసి హత్య చేసినట్లు పోలీసులు భావిస్తున్నారు.
మృతుని చొక్కా కాలర్‌కు ఉన్న లేబుల్ ఆధారంగా కర్నూలువాసిగా భావించి ప్రత్యేక పోలీసు బృందం అక్కడకు వెళ్లి ఆరా తీస్తోంది. తాజాగా మంగళవారం నకరికల్లు మండలం దేచవరం మిద్దె వద్ద గుంటూరుకు చెందిన జ్యోతిష్యుడు భరత్‌కవి ఏడుకొండలు ఉరఫ్ సీతారామయ్య హత్య గావించబడ్డాడు. మృతుని కుమారుడు ఇచ్చిన ఫిర్యాదుతో రొంపిచర్ల మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన కొందరు హత్యచేసి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. నిందితులు పరారీలో ఉన్నారు. నిందితులు చిక్కితేగాని ఏడుకొండలు హత్యకు గల కారణాలు బయటపడతాయి.
ఓ వైపు కేసులు ఛేదించాలంటూ ఉన్నతాధికారుల నుంచి ఒత్తిళ్లు, మరో వైపు మృతుల ఆచూకీ లభించక కేసుల్లో పురోగతి లేక అధికారులు అయోమయానికి గురవుతున్నారు. మృతిచెందిన వ్యక్తులు ఎవరనేది స్పష్టమైతే కాని ఈ కేసుల్లో మిస్టరీ వీడేటట్లు లేదని పోలీసువర్గాలు భావిస్తున్నాయి. మృతులను గుర్తించేదిశగా పోలీసు అధికారులు ముమ్మరంగా ప్రయత్నిస్తునప్పటికీ ఫలి తం దక్కడం లేదు. మిస్టరీగా మారిన హత్య కేసులు చివరికి ఏమవుతాయానేది వేచి చూడాల్సి ఉంది.